Home Telugu Articles చాపకింద నీరులా.. ‘సాంస్కృతిక విధ్వంసం’!

చాపకింద నీరులా.. ‘సాంస్కృతిక విధ్వంసం’!

0
SHARE

ఒకఫ్పుడు దసరా పండుగ వచ్చిందంటే చాలా ఉత్సాహం, ఉత్సుకత ఉండేవి. సెలవుల్లో పల్లెలకు చేరాలనే ఉబలాటం పిల్లలకూ, పెద్దలకూ ఉండేది. పట్టణాల్లో స్థిరపడిన వ్యక్తులు కూడా పెట్టేబేడా సర్దుకొని ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పల్లె దారి పట్టేవారు. ‘బతుకమ్మ’ ఆడే అక్కాచెల్లెళ్ల కోసం అడవంతా గాలించి సోదరులు గోరింట పువ్వులు, బీర, కట్లపూలు, గునుగు, గుమ్మడి, టేకు, అల్లిపూలు తెచ్చి పెట్టేవారు. తాము సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో కొత్తబట్టలు కొనుక్కొని, పిండివంటలు (మాంసాహారం తినేవారు కూడా) తిని ఇంటికి వచ్చిన అతిథులతో ఆనందంగా గడిపేవారు. అలాగే దసరా సమయంలో అందరూ వ్యవసాయ పనులు తగ్గించుకొని తీరిగ్గా ఉండేవారు కాబట్టి పండుగకు ముందు వేసే పగటి వేషాలు అందరినీ అలరించేవి. గ్రామీణ కళాకారుల ప్రతిభకు అద్దం పట్టేవి. వారి అభినయంలో, వాక్చాతుర్యంలో ఇతరులను అనుకరిస్తూ చేసే ఈ పాత్రలు సంఘంలోని బలహీనతలను, ప్రత్యేకతలను వ్యంగ్యంగా ఎత్తిచూపటం ఈ వేషాల ప్రధాన ఉద్దేశం. ఎవరూ బాధపడని సున్నిత హాస్యం ద్వారా మనుషుల్లోని చెడును బయటపెట్టేవారు. పఠాన్ వేషం, లత్కోర్‌సాబ్, తాగుబోతు వేషం, భిక్షకుల వేషం, పిట్టలదొర.. ఇలా అనేక వేషాలు సమాజంలోని రుగ్మతలను ప్రత్యక్షంగా బయటపెట్టేవి.

ఇపుడు ఇదంతా ఎందుకు ధ్వంసమైంది? మనిషిని ఒక యంత్రంలా మార్చి వ్యాపార, వాణిజ్య చట్రంలో బంధించి క్షణం తీరిక లేని వ్యక్తిగా చేస్తున్నది ఎవరు? భావోద్వేగాలతో, సంఘర్షణలతో మనం ఎందుకు జీవిస్తున్నాం? ఇలాంటి మౌలిక ప్రశ్నలకు మనం దూరం అయ్యేలా- ఏదో అదృశ్యశక్తి మనల్ని సాంస్కృతిక వి ధ్వంసం వైపు నడిపిస్తున్నది అన్న సత్యం తెలుసుకొనే సమయం కూడా మనకు లేదు. ‘సజీవంగా వున్న పూలు ఉదయం వికసిస్తాయి. ప్లాస్టిక్ పూలు సాయంత్రానికి వాడిపోతాయి’ అంటాడు ఓ తత్త్వవేత్త. మనముందు జీవం వున్న అన్ని విషయాలను ‘టీవీ’ అనే ‘మాయామంత్రజాలపు’ పెట్టెలో మూసేశాం. ఇందుకు ఒక ఉదాహరణ బాగా పనికివస్తుంది. 1914 నుండి 1917 వరకు జరిగిన ప్రథమ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ గొప్ప విజయాన్ని సాధించింది. అదే ఫ్రాన్స్ 1945లో దారుణంగా రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో గెలవగానే ఉన్మాదంతో కళ్లు మూసుకుపోయిన ఫ్రాన్స్ విచక్షణ కోల్పోయింది. అక్కడ 1926లో టెలివిజన్ ప్రారంభం అయ్యింది. పబ్బులు, క్లబ్బులు విస్తృతంగా తెరవబడినాయి. తర్వాత ‘కాసినోస్’ తెరచుకొన్నాయి. జూదం ఆడేందుకు కావలసిన స్థలాలు వచ్చేశాయి. ఫ్రాన్స్‌కు చెందిన ఒక తరం మొత్తం ఇందులో పడి కొట్టుకుపోయింది. అంత శక్తిమంతమైన దేశం ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల తన అస్తిత్వం కోల్పోయింది. 1945 తర్వాత ఫ్రాన్స్‌లో అధికారం చేపట్టిన చాల్స్ డిగోల్ తన దేశ చరిత్రను తిరగరాసాడు. ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడయ్యాక టీవీల్లో కార్యక్రమాలు ఆపేశాడు. బార్లు, క్లబ్బులు, పబ్బులు, కాసినోలు, థియేటర్లు మూయించాడు. ఫ్రాన్స్ యువతలో ‘ఫ్రెంచి సంస్కృతి’ పట్ల అపారమైన గౌరవం కలిగించాడు. ఇపుడు కూడా ‘బీ ఫ్రెంచ్ అండ్ బై ఫ్రెంచ్’ అనే నిదానాన్ని తమ హృదయంలో నింపుకొన్నందుకే ఆ దేశం ముందుకు సాగుతోందని ప్రఖ్యాత మేధావి రాజీవ్ దీక్షిత్ ఓ చోట అంటారు.

మరి.. మనకేం దరిద్రం చుట్టుకొంది. దేశీయ సంస్కృతికి విధానం లేకుండా అస్తిత్వాల ముసుగులో మనం కూర్చున్న కొమ్మనే మనం నరుక్కొంటున్నాం. సంఘర్షణ లేకుండా సమన్వయంతో మనం ఎందుకు ఈ దృక్పథాన్ని సాధించలేకపోతున్నాం. మన ‘సంస్కృతిని వ్యాపారమయం’ చేయడం ఒక కారణమైతే, విదేశీ భావజాలాలతో పుట్టిన విధానాలు, మతాలు మరొక కారణం. ప్రతిదాంట్లో వ్యతిరేక దృక్పథాన్ని సృష్టించడం మరొక భావ దారిద్య్రం. ఈ పత్య్రామ్నాయ సంస్కృతి సంఘర్షణ లేకుండా సమన్వయ దృక్పథంతో సాధిస్తే ఫర్వాలేదు కానీ ఎదుటివారిని వ్యతిరేకించాలనే ధోరణిని సృష్టిస్తేనే ప్రమాదం. ఇదంతా మళ్లీ కోడి ముందా? గుడ్డు ముందా? అన్న ధోరణితో సాగేదే తప్ప ఒక పట్టాన తేలదు.

స్వాతంత్య్రం వచ్చాక మనం ఫ్రెంచి వాళ్లలాగా అడ్డూ అదుపు లేని వాళ్లం అయ్యాం. దాని అవలక్షణాలు ఇపుడు సమాజంలో, రాజకీయాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. రాజకీయం ఒక ‘ఈవెంట్’ మాదిరి మారిపోయింది. వ్యక్తిగత విలువల కన్నా తమ స్వలాభమే గొప్పదన్న ధోరణి ప్రబలింది. అది అన్నింటినీ మ్రింగేసే బ్రహ్మరాక్షసిగా మారిపోయింది. దాని కోరల్లో చిక్కుకున్న మనం ఈ జాతి గురించి, మన సంస్కృతి గురించి ఎందుకు ఆలోచిస్తాం? మన చరిత్రకు చెదలు పట్టించి మనకు స్వాభిమానం లేకుండా చేసినవాళ్లు కొందరైతే, మనకున్న సంస్కృతీ సంప్రదాయాలను దిగమ్రింగి విదేశీ భావజాలాన్ని మననెత్తినిండా చొప్పించినవాళ్లు మరికొందరు! నిసర్గ తత్వాన్ని చెప్పే బతుకమ్మ పూలు ప్లాస్టిక్‌తనాన్ని సంతరించుకొన్నాయి. అది కూడా ఓ రాజకీయ క్రీడగా మారి తన సహజత్వాన్ని కోల్పోయింది. పూర్వం మనవాళ్లు గళ్ల ఉప్పును, గోమయాన్ని కాల్చి తయారుచేసిన పళ్లపొడిని వెక్కిరించిన వాళ్ల నేడు- ‘మీ టూత్‌పేస్టులో ఉప్పుందా?’ అంటుంటే, ‘ఇది వేద విజ్ఞానాల సంగమం’ అని తాటికాయంత అక్షరాలపై కోల్గెట్ పేస్టుపై రాస్తుంటే మనం వెర్రి గొర్రెల్లా చూడడం తప్ప ఇంకేమీ చేయలేం. రాగి పాత్రలో రాత్రివేళ నీళ్లు పెట్టి ఉదయం పరగడుపున త్రాగాలని పెద్దలు, అలా చేస్తే తిట్టిపోసిన మనమే, క్రొత్త క్రొత్త డిజైన్‌ల రాగిపాత్రల్లో స్టార్ హోటళ్ల వడ్డింపులు చూసి లొట్టలేస్తు న్నాం. రాగి అంబలి (రాగిమాల్ట్) మధుమేహ రోగులు మొదలుకొని మద్యం త్రాగేవాళ్ల వరకు మంచిదని చెప్తే ముఖం త్రిప్పుకొన్న మనం, ఇవాళ డీమార్ట్ నుండి రాగి పిండి తెచ్చుకొని లీటర్ బాటల్ ఎత్తి అంబలి త్రాగుతున్న ఓ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్‌ను చూసి ఆశ్చర్యపోతాం! మన ఎముకలను బలంగా ఉంచి, మనకు ఆరోగ్యం కల్గించే ‘సూర్య నమస్కారాలు’ రోజూ చేయండని మన యోగవేత్తలు చెప్తే- అది ‘మతం’ అని ‘విజ్ఞాన వేదిక’ల వీరులు టీవీల్లో కూర్చుని చెప్తే నమ్మేశాం. కానీ ఉదయపుటెండ శరీరానికి మంచిదని ఏర్పాటుచేసిన ఈ విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోకుండా డి- విటమిన్ మాత్రలు మ్రింగుతున్నాం!

మధుకైటభులు, మహిషాసురుడు, శుంభనిశుంభులు, చండముండులు, రక్తబీజుడు మొదలైన వాళ్లంతా అసురశక్తులకు ప్రతీకలు. ఈ నకారాత్మక శక్తులను జయించేందుకు స్ర్తిమూర్తులు సిద్ధం కావాలన్నది పౌరాణిక సందేశం. మహిషాసురుడిని అంతం చేసినందుకు దసరా సందర్భంగా దుర్గామాతను తొమ్మిదిరోజుల పాటు పూజిస్తాం. కానీ- ‘టెన్త్‌క్లాస్’ సినిమా ‘లవ్’ను ప్రోత్సహిస్తూ, ఆడవారిపై రోజూ దాడులు జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తున్న కబోదులం మనం! మతవాదానికి మేం వ్యతిరేకం అంటే- ‘సెక్యులరిజం’ అనుకుంటాం కానీ ఆ వ్యతిరేకత మన సాంస్కృతిక విధ్వంసం అని మనకు తెలియదు. నిజంగా అన్ని మతాల మతతత్వానికి వ్యతిరేకం అంటే సంతోషమే. కానీ ఇప్పుడు జరుగుతోంది అలా కాదే!?

అందుకే మైకేల్ డానినో అనే పాశ్చాత్యుడు- ‘మతాలన్నీ ఒకే సత్యం చెప్తాయి అనడం ఓ ఫ్యాషనైపోయింది. ఇతర సంప్రదాయాల నుండి మత మార్పిడి చేసేవాళ్లకు ఇది అనుకూల వాక్యం. దౌర్జన్యకర మతాలు విశ్వాసులు, అవిశ్వాసులు అని ప్రకటించి కఠినంగా ప్రపంచాన్ని లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి’ అని అంటాడు. ఇదంతా ఆవులు వెళ్లి గొఱ్ఱెలు, తోడేళ్ళతో చేరి మనంతా ఒక్కటే అన్నట్లు ఉంటుంది. విభజన వాదాలతో అన్నిరకాల సాంస్కృతిక విధ్వంసం జరుగుతున్నా అమాయకంగా ఉండడం మరో అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎంతవరకు వెళ్లిందంటే- ‘నన్ను ధ్వంసం చేసేందుకు ఇతరులకు స్వేచ్ఛ ఇవ్వనట్లయితే కూడా నన్ను మతతత్వవాది అనేవరకు వెళ్లింది’ -ఇదే ఇప్పటి సాంస్కృతిక విధ్వంసం!

— డాక్టర్ పి.భస్కర యోగి ..
[email protected]

(ఆంధ్రభూమి సౌజన్యం తో)