Home Telugu జాతీయ జంతువుగా ఆవు

జాతీయ జంతువుగా ఆవు

0
SHARE

దేశవ్యాప్తంగా గోవధకు సంబంధించి తీవ్రస్థాయిలో ఆందోళనలు, పశు విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి ఈ మూగ జీవిని జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచించారు. అలాగే గో వధకు పాల్పడే వారికి యావజ్జీవ శిక్ష విధించాలని రాష్ట్ర బిజెపి సర్కార్‌కు స్పష్టం చేశారు. గోరక్షణ, గో మాంస భక్షణపై తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్న తరుణంలో హైకోర్టు న్యాయమూర్తి మహేష్ చంద్ శర్మ ఈ సంచలన ఆదేశం జారీ చేశారు. అంతే కాదు, గోరక్షణ బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ జనరల్‌దేనని ప్రకటించారు. నేపాల్ హిందూ దేశమని, అక్కడ గోవును జాతీయ జంతువుగా ప్రకటించారని గుర్తు చేసిన ఆయన, ‘జంతువుల పెంపకంపైనే ఆధారపడిన వ్యవసాయ ప్రధాన దేశం మనది. ఆవుకు చట్ట బద్ధమైన గుర్తింపు తీసుకురావాల్సిన బాధ్యత రాజ్యాంగంలోని 48వ అధికరణ, 51ఎ (జి) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది’ అంటూ ఓ ఉత్తర్వు జారీ చేశారు. రాజస్థాన్ జంతు సంరక్షణ చట్టాన్ని సవరించి గోవధ శిక్షను మూడేళ్ల నుంచి యావజ్జీవ శిక్షగా మార్చాలని కూడా న్యాయమూర్తి సూచించారు.పదవీ విరమణ చివరి రోజున ఈ ఆదేశాన్ని జారీ చేసిన ఆయన, అనంతరం ఓ చానల్‌లో మాట్లాడుతూ తన ఆదేశాలు సూచనలే తప్ప నిర్బంధమైనవి కాదని చెప్పడం గమనార్హం.

ఇదిలావుండగా పశుగణాల విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశంలో పశుమాంసం తినకూడదనిగానీ, గోవులను వధించకూడదనిగానీ ఏమీలేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అసలు ఉత్తర్వులో దేనిపైనా నిషేధం లేదన్న వాస్తవం దాన్ని లోతుగా చదివితే అర్థమవుతుందని జస్టిస్ నవనీతి ప్రసాద్ ఓ ప్రజాహిత పిటిషన్ విచారణ సందర్భంగా స్పష్టం చేశారు. వధించడం కోసం సంతల్లో పశువులను సామూహికంగా విక్రయించకూడదని మాత్రమే ఈ ఉత్తర్వులో కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ఈ నోటిఫికేషన్ అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వును జారీ చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఎప్పుడైతే న్యాయమూర్తి కేంద్ర ఉత్తర్వులోని వాస్తవాలను వెల్లడించారో ప్రజాహిత పిటిషన్ దాఖలు చేసిన యువజన కాంగ్రెస్ కార్యకర్త దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)