చదువు సాకుతో హిందువులను చేరదీసి ఇస్లాం మతంలోకి బలవంతపు మార్పిడికి పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయ్యంది. 10 మంది సభ్యులతో కూడిన ఘరానా ముఠాను రాచకొండ మల్కాజిగిరి పోలీసు స్పెషల్ టీం అరెస్టు చేసింది. పరారీలో ఉన్న మరో ముఠా సభ్యుడి కోసం గాలిస్తున్నట్లు మల్కాజగిరి ఏసీపీ గోనె సందీప్ వెల్లడిం చారు. ఆదివారం ఉప్పల్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఠా సభ్యుల వివరాలు వెల్లడించారు.
రాజమండ్రికి చెందిన సత్యనారాయణ ఇస్లాం మతంలోకి మారి మహమ్మద్ సిద్ధిఖీగా పేరు మార్చుకున్నాడు. ఎం ప్రవీణ్ అలియాస్ అబ్దుల్లా, సయ్యద్ అబ్దుల్లా, మహమ్మద్ షేక్ అహమ్మద్, మహమ్మద్ ఇస్మాయిల్, అబ్దుల్లా, సాగర్, అమీర్, రబ్బానీ, ఫయాజుద్ధీన్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పేదరికంతో జీనవం సాగిస్తున్న ఆదిలాబాద్, భద్రాచలం ప్రాంతాల్లోని అమాయక యువకులను చేరదీసి, ఉచిత చదువు, హాస్టల్ సౌకర్యాన్ని సాకు తో హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉర్దూ, అరబిక్, మతపరమైన బోధనలు చేస్తున్నా రని ఏసీపీ వెల్లడించారు. వరంగల్‌లో పీస్ ఆర్ఫాన్ హోం సొసైటీ పేరిట సంస్థను స్థాపించారు.
అక్కడి నుంచి హైదరాబాద్ మల్కాజిగిరి పరిధిలోని వౌలాలికి మార్చారు. గతంలోనూ హైదరాబాద్‌లోని వేర్వేరు రహస్య ప్రాంతాల్లో సంస్థను నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనుమానం రాకుండా తరుచూ స్థలాలను మారుస్తూ గిరిజన, దళిత పిల్లలనే టార్గెట్‌గా చేసుకుంటూ ఇస్లాం మతంలోకి బలవంతంగా మారుస్తున్నారంటూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ముఠా నిర్వహిస్తున్న సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మతమార్పిడికి పాల్పడుతున్న బృందం సూత్రధారి సిద్ధిఖీతోపాటు మరో 8మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడు రబ్బానీ కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. 17 మంది పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌కు తరలించినట్లు ఏసీపీ సందీప్ వెల్లడించారు.
(ఆంధ్రభూమి సౌజన్యం తో)