Home News జలియన్ వాలా బాగ్ మారణహోమానికి ఇప్పటికీ క్షమాపణ చెప్పని బ్రిటన్

జలియన్ వాలా బాగ్ మారణహోమానికి ఇప్పటికీ క్షమాపణ చెప్పని బ్రిటన్

0
SHARE
భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పాల్పడిన జలియన్ వాలా బాగ్ దురాగతానికి బ్రిటన్ ఇప్పటికీ క్షమాపణ చెప్పకపోవడం ఆ దేశం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ మారణహోమానికి నేటితో 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరెసా మే  కేవలం “చింతిస్తున్నాము” అని ఒక ముక్తసరి ప్రకటనతో సరిపెట్టారు. అదీ శనివారం నాడు జలియన్ వాలా బాగ్ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయిన వెయ్యికి పైగా భారతీయులను స్మరిస్తూ దేశవ్యాప్తంగా నివాళులర్పించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బ్రిటన్ ప్రధాని థెరెసా మే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. “జరిగిన ఘటనకు, ఆ ఘటన వల్ల ప్రజలకు కలిగిన తీవ్ర నష్టానికి తాము ఎంతో చింతిస్తున్నాం” అని బ్రిటన్ ప్రధాని తాను చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 13 ఏప్రిల్ 1919 నాడు పంజాబులోని జలియన్ వాలా బాగ్ వద్ద శాంతియుతంగా సమావేశమై భారతీయ మహిళలు, పిల్లలు, వృద్దులతో పాటు అనేకమందిపై బ్రిటిష్ పోలీసులు  విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో వెయ్యిమందికి పైగా మృతిచెందారు.
బ్రిటన్ ప్రధాని ప్రకటనపై స్పందించిన ఆ దేశపు ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కర్బీన్, కేవలం చింతిస్తూ ప్రకటన విడుదల చేయడం కాకుండా, భారతదేశానికి ఒక విస్పష్టమైన క్షమాణప తెలియజేయాలని కోరారు. భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో కూడా బ్రిటన్ లేబర్ పార్టీ భారత స్వాతంత్ర్యానికి పూర్తి మద్దతు తెలిపింది.