టీవీ వచ్చాక బుర్రకి పని తగ్గింది. చానెళ్ళ వాళ్ళు రేటింగుల రంధిలో రోజుకో గొడవ వెతికి వెతికి రచ్చ రచ్చ చేస్తుంటే గుడ్లప్పగించి చూస్తూ బీపీ పెంచేసుకోవటం, టీవీ వాడు ఇంకో లొల్లిని తగులుకోగానే పాత దాన్ని మరిచిపోయి, కొత్త రచ్చతో పొద్దు పుచ్చటం జనాలకి అలవాటైంది. బకాసురుని ఆకలికి రోజుకొకడు బలి అయినట్టు, చానెళ్ళ యవ్వారానికి ఇస్యూ గజ్జెకట్టి, రేటింగుల అక్కర తీరగానే ఇట్టే మాయమవుతుంటుంది. మిడిమిడి మీడియా పంచాయతీలో ప్రతిదీ ఆషామాషీ కాలక్షేపమైపోయి, దేశానికి, సమాజానికి, జాతి మనుగడకు కీలకమైన అంశాలమీద కూడా సీరియస్ చర్చకు, సమగ్ర విశ్లేషణకు అవకాశం లేకుండా పోయింది.
ఉదాహరణకు ఈ మధ్య మీడియాలో మారు మోగిన జిన్నా బొమ్మ తగవునే గమనించండి.
పాకిస్తాన్ జాతికి పిత, మన పాలిటి శని అయిన మహమ్మదాలీ జిన్నా చిత్రపటం మన అలీగఢ్ యూనివర్సిటీలో ఇంకా ఉండటమేమిటి ? తక్షణం దాన్ని తొలగించండి అని భాజపాకి చెందిన స్థానిక పార్లమెంటు సభ్యుడు విశ్వవిద్యాలయం అధికారులకి జాబు రాశాడు. దాంతో సిగ్గుచేటు నిర్వాకం మీద దేశం దృష్టి పడింది. మత భూతాన్ని ప్రేరేపించి, మత విద్వేషం రెచ్చగొట్టి, రక్తపుటేరులు పాలించి, దేశాన్ని మూడు ముక్కలు చేసిన జాతిద్రోహి జిన్నా పటాన్ని పవిత్ర విద్యా ప్రాంగణం నుంచి అవశ్యం తొలగించి తీరాలని జాతీయవాదులైన భారతీయులు పట్టుబట్టారు. ఎనభై ఏళ్ల నుంచీ ఆ పటం అక్కడ ఉంటున్నా ఎవరికీ అభ్యంతరం లేనప్పుడు, ఇప్పటి కిప్పుడు దాన్ని తీసిపారేయాల్సిన అవసరమేమొ చ్చింది? పనిలేని భాజపా ఎంపీ కన్ను ఇప్పుడే దానిమీద ఎందుకు పడింది ? ఇదంతా ముసల్మాన్ల మీద కక్ష, మతసామరస్యానికి చిచ్చుపెట్టే కుట్ర-అని ‘లెఫ్ట్’ ‘లిబరల్’, ప్రోగ్రెసివ్’ వగైరా పేర్లు తగిలించు కున్న సూడో సెక్యులర్ మేధావిగణం ధ్వజమెత్తి వీరలెవల్లో విజృంభించింది. యూనివర్సిటీలో జిన్నా ఫోటోను ఉంచటానికి అభ్యంతరం ఎందుకుండాలి, జిన్నా భారత జాతీయ నాయకులు ఎవరికీ తీసిపోని మహానుభావుడు, హిందూ-ముస్లిం ఐక్యత కోసం పాటుపడిన పుణ్యాత్ముడు అంటూ జాతి విద్రోహ, ‘బ్రేకింగ్ ఇండియా బ్రిగేడ్’ మేధావి వర్గాలు సిగ్గూ ఎగ్గూ లేకుండా చరిత్రను వక్రీకరించి, తెంపరి వాదనలకు దిగాయి.
ఈ శిఖండీలని అడ్డం పెట్టుకొని హిందూ మతం మీద, హిందూ జాతీయత మీద తెరపి లేకుండా దాడిచేసే జిన్నా భక్త ముస్లిం మత్మోనాద జాతి వ్యతిరేక శక్తులు ముస్లింల భద్రతకు, మనుగడకు పుట్టి మునిగినట్టు గగ్గోలు పెట్టి, అవాంఛనీయ ఉద్రిక్తతను శాయశక్తులా రెచ్చగొట్టాయి.
1920లో విశ్వవిద్యాలయం ప్రతిపత్తి సంతరించుకున్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్టూడెంట్సు యూనియన్ గాంధి, అంబేడ్కర్, నెహ్రూ, జేపీ వంటి ఎందరో జాతీయ నాయకులకు లైఫ్ మెంబర్‌షిప్ ఇచ్చి, వారి పటాలను విద్యార్థి సంఘం హాలులో ప్రదర్శిస్తూ ఉండవచ్చు. ఈ క్రమంలో 1938 సంవత్సరాన మహమ్మదాలీ జిన్నాకు జీవితకాల సభ్యత్వం ఇవ్వటంలో గాని, అతడి చిత్రపటాన్ని ఇతర జాతీయ ప్రముఖుల సరసన ఉంచడంలో గాని ఎవరికీ ఆక్షేపణ ఉండనక్కరలేదు. ఎందుకంటే మిగతా అవలక్షణాలు ఎలా ఉన్నా 1938 నాటికి జిన్నా జాతీయవాది. జాతీయ రంగంలో ప్రముఖపాత్ర వహిస్తున్న ముస్లిం పెద్దల్లో ఒకడు. దేశాన్ని చీల్చాలన్న కుత్సితం ఆనాడు అతడికి లేదు. లేక అతడి అసలు రంగు అప్పటికి బయట పడలేదు. కాబట్టి 1938లో అతడి చిత్రపటాన్ని పెట్టటం వరకూ తప్పులేదు.
కాని, తరువాత రెండేళ్ళకు (1940 లో) అదే జిన్నా పాకిస్తాన్ డిమాండు ఎత్తుకున్నాడు. అఖండ భారతదేశంలో మాయదారి ముసలం పుట్టించిన రెండు జాతుల సిద్ధాంతాన్ని భుజాన వేసుకుని, జాతిని బ్లాక్‌మెయిల్ చేశాడు. 1946 సెప్టెంబర్ 16న డైరక్టు యాక్షన్‌కు రాక్షసమూకలను ఉసిగొలిపి, కలకత్తా నగరంలో, బెంగాల్ రాష్ట్రంలో హిందువులను వేలసంఖ్యలో ఊచకోత కోయించాడు. దేశవిభజన మ¬పద్రవాన్ని తెచ్చిపెట్టి లక్షలమంది ప్రాణాలు తీసి, కోట్లమందిని ఉన్నచోట్ల నుంచి వెళ్ళగొట్టి, భయానక బాధలకు గురిచేసి, ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని వలస విలయానికి ముఖ్య కారకు డయ్యాడు. ఏ రకంగా చూసినా జిన్నా అనేవాడు భారతదేశానికి శత్రువు. భారతీయుల పాలిట రాహువు. భారత ఉపఖండాన్ని ఏడు దశాబ్దాలకు పైగా దహిస్తున్న విద్వేషాగ్నికి, తీవ్ర అశాంతికి మూలహేతువు. అటువంటి జాతిద్రోహి, పక్కా క్రిమినల్ అయినవాడి పాపిష్టి మొహాన్ని జాతీయ నాయకుల చిత్రపటాల సరసన సగౌరవంగా ఇంకా ఉంచటం భారత జాతికి అవమానం.
ఢాకా యూనివర్సిటీలోనూ విద్యార్థుల వసతి గృహంలో ఒక హాలుకు జిన్నా పేరు ఉండేది. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించగానే 1972లో జిన్నా పేరు తీసేసి దాన్ని మాస్టర్ సూర్యసేన్ హాల్‌గా మార్చారు. ఆపాటి విజ్ఞత, ఆ మాత్రం జాతీయత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పెద్ద తలకాయలకు కూడా ఉండి ఉంటే దేశ విభజన ఘోరకలి తరువాతైనా ఎవరూ అడగకుండానే జిన్నా దిక్కుమాలిన బొమ్మను అక్కడి నుంచి తీసిపారేయించి ఉండేవాళ్ళు. ఆ పని చేయకపోగా, ఇన్ని దశాబ్దాల లేటుగా ఇప్పుడు దేశం దృష్టి ఆ అపచారం మీద పడిన తరువాతైనా నాలిక కరచుకుని, లెంపలేసుకుని, వెంటనే దాన్ని తీసి పడేసేందుకు త్వరపడకపోగా, తప్పు ఎత్తిచూపిన వారిమీదే నిందలేసి, అడ్డగోలు వాదాలను లంకించుకోవటం సహించరాని ధిక్కారం.
లోగడెప్పుడో లోకమాన్య తిలక్‌పై దేశద్రోహం కేసులో ఆయన తరఫున జిన్నా కోర్టులో వాదించినంత మాత్రాన అతగాడు భారతమాతకు పెట్టిన రంపపు కోత మహానేరం మటుమాయమై పోదు. పాకిస్తాన్ పార్లమెంటులో, తరువాతెప్పుడో అతడు వల్లించిన సెక్యులర్ ఇచ్చకాలను అంది పుచ్చుకుని అతడినో వీర సెక్యులరిస్టుగా, గొప్ప జాతీయవాదిగా మతిమాలిన మేధావులు ఇప్పుడు కీర్తించడం పుండుమీద కారమే.
ఇంత రచ్చ అయ్యాకా జిన్నా బొమ్మను యూనివర్సిటీ హాలు నుంచి ఈ వ్యాసం రాస్తున్న సమయానికి కూడా తొలగించలేదు. తీవ్ర నిరసన లకు వెరచి మొదట్లో దాన్ని తీసేసినట్టే తీసేసి మూడోనాటికల్లా మళ్ళీ తగిలించారు. దానికి వర్సిటీ వాళ్ళని తిట్టిపోసీ లాభం లేదు. ఎందుకంటే అసలు లొసుగు మనలో ఉంది. మనవాళ్ళ కోపం తాటాకు మంట. టీవీల్లో, పత్రికల్లో దానిమీద రాద్ధాంతం జరిగినంత సేపూ తెగ ఆవేశపడి వీరాలాపాలు చెయ్యడం, మీడియావాళ్ళు దాన్ని వదిలి, వేరే గోల ఎత్తుకోగానే ఆ ఊసు జనాలకు మరపున పడటం మామూలైపోయింది. ఇక రాజకీయ నేతాశ్రీల తీరు చూద్దామా అంటే మీడియా నాగస్వరాలకు తగ్గట్లు పడగ ఊపడమే తప్ప, కీలకమైన ఏ ఇస్యూ మీదా పట్టు వదలక కడదాకా పోరాడే ఓపిక, తీరిక ఏ కోశానా కనపడవు. జాతి పరువుకు, దేశభవితకు అతి ముఖ్యమైన ఏ అంశాన్నీ సీరియస్‌గా పట్టించు కోని ఉదాసీనత, తప్పించుకు తిరిగే పలాయన వైఖరి జాతి లక్షణాలుగా మారిన వైకల్యానికి జిన్నా ఉదంతం ఒక మచ్చుతునక.
ముస్లిం యూనివర్సిటీలో జిన్నా చిత్రపటం వివాదంలో మరీ ఎక్కువ పంతం పెడితే తమ సెక్యులర్ శీలానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, ముస్లిం మెహర్బానీకి ఎక్కడ దూరమవుతామో, హిందూ మతోన్మాదులన్న ముద్ర ఎక్కడ పడుతుందో నన్న భయం బతక నేర్చిన రాజకీయ పక్షాలకు, అవకాశవాద వర్గాలకు ఉండటంలో ఆశ్చర్యం లేదు.
ఇంకొంచెం లోతుకు వెళ్ళి పరిశీలిస్తే ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి తప్పు పట్టాల్సింది జాతి వ్యతిరేక జిన్నా చిత్ర పటానికి గౌరవస్థానం ఇవ్వడం ఒక్కటే కాదు, దానికంటే తీవ్రాభ్యంతకర మైనది జాతీయ చట్టం ప్రకారం ఏర్పడి, కేంద్ర నిధులతో నడుస్తూ కూడా జాతీయ విధానాలకు లోబడకుండా కేవలం ఒక ముస్లిం మైనారిటీ సంస్థగా అది చలామణి కాగలగడం!
నమ్ముతారో లేదో! అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఎ.ఎం.యు.) అనుభవిస్తున్నది ఏ చట్టమూ ఇవ్వని, భారత రాజ్యాంగం సుతరామూ అనుమతించని ప్రత్యేక ప్రతిపత్తి. చట్టపరంగా నిధులు, సౌకర్యాలు గట్రా రాబట్టేటప్పుడేమో అది ‘పబ్లిక్ ఇన్స్‌టిట్యూషన్’. రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు వగైరా నిబంధనలను వివిధ సామాజిక వర్గాలకు అమలు చేయడం దగ్గరికి వచ్చేసరికేమో అది ‘మైనారిటీ ఇన్య్‌టిట్యూషను’. కేంద్రరంగంలోని మిగతా యూనివర్సిటీలకు వర్తించే నియమాలు, కట్టడులు దానిముందు బలాదూరు. ఎందుకంటే దానికి ‘మైనారిటీ ఇన్స్‌టిట్యూషన్’ అన్న రక్షాకవచం ఉంది.
ఈ వైరుధ్యం అర్థశతాబ్దం కిందటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ‘అజీజ్ భాషా వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో సర్వోన్నత న్యాయస్థానం 1967లోనే విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. పార్లమెంటు చట్టం కింద ఏర్పడిన ఎ.ఎం.యు.కి మైనారిటీ ఇన్స్‌టిట్యూషన్ ప్రతిపత్తి నివ్వటం చట్టరీత్యా చెల్లదని సుప్రీంకోర్టు తేటతెల్లం చేసింది. అయినా నాటి ఇందిరాగాంధి ప్రభుత్వం మైనారిటీల మెహర్బానీ కోసం రాజ్యాంగం పట్ల బాధ్యతను విస్మరించి, న్యాయస్థానం తీర్పును పెడచెవిన పెట్టింది. మైనారిటీ ఓటుబ్యాంకుకు సంబంధించిన సున్నిత విషయం కనుక అదేమని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రాజకీయ పార్టీలూ ఆసక్తి చూపలేదు.
1977లో జనతా ప్రభుత్వం హయాంలో అలీగఢ్ వర్సిటీ ప్రతిపత్తి వ్యవహారంపై కాస్త అలజడి లేచింది. దానిపై ఎటూ నిర్ణయించక ముందే జనతా సర్కారుకు నూలు చెల్లాయి. దరిమిలా మళ్ళీ మన నెత్తినెక్కిన ఇందిరాగాంధీ 1981లో ఎ.ఎం.యు.కి రాజ్యాంగాతీత ప్రత్యేక ప్రతిపత్తిని స్థిరం చేస్తూ చట్టానికి దిక్కుమాలిన సవరణ తెచ్చింది. దానిమీద కోర్టుల్లో పలు కేసులు పడ్డాయి. పావు శతాబ్దంపాటు వ్యాజ్యాలు నడిచాయి. చివరికి 2006లో అలహాబాద్ హైకోర్టు 1981 చట్టం రాజ్యాంగ విరుద్ధమని కరాఖండిగా కొట్టివేసింది.
అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు చట్ట వ్యతిరేక నిర్వాకాన్ని కొట్టివేసి, నోట్లో గడ్డిపెట్టిన తరువాతైనా దేశమేలేవారికి బుద్ధి వచ్చిందా ? లేదు. 2006లో అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువడేసరికి దేశాన్ని పాలిస్తున్నది ఇటలీ దొరసాని కంట్రోల్లోని బినామి ప్రభుత్వమే. కాంగ్రెసు సహజ గుణం కొద్దీ, కోర్టు తీర్పును తుంగలో తొక్కేందుకు యు.పి.ఎ. సర్కారు పక్కదారులు వెతికింది. న్యాయస్థానం తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసి, లిటిగేషన్ల అస్త్రంతో ఎ.ఎం.యు.కి చక్రం అడ్డువేసింది.
వాయిదాలమీద వాయిదాలతో విపరీత కాలహరణం తరువాత కేంద్రంలో కొత్తగా వచ్చిన ఎన్‌డిఎ సర్కారు 2006 నాటి ప్రభుత్వ అపీలును ఉపసంహరించుకొంటామని సుప్రీంకోర్టుకు చెప్పింది. ఆ పని ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్టు లేదు. జాప్యానికి కారణమేమిటో తెలియదు. యుపిఎ పోయి ఎన్‌డిఎ వచ్చినా… దిక్కుమాలిన చట్ట సవరణను అలహాబాదు హైకోర్టు కొట్టివేసిన పుష్కరం తరువాత కూడా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ రెండావుల దూడే. దానిది భారతదేశంలో ఉంటూనే భారత రాజ్యాంగానికి అతీతమైన ప్రత్యేక మైనారిటీ ప్రతిపత్తే!
ఏదో ఒకటి – తప్పో ఒప్పో ఎన్నో తరాలుగా అమలులో ఉన్న ఏర్పాటును ఇప్పుడు ఎందుకు చెడగొట్టాలి ? మైనారిటీలకు సంబంధించిన యూని వర్సిటీ విషయంలో కొత్తగా ఆంక్షలు పెడితే ముస్లింల మనోభావాలు గాయపడవా ? మైనారిటీల పేరు చెబితే హడలిపోయే బతక నేర్చిన రాజకీయ వాదులు, ముస్లిం పక్షపాతులైన సోకాల్డ్ సెక్యులర్ మేధావులు ఇలాంటి కుశంకలు బాగానే లేవదీస్తారు. వాస్తవానికి ఇది ముస్లింలకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. విద్యారంగంలో మామూలు చట్టాలు, రాజ్యాంగ నిబంధనలు అలీగఢ్ వర్సిటీల లోనూ చెల్లుబాటయ్యే పక్షంలో మిగతా విశ్వ విద్యాలయాలలో వలె అక్కడా షెడ్యూల్డు కులాలు, తెగలు, ఇతర బలహీన వర్గాలకు యధావిధిగా రిజర్వేషన్లు అమలు జరుగుతాయి. ఆ మేరకు దళిత, దుర్బల వర్గాలకు సముచిత సామాజిక న్యాయం చేకూరుతుంది. తమది కేవలం ముస్లింలకు పరిమిత మైన మైనారిటీ విద్యా సంస్థ అన్న అడ్డగోలు వాదనతో ఇప్పటిదాకా రాజ్యాంగ విహితమైన రిజర్వేషన్లను ఎ.ఎం.యు. ఎగవేస్తూ వస్తోంది. దానివల్ల నష్టపోతు న్నది బడుగు, బలహీన, దళిత సామాజిక వర్గాలు.
సామాజిక న్యాయం కోసమే, అట్టడుగు సామాజిక వర్గాలను పైకిలాగేందుకే ఊపిరి తీస్తున్నట్టు విసుగు లేకుండా చెప్పుకునే రాజకీయ పార్టీలు, ‘సెక్యులర్’ మేధావి వర్గాలు, పాలక వర్గాలు మైనారిటీల మెహర్బానీ కోసం ఎస్.సి, ఎస్.టి., ఒ.బి.సి.లకు తరతరాలుగా జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎప్పటికి గుర్తిస్తాయి?
చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని ఉన్నత న్యాయస్థానాల్లో ఎన్నో ఏళ్ల కిందే తిరస్కరించిన అవ్యవస్థను ఇంకా కొనసాగనివ్వటం వల్లే అలీగఢ్ విశ్వవిద్యాలయంలో రకరకాల వికారాలు, వికృత ధోరణులు ప్రబలాయి. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తమ యూనివర్సిటీలో అడుగుపెట్టనే కూడదని ఎ.ఎం.యు. స్టూడెంట్స్ యూనియన్ ఆ మధ్య హుంకరించగలిగింది. ఎందుకంటే ఆయన భావజాలం విద్యార్థిసంఘం వారికి సరిపడనిదట! దేశంలో పన్ను చెల్లించే పౌరులందరి సొమ్ముతో భారత చట్టాల మేరకు నడిచే ఏ విశ్వవిద్యాలయం లోనైనా చట్టానికి లోబడి తమ కార్యకలాపాలను నెరపుకునే హక్కు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహా, బౌద్ధిక రంగంలోని ప్రతి జాతీయ సంస్థకూ ఉన్నది. ఎ.ఎం.యు.లో ఆరెస్సెస్ శాఖను నడుపుతా మంటేనే అక్కడి అధికారుల నుంచి విద్యార్థి సంఘం నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన వచ్చింది.
బెనారస్ హిందూ యూనివర్సిటీ (బి.హెచ్.యు.) లో హిందువులకు లేని ప్రత్యేక ప్రతిపత్తి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ముస్లింలకు మాత్రం ఎందుకుండాలి? బి.హెచ్.యు.ని హిందూ మతసంస్థగా గుర్తించ నప్పుడు దానిలాగే సెంట్రల్ యూనవర్సిటీ అయిన ఎ.ఎం.యు.ని మాత్రం ముస్లిం సంస్థగా ఎందుకు చలామణి కానివ్వాలి ? ఒక జిన్నా చిత్రపటం తొలగింపు కంటే అతి ముఖ్యమైన మౌలిక ప్రశ్నలివి. జిన్నా బొమ్మ కంటే అలీగఢ్ వర్సిటీని, సోకాల్డ్ సెక్యులర్, లిబరల్ మేధావి వర్గాలను కమ్మిన జిన్నా మనస్తత్వం మరింత ప్రమాదకరమైనది.
– ఎం.వి.ఆర్.శాస్త్రి
(జాగృతి సౌజన్యం తో)