అభ్యాసము :
మీ స్నేహితులతో చర్చించి ఈ కింది ప్రశ్నలకు జవాబు వ్రాయుము :
- ఏసు క్రీస్తు జీవిత విశేషాలు
- ఏసు క్రీస్తు బోధలు
- క్రైస్తవ మతం ఎలా విస్తరించినది ?
- మహమ్మద్ పైగంబర్ జీవిత విశేషాలు
- హిజ్ర అనగా నేమి?
- ఇస్లాం ఉపదేశాలు ఏమిటి?
యాక్టివిటి :
- మీరున్న చోట చర్చిలను, మసీదులను దర్శించి అక్కడి మతాచారాలపై ఒక నోట్ వ్రాయండి.
- క్రైస్తవులలో క్రిస్టమస్ వేడుక పద్ధతిని అర్థం చేసుకొనండి.
- ముస్లింలు రంజాన్ ఎలా జరుపుకొంటారో అర్థం చేసుకొనండి.
ప్రాజెక్టు వర్కు :
క్రైస్తవ, ఇస్లాం మతాలు ఎలా వ్యాప్తి చెందుతున్నయన్న దానిపై మీ టీచర్ సహాయంతో ఒక వ్యాసం వ్రాయండి.
ఇదండీ – కాంగ్రెసువారి చల్లని పాలనలో కర్నాటక సర్కారు వారు 9వ తరగతి విద్యార్థుల మీద రుద్దిన సోషల్ సైన్స్ టెక్ట్స్‌బుక్‌లో చరిత్ర విభాగం కింద ‘క్రైస్తవం, ఇస్లాం’ అనే మొట్టమొదటి పాఠం చివర విద్యార్థులకు పురమాయించిన అద్భుత ‘అభ్యాసం!’
ఇది చూసి- ‘మనకాలంలో లేనిది ఇప్పుడు మతాల, ప్రవక్తల బోధలను కూడా పిల్లలకు నేర్పిస్తున్నారా’ అని ఆశ్చర్యపోకండి. దేశంలో నూటికి 20 మందికి ప్రాతినిధ్యం వహించే మైనారిటీ మతాలమీదే ఇంత శ్రద్ధ పెట్టారంటే ఇక నూటికి 80 శాతం అనుసరించే హిందూ మతం మీద ఇంకెంత ఓవరైపోయారోనని ఊహించేసుకోకండి. రాముడు, కృష్ణుడు లాంటి ఆరాధ్యదైవాల బోధలకు; రామాయణ, భారత, భాగవత, గీతాది పవిత్ర గ్రంథాల వాక్కులకు; ఏడాది పొడవునా సాగే హిందువుల పండుగలకు సంబంధించి ఎన్నెన్ని మంచి విషయాలు పిల్లలకు నేర్పిస్తున్నారోనని మురిసిపోండి. చర్చిలకు, మసీదులకు పిల్లల్ని పోయిరమ్మన్నట్టే హిందూ దేవాలయాలకు కూడా వెళ్లి పూజాదికాలను గమనించండని చెబితే చిన్నారులకు మంచిదే లెమ్మని సరిపెట్టుకోకండి.
ఎందుకంటే – ఈ దేశంలో అతిప్రధాన మతమైన హైందవం ఊసు ఈ అమోఘ చరిత్ర పాఠ్యపుస్తకంలో కాగడాతో వెదికినా కానరాదు.
ఈ టెక్ట్స్‌బుక్‌లో చరిత్ర విభాగానికి సంబంధించి postcard.news వెబ్‌సైట్ పరిశోధనాత్మక వ్యాసంలో ప్రచురించిన విషయ సూచిక ఇదీ..
- క్రైస్తవం మరియు ఇస్లాం
- మధ్యయుగ భారతదేశం, రాజకీయ పరిణామం
- మత ప్రచారకులు, సాంఘిక సంస్కర్తలు
- బహమనీ మరియు విజయనగర సామ్రాజ్యాలు
అంతే! అయిపోయింది. అంటే సెక్యులర్ విద్యావిధానంలో చరిత్రకు సంబంధించి తొమ్మిదో క్లాసు విద్యార్థులకు మొట్టమొదట బోధించవలసింది క్రైస్తవ, ఇస్లాం మతాల బోధనలు, వాటి ప్రవక్తల ఉపదేశాలు, ఆ మతాలు ఎంచక్కా వ్యాపిస్తున్న తీరు గురించి! వారికి ఎంత మాత్రం తెలియనివ్వకూడనిది ప్రపంచమంతా నెత్తిన పెట్టుకున్న మ¬న్నత హిందూ మతం గురించి!
అన్ని మతాల గురించి పిల్లలకు తెలియజెప్పదలిచామని పాఠ్య పుస్తకంలో చెప్పుకున్నా, క్రైస్తవ, మహమ్మదీయ మతాలు మినహా మరో మతం ఊసు ఎక్కడా కానరాదు. సెక్యులరిస్టులకు మహా ముద్దొచ్చే ఆ రెండు మతాల గురించి చెప్పి ఊరుకోవడం గాక, పిల్లలని బలవంతంగా చర్చిలకు, మసీదులకు పంపించి, ఆ మతాల ప్రాశస్త్యాన్ని గ్రహించి, ఆ ప్రాశ్యస్తాన్ని వ్యాప్తి చేసే పనిని కూడా ‘అభ్యాసం’ పేరుతో వారిమీద పెట్టటం దుర్మార్గం, తీవ్రాభ్యంతర కరం.
ఎవరెంత నెట్టినా తమ పిల్లలు కిరస్తానీ చర్చిలకు పోవటానికి మహమ్మదీయులు ఎలాగూ అంగీకరిం చరు. అలాగే క్రైస్తవులు తమ బిడ్డలను మసీదు గడప తొక్కనివ్వరు. ఎటొచ్చీ చర్చిలకు, మసీదులకు పోయి మతాంతీకరణ గాలాలకు వాటంగా చిక్కేదెవరయ్యా అంటే – మతాభిమానం ఏ కోశానా లేని హిందువుల పిల్లలే !
‘శ్రీరాముడి జీవిత విశేషాలు తెలుపుము. హిందూ మతం ప్రత్యేకత ఏమిటి? మీ దగ్గర్లోని రామాలయానికి, శివాలయానికి వెళ్లి అక్కడ జరిగే పూజా విధానాలను పరిశీలించండి. వేల సంవత్సరా లుగా హిందూ మతం వర్ధిల్లడానికి కారణాలు కనుక్కోండి’ అని ఇవాళ ఏ పాఠ్య పుస్తకంలోనైనా విద్యార్థులకు చెబితే దేశంలోని వీర, శూర సెక్యులరిస్టులందరూ ప్రపంచం తలకిందులైనట్టు ఎంతగా గుండెలు బాదుకుంటారు? విద్య కాషాయీ కరణం జరిగిపోతోందంటూ దిక్కులు దద్దరిల్లేలా దేశమంతటా మీడియా నిండా ఎంత లొల్లి అయ్యేది?
నిజానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మహా పాఠ్య గ్రంథం ‘కాషాయీకరణ’కు విరుగుడుగా వచ్చిందే! కర్నాటకలో పూర్వం బిజెపి హయాంలో పాఠ్యపుస్తకాలన్నీ ‘కాషాయమయం’ అయిపోయా యని వామపక్ష, లిబరల్, సెక్యులర్ మహాజ్ఞానులు గోలగోల చేశారు. మెకాలే మానస పుత్రులు భారత చరిత్రకు చేసిన దారుణ వక్రీకరణలను ఏదో కొంచెం సరిచేసి, భారతీయ విజ్ఞానాన్ని, వేదగణితం, ఆయుర్వేదం వంటి ఉజ్జ్వల శాస్త్ర వారసత్వాన్ని నేటి తరానికి తెలియజెప్పటమే హిందూ మతోన్మాదం, జాతి విద్రోహ మహాపరాధంగా సూడో సెక్యులర్ విజ్ఞాన ఖనుల పక్షపాతపు కళ్లకు తోచింది. సదరు ‘కాషాయ’ కుత్సితాన్ని వమ్ముచేసి పాఠ్య పుస్తకాలను సెక్యులర్ శాస్త్రం ప్రకారం శుద్ధి చేసే పనికి సిద్ధరామయ్య గారి కాంగ్రెసు దొరతనం బరగురు రామచంద్రప్ప అనే మహా పురుషుడు ఛైర్మన్ అయిన రాష్ట్ర టెక్ట్స్‌బుక్ రివిజన్ కమిటీకి అప్పగించింది. హిందువులన్నా వారి మతమన్నా మా చెడ్డ ఎలర్జీ అయిన ఆ మహనీయుడి సమర్థ సారథ్యంలో తగలడ్డ కొత్త పాఠ్యగ్రంథాల తీరు ఇదిగో ఇది.
వేదగణితం, ఆయుర్వేదం గురించి పిల్లలకు చెప్పడమేమో కమ్యూనల్! సొంత మతాన్ని ఈసడించి పరమతాల పంచన చేరమని బడి పిల్లలను పురికొల్పడమేమో ‘సెక్యులర్!’ భలే!!
‘సెక్యులర్ విద్య అనగా భారతీయ సంస్కృతిని, యధార్థ జాతీయ చరిత్రను, హైందవ నాగరికతను తెగనాడి, హిందూమతాన్ని పాపాలపుట్టగా చిత్రించడం’ అని కుహనా సెక్యులరిస్టులు ఏనాడో స్థిరం చేశారు. కాబట్టి ఇటలీ దొరసాని గారి పార్టీ ఏలుబడిలో బడి పుస్తకాలకు ఇలా చేతబడి జరిగినందుకు మరీ షాకైపోనవసరం లేదు. ఆశ్చర్యాల్లోకెల్లా ఆశ్చర్యం ఏమిటంటే దేశవ్యాప్తంగా విద్యాబోధన సవ్యంగా జరిగేట్టు, పాఠ్యగ్రంథాలు నిర్దుష్టంగా రూపొందేట్టు చూడవలసిన జాతీయ విద్యా, పరిశోధన మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి.) సైతం ఈ సిగ్గు చేటు నిర్వాకాన్ని కళ్లుండీ కానలేకపోవటం!
కర్నాటకలో కాంగ్రెసు సర్కారు పాఠ్యగ్రంథాలను భ్రష్టు పట్టించిన తీరుకు ఒళ్లుమండిన వారు దాని సంగతేదో చూడమని ఎన్.సి.ఇ.ఆర్.టి.కి ఫిర్యాదు చేస్తే ఏమయింది ? 1 నుండి 10వ తరగతి వరకు కర్నాటక రాష్ట్ర పాఠ్య పుస్తకాలను దుర్భిణి వేసి పరిశీలించిన పేరుగొప్ప జాతీయ మండలి వారు చివరికి ఆర్నెల్ల కింద తేల్చిందేమిటంటే ‘ఆ పుస్తకాల్లో గ్రామర్ తప్పులు, స్పెల్లింగు తప్పులు, బోధన పద్ధతుల లోపాలున్నా మొత్తం మీద అవి 2005 నాటి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ పరిధిలోనే ఉన్నాయి’ అని ! శభాష్ !
కాంగ్రెసు పార్టీ, దాని కులదైవాలు హిందూ మతానికి, హైందవ సంస్కృతికి కీడు కోరే బాపతు కాబట్టి కాంగ్రెసు హయాంలో కర్నాటక పాఠ్య గ్రంథాలు అంత సుందర ముదనష్టంగా తయారవ టంలో వింత లేదు. జాతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల విలువ తెలిసినదని అందరూ అనుకొనే ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో కూడా జాతీయ విద్యామండలి కీలకమైన విద్యాబోధన విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించటం సిగ్గుచేటు.
1999లో కొలువుతీరిన వాజపేయి ప్రభుత్వంలో మానవ వనరుల శాఖమంత్రి అయిన మురళీ మనోహర్ జోషి గొప్ప చొరవ చూపి అంతవరకూ పాఠ్యగ్రంథాల్లో చరిత్రకు, భారత జాతీయతకు జరిగిన దారుణ వక్రీకరణలను సరిదిద్దేందుకు ఉపక్రమిస్తే ‘విద్యను కాషాయీకరణ చేస్తున్నారు బాబోయ్’ అని దేశమంతటా పెద్ద దుమారం లేచింది. వామపక్ష కుహనా మేధావులు, దుష్ట రాజకీయ శక్తులు ఎంత గోల పెట్టినా పట్టువదలని జోషీజీ మొదలు పెట్టిన ప్రక్షాళనను పూర్తి చేసే లోపే ఎన్.డి.ఎ. తొలి జమానాకు నూకలే చెల్లాయి. దాని స్థానంలో గజ్జె కట్టిన యుపిఎ రాజ్యం వచ్చీరాగానే చేపట్టిన మొదటి పని పాఠ్యపుస్తకాల మరమ్మత్తు. యుపిఎ సర్కారుకు రాజ బంధువులైన కమ్యూనిస్టులు, వారి ఇష్టులైన ఎర్ర చరిత్రకారులు తెగ కష్టపడి 2005 కల్లా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్కును తమకు కావలసినంత రీతిలో తయారు చేశారు. అంతకుముందు మురళీ మనోహర్ జోషి పూనికతో పాఠ్యాంశాలకు జరిగిన మార్పులను చేర్పులను మొత్తంగా ఎత్తేసి, యథా పూర్వ మెకాలే మార్కు మూసలో జాతి శత్రువులను ఆకాశానికెత్తుతూ, జాతీయ వీరులను నీచంగా చిత్రిస్తూ, యధార్థ చరిత్రను తారుమారు చేసి చడీచప్పుడు కాకుండా పాఠాలన్నింటికి ఎర్ర రంగు పులిమి సమూలంగా మార్చేశారు.
చిత్రమేమిటంటే కేంద్రాన యుపిఎ పోయి ఎన్‌డిఎ వచ్చినా యుపిఎ ఎర్రన్నలు పెట్టిపోయిన పాత మూసలోనే జాతీయ కరిక్యులం ఇప్పటికీ నడుస్తున్నది. భారతమాత దాస్యపు సంకెళ్లు తెంచటం కోసం జీవితాన్ని ధారపోసి ఉరికంబం ఎక్కిన స్వాతంత్య్ర వీరుడు భగత్‌సింగ్ టెర్రరిస్టు అనే మాటను మన జాతీయ పాఠ్యప్రణాళిక స్వతంత్రం అనబడేది వచ్చి డెబ్భై ఏళ్లు దాటాక నేడు కూడా మన పిల్లలకు బోధిస్తున్నది.
‘నాకు మీ రక్తం ఇవ్వండి.. నేను మీకు స్వరాజ్యం తెస్తా’ అని నినదించి, బ్రిటిషు వాళ్ల మీదికి సైన్యంతో దండెత్తి, తెల్లవాళ్లు మన దేశం విడిచి ఉన్నపళాన పారిపోవడానికి ముఖ్య కారకుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను గాంధీజీకి ఎదురు తిరిగిన రాజకీయ రెబల్‌గానే ఎన్‌సిఇఆర్‌టి వారి పాఠ్యపుస్తకాలు పరిగణిస్తున్నాయి.
మోసాలతో, నమ్మక ద్రోహాలతో, పాపిష్టి కుట్రలతో భారతదేశాన్ని ఆక్రమించి, శతాబ్దాల పాటు మన అపార సంపదను కొల్లగొట్టి, మనల్ని పిశాచాల్లా పీడించిన ఇంగ్లీషువారిని ఈ దేశాన్ని అభివృద్ధి చేసి, జాతికి విద్యాబుద్దులు గరపిన పుణ్యాత్ములుగానే మన టెక్ట్సుబుక్కులు ప్రస్తుతిస్తున్నాయి.
పూర్వపు ఎన్‌డిఎ పాలనలో వెనకటి మెకాలే మార్కు చెత్తను తొలగించి, శుద్ధి చేసిన పుస్తకాల్లో 8వ తరగతి విద్యార్థులకు నేతాజీ గురించి 500 పదాల్లో చెప్పారు. యుపిఎ జమానాలో వామపక్షుల చేయి పడ్డా ఆ పాఠం మొత్తం ఎగిరిపోయింది. 12వ తరగతి పాఠంలో అంతకు ముందు 1250 పదాల్లో ఉన్న నేతాజీ ప్రస్తావన గురించిన కాస్త పాఠం ‘కాషాయాన్ని’ తీసేసి ‘ఎర్ర’రంగు పులిమే యుపిఎ ప్రక్రియలో 87 పదాలకు దిగజారిపోయింది. చంద్రశేఖర్ ఆజాద్, బటుకేశ్వర దత్త, రాంప్రసాద్ బిస్మిల్ వంటి గొప్ప జాతీయ యోధులు 36 మంది ఊసే ఎర్రశుద్ధి చేయబడిన జాతీయ పాఠ్యగ్రంథాల్లో ఎక్కడా మచ్చుకైనా కానరాదు. క్రికెట్‌కు, వస్త్రాల చరిత్రకు ఏకంగా 37 పేజీలు కేటాయించిన పాఠ్య పుస్తకాల్లో సిసలైన స్వాతంత్య్ర వీరుల జీవితాల గురించి ఒక్క ముక్కా చెప్పకపోవటం స్వతంత్ర జాతికి తలవంపులు.
దీనిమీద ఒళ్లుమండిన సూర్యప్రతాప్‌సింగ్ రాజావత్ అనే బాధ్యత ఎరిగిన పౌరుడు పైన ఉటంకించిన సమాచారాన్నంతా సమాచార హక్కు (ఆర్.టి.ఐ.) కింద అర్జీలు పెట్టి రాబట్టి ఈ తప్పులను సరిదిద్దేట్టు చూడండంటూ రెండేళ్ల కింద కేంద్ర కమీషన్‌ను ఆశ్రయించాడు. మన తెలుగువాడైన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు ఎందుకిలా జరిగిందంటూ 2016 జనవరిలో ఎన్.సి.ఇ.ఆర్.టి.ని నిలదీశారు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాస్ వంటి జాతీయ నాయకులకు సంబంధించిన పాఠాలనే ఏకంగా ఎత్తేశారంటే మీరు, మీ కరిక్యులం ఏమి చేస్తున్నట్టు? క్షమించరాని ఈ తప్పులను సరిచేసి పాఠ్యగ్రంథా లను సంస్కరించటానికి మీరేమి చేయబోతున్నారు? అని సూటిగా అడిగారు.
‘టెక్ట్స్ బుక్కుల కంటెంటును నిపుణుల కమిటీ స్వతంత్రంగా నిర్ణయిస్తుందండి. దాని పనిలో మేము కలగజేసుకోము. ఇప్పుడు ఫిర్యాదు ఎత్తిచూపిన విషయాలను, వాటిపై మీ ఆదేశాలను తప్పక పరిగణనలోకి తీసుకొని అవసరమైన దిద్దుబాటును చేపడతాం’ అని ఎన్.సి.ఇ.ఆర్.టి. ప్రతినిధి ఆ సందర్భంలో కేంద్ర కమిషన్‌కు హామీ ఇచ్చారు.
ఇది జరిగి రెండున్నర ఏళ్లు అయింది. పాఠాల దిద్దుబాటుకు మాత్రం అతీగతీ లేదు. కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన స్వర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మొత్తంగా పాఠ్యగ్రంథాల ప్రక్షాళణకు వెంటనే ఉపక్రమించి ఉంటే ఈ పాటికి చదువుల రంగంలో అభారతీయ కాలుష్యాన్ని పరిహరించే దిశలో పెద్ద అడుగు పడేది.
బ్రిటిషు వలస పాలన కాలపు మైండ్‌సెట్ నుండి నవతరాన్ని బయటవేసి, దేశ వాస్తవ చరిత్ర ఏమిటి, జాతికి సేవ చేసిన వీరులెవరు, కీడు చేసిన విలన్లెవరు అన్నది ఉన్నదున్నట్టు చెబితేగాని విద్యాబోధన సార్థకం కాదు. అతి ముఖ్యమైన ఈ పని మీద పెట్టాల్సినంత శ్రద్ధను ఎన్‌డిఎ ప్రభుత్వం పెట్టలేదన్నది చేదునిజం. పుణ్యకాలమంతా వృథా చేసి, ఇంకో సంవత్సరంలో ఎన్‌డిఎ సర్కారు టర్మ్ అయిపోతుందనగా ఎన్.సి.ఇ.ఆర్.టి. టెక్ట్స్‌బుక్కులను త్వరలో సవరిస్తా మని మానవ వనరుల శాఖ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చేసిన ప్రకటన ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో, దానివల్ల నికర ప్రయోజనం ఎంతో దేవుడికెరుక.
వందలాది దేవాలయాలను కూల్చి, మతం మారడానికి నిరాకరించిన లక్షాలది హిందువులను ఊచకోత కోసిన ఇస్లామిక్ పాలకులను ధర్మ ప్రభువులుగా, శతాబ్దాల పర్యంతం ఇస్లామిక్ దాడులను నిలువరించి, దక్షిణాదిన హిందూ మహా సామ్రాజ్య జాతీయ కేతనాన్ని ఎగురవేసిన విజయ నగర సామ్రాట్టులనేమో పట్టించుకోనక్కరలేని అనామకులుగా పాఠ్యగ్రంథాల్లో చిత్రించే దౌర్భాగ్యం దేశంలో ఇంకెంత కాలానికి మారుతుందో !
– ఎం.వి.ఆర్.శాస్త్రి
(జాగృతి సౌజన్యం తో)