Home News తెలంగాణ పశువుల అక్రమ రవాణా, పశువధశాలలకు కేంద్రం అవుతోందా ?

తెలంగాణ పశువుల అక్రమ రవాణా, పశువధశాలలకు కేంద్రం అవుతోందా ?

0
SHARE

ఉత్తర్ ప్రదేశ్ లో పశువధపై నిషేధం అమలుకావడంతో అక్కడి పశువధ కేంద్రాలన్నీ తెలంగాణాకు మారుతున్నాయి. పశు సంక్షేమ బోర్డ్ అధికారుల ప్రకారం తెలంగాణా ఇప్పుడు అక్రమ పశు రవాణాకు కేంద్రంగా మారుతోంది. అక్రమ వ్యాపారులు యధేచ్చగా చట్టాలను ఉల్లంఘించడమే కాక, ఈ అక్రమ రవాణా గురించి ఫిర్యాదు చేసే పౌరులపై దాడులకు కూడా తెగబడుతున్నారు.

వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు పరిస్తితి చాలా దారుణంగా ఉందని, చట్టవ్యతిరేక పశువధశాలల సంఖ్య బాగా పెరిగిపోయిందని నిర్ధారిస్తున్నారు. రాష్ట్రాల మధ్య పశువుల అక్రమ రవాణా కూడా బాగా పెరిగిందని అంటున్నారు.

సాధారణంగా రాజస్థాన్ నుండి ఒంటెలను తీసుకువస్తుంటారని, వాటిని కూడా పర్యాటకులను తిప్పేందుకు మాత్రమే ఉపయోగిస్తుంటారని పోలీసు అధికారులు అంటున్నారు. అలాగే మాంస విక్రయానికి పనికిరాని పశువులను తరలిస్తుంటారని కూడా వారు అంటున్నారు. అలాగే పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, లేదా తమ దృష్టికి తీసుకు వస్తే దాడులు చేసి జంతువులను విడిపిస్తామని, వాటిని పశు కేంద్రాలకు తరలిస్తామని, నేరస్తులపై జంతువుల పట్ల క్రూరత్వపు (నివారణ) చట్టం కింద కేసు పెడతామని అంటున్నారు.

ముంబైకి చెందిన అధికారి రాకేశ్ పాండే “గత నాలుగు నెలలుగా తెలంగాణా అక్రమ పశు తరలింపు, వధ కార్యకలాపాలకు కేంద్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. పశువధశాలలు యధేచ్చగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో పశువధాపై నిషేధం అమలుకావడంతో అక్కడి పశువధశాలలు తెలంగాణాకు వచ్చాయి. ఎక్కడైనా చట్టాన్ని కఠినంగా అమలుచేయాలి. పశువులను ఎలాంటి నెప్పి లేకుండా, పరిశుభ్రమైన పద్దతిలోనే వధించాలని చట్టాలు చెపుతున్నాయి’’ అని అన్నారు. ట్రక్కుల కొద్దీ ఒంటెలను అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారని ఆయన అన్నారు.

బండ్లగూడా, బాలాపూర్, షహీద్ నగర్, బహదూర్ పురా, కొత్తపేట్ మొదలైన ప్రాంతాలలో వధశాలల సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగిందని అధికారులు దృవీకరిస్తున్నారు. పశువుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్న వారి పట్ల పోలీసులు చర్యలు తీసుకోవాలని పశు సంక్షేమ బోర్డ్ అధికారులు కోరుతున్నారు.

తాము ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్న, వాటికంటే ముందే వధశాల నిర్వాహకులకు సమాచారం అందుతోందని, దానివల్ల వాళ్ళు జాగ్రత్త పడుతున్నారని అధికారులు అంటున్నారు. ఢిల్లీ కి చెందిన అధికారి నీరు గుప్తా “మేము బండ్లగూడాలో రోజుకు 300కు పైగా పశువులను వధించే శాలను మూసివేశాం. అయితే ఈ తనిఖీ నిర్వహించడానికి మేము వస్తున్నామని ముందుగా సమాచారం అందడంతో నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు. అక్కడ ఒక్క పశువు కూడా లేకుండా చూసుకున్నారు. ఇలా వారికి ముందుగా సమాచారం చేరవేయడం చాలా తీవ్రమైన నేరం. కానీ అది జరిగిపోతోంది’’ అని అన్నారు.

తెలంగాణాలో ఢిల్లీ, ముంబై, చెన్నైకి చెందిన అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహిస్తోంది.

దక్కన్ క్రానికల్ సౌజన్యంతో