Home News కార్టూనిస్టులను సన్మానించిన జాగృతి వారపత్రిక

కార్టూనిస్టులను సన్మానించిన జాగృతి వారపత్రిక

0
SHARE

ఒక పేజీలో కొన్ని వేల పదాలతో చెప్పే అంశాన్ని మూడు కాలాల చిన్న కార్టూన్‌తో చెప్పవచ్చునని, వంద ఫొటోలు చెప్పలేని ఒక పరిణామాన్ని ఆ చిన్న కార్టూన్‌ వ్యక్తీకరిస్తుందని ప్రముఖ పత్రికా రచయిత కె. రామచంద్రమూర్తి వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రథమ ప్రధాని నెహ్రూ.. శంకర్‌ పిళ్లై కార్టూన్లను స్వాగతించేవారని, ఈనాడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికీ వ్యంగ్య చిత్రాలలో ఉండవలసిన మెరుపు, చురుకు ఎరిగిన కార్టూనిస్టులు ఉన్నారని, కానీ వారికి ప్రోత్సాహం, మద్దతు ఉండడం లేదని ఆయన చెప్పారు. జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ, జాతీయ తెలుగు వారపత్రిక జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్టూన్‌ పోటీ బహుమతి ప్రదానోత్సవంలో రామచంద్రమూర్తి ప్రధాన వక్తగా పాల్గొన్నారు. నాలుగో తేదీ ఉదయం ఈ కార్యక్రమం కాచిగూడలోని జాగృతి భవన్‌ సభామందిరంలో జరిగింది. దాదాపు పాతిక మంది వ్యంగ్య చిత్రకారులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితికి కారణం ఇప్పుడు పత్రికలన్నీ కొన్ని రాజకీయ సిద్ధాంతాల వైపు మొగ్గు చూపడంతో పాటు, రాజకీయ నాయకులే పత్రికలు నిర్వహించడమేనని ఆయన చెప్పారు. ఒకప్పుడు కార్టూన్‌ వచ్చే వరకు పత్రికను ప్రచురణకు పంపకుండా ఉండేవారిమని ఉదయం, వార్త పత్రికలలో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కార్టూన్‌ అంటే ఇవాళ్టి పరిణామం నేపథ్యంతోనే గీస్తారని, ఈ భావాన్ని సామాన్యుని ఆలోచనతో అనుసంధానించవలసి ఉంటుందని మూర్తి అన్నారు. కానీ ఇవాళ మూడు కాలాల కార్టూన్లు కరువైపోయాయని, పాకెట్‌ కార్టూన్‌తోనే సరిపోట్టుకోవలసి వస్తున్నదని ఆవేదన  వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని, కార్టూన్‌ అంతా చూసి నవ్వుకోవాలని, ఆఖరికి ఆ కార్టూన్‌కు లక్ష్యంగా ఉన్న వ్యక్తి కూడా నవ్వుకోవాలని మూర్తి అన్నారు. ఈ స్వభావం లోపిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆయన హెచ్చరించారు. కార్టూనిస్టులకు మంచి అధ్యయనం ఉండాలని, సమాజాన్ని పరిశీలించే గుణం ఉండాలని, తను కార్టూనించబోతున్న అంశం పూర్వాపరాలు  క్షుణ్ణంగా తెలిసి ఉండాలని, దానికి వ్యంగ్యం, చెణుకు అద్దాలని ఆయన చెప్పారు. కానీ ఇవాళ్టి సామాజిక మాధ్యమాలు కార్టూన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయని  గుర్తు చేశారు. కార్టూన్లు వేస్తే ఈ రోజు కేసులు పడుతున్నాయని చెబుతూ, మమతా బెనర్జీ, నారా లోకేశ్‌ ఉదంతాలను గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో కూడా జాగృతి పోటీ నిర్వహించడం, అందులో ఇంతమంది కార్టూనిస్టులు పాల్గొనడం హర్షణీయమని అన్నారు.

ఇంతకు పూర్వం ఎంతో చక్కని కార్టూన్లు వచ్చేవని, కార్టూన్‌ అనగానే శంకర్‌ పిళ్లై, ఆర్‌కె లక్ష్మణ్‌ వంటివారు గుర్తుకు వచ్చేవారని, కానీ అప్పుడు కార్టూన్‌కు ఉన్న ఆదరణ ముఖ్యంగా రాజకీయ కార్టూన్‌కు లేదని ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్‌ బిజెపి శాఖ అధ్యక్షుడు, ఎంఎల్‌సి ఎన్‌ రామచంద్రరావు అన్నారు. కానీ ప్రజాస్వామ్య రక్షణకు కార్టూన్‌లను ప్రోత్సహించవలసి ఉంటుందని ఆయన చెప్పారు.

ప్రజాస్వామ్య రక్షణకు రాజకీయ కార్టూన్లు చాలా అవసరమని సభకు అధ్యక్షత వహించిన జాగృతి సంపాదకుడు పి. వేణుగోపాలరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సభకు హాజరైన ఒక కార్టూనిస్టు ‘యాంటీ మోదీ కార్టూన్లు’ పేరుతో పంచిన కార్టూన్ల పుస్తకం గురించి మాట్లాడుతూ కార్టూనిస్టులు ఇలా ఒక వ్యక్తిని కేంద్రంగా చేసుకుని ఎంతకాలం కార్టూన్లు గీయగలరని, ప్రజల ప్రక్షం వహించడం అవసరమని హితవు చెప్పారు. సంఘ పరివార్‌ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మోదీకి వ్యతిరేకంగా వచ్చిన కార్టూన్లు పుస్తకం పంచిపెట్టారు. ఇదే విధంగా వేరొక రాజకీయ పక్షం, అభిప్రాయాలు కలిగిన వారు నిర్వహించుకునే సభలో వారికి వ్యతిరేకమైన కార్టూన్ల పుస్తకం పంచగలరా అని ఆయన ప్రశ్నించారు. ఇతర అతిథులతో పాటు దాదాపు పాతిక మంది కార్టూనిస్టులు ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

తరువాత విజేతలకు రామచంద్రమూర్తి, రామచంద్రరావు దుశ్శాలువలు కప్పి, జ్ఞాపికలతో సత్కరించారు. పలువురు కార్టూనిస్టులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తెలుగాణ కార్టూనిస్టుల సంఘం అధ్యక్షుడు జాకీర్‌ హుసేన్‌ జాగృతి కార్టూనిస్టులు ఇస్తున్న ప్రోత్సాహం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అలాగే విజేతలు తమ స్పందన తెలియ చేశారు. రాజకీయ కార్టూన్లు వేయాలంటే భయపడుతున్నామని వారంతా చెప్పారు. ఈ సందర్భంగా సభా మందిరంలో  ఏర్పాటుచేసిన పాత, కొత్త కార్టూన్ల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది