భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయన్ -2 ప్రయోగం విజయవంతమైంది. షార్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్వీ మార్చ్3ఎం1 వాహకనౌక నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. మధ్యాహ్నం 2.43 నిమిషాలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది. బయలుదేరిన 16:13 నిమిషాల తర్వాత చంద్రయాన్-2 నిర్ణీత కక్ష్యలోకి సమర్థవంతంగా ప్రవేశించింది. కక్ష్యలోకి ప్రవేశించాక వాహన నౌక నుంచి చంద్రయాన్-2 ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది. ఈ ప్రయోగం ద్వారా జీఎస్ఎల్వీ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను తనతో పాటు తీసుకెళ్లింది. రాకెట్ బరువు 640 టన్నులు. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్- కాంపోజిట్ మాడ్యూల్ తో రాకెట్ పయనిస్తోంది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-2 మాడ్యూల్ విడిపోతుంది.
చంద్రయాన్-2ను విజయవంతంగా కక్ష్యలోకి పంపించామని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. చంద్రుడి దిశగా మన దేశ చరిత్రాత్మక ప్రయాణానికి ఇది ప్రారంభమని ఆయన అన్నారు. ఈ ప్రయోగంతో మార్క్3 రాకెట్ పనితీరు 15 శాతం పెరిగిందని చెప్పారు. మార్క్3 విజయం ఇస్రో ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచిందని, ప్రయోగంలో పాలుపంచుకున్న ఇస్రో సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని శ్రీ శివన్ అన్నారు.
కాగా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రయాన్ – 2 గమనాన్ని తనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ ద్వారా సందర్శించారు. చంద్రయాన్ – 2 ని విజయవంతం చెయ్యడం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు జాతి మొత్తాన్ని గర్వించేలా చేశారని. ఇది యావత్ భారత జాతి సాధించిన విజయమని ప్రధాని పేర్కొన్నారు. ప్రయోగం సఫలత సాధించటానికి నిరంతరం శ్రమించిన శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు.
Courtesy: VSK Andhra