కథువా కేసు: ప్రత్యేక విచారణ అధికారులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదుకు కోర్ట్ ఆదేశం
దేశంలో సంచలనం సృష్టించిన కథువా కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక బృందానికి (సిట్) చెందిన ఆరుగురు విచారణాధికారులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాల్సిందిగా జమ్మూ కోర్టు పోలీసులను ఆదేశించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న విశాల్ జంగోత్రాకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిందిగా సిట్ అధికారులు కథువా జిల్లాకు చెందిన సచిన్ శర్మ, నీరజ్ శర్మ, సాంబా జిల్లాకు చెందిన సాహిల్ శర్మలను తీవ్ర వేధింపులకు గురిచేసినట్టు కోర్ట్ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఆరుగురు విచారణాధికారులు – పీర్జాదా నవీద్ (జమ్మూ క్రైమ్ బ్రాంచ్ ఎఎస్పీ), నాసిర్ హుస్సేన్ (జమ్మూ క్రైమ్ బ్రాంచ్ డెప్యూటీ ఎస్పీ), ఉర్ఫాన్ వనీ (జమ్మూ క్రైమ్ బ్రాంచ్ సబ్- ఇన్స్పెక్టర్)లతో పాటు మరో ముగ్గురు అధికారులపై ఎఫ్.ఐ.ఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాల్సిందిగా జమ్మూ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జమ్మూ పోలీసులను ఆదేశించింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజి రామ్ కొడుకు విశాల్ జంగోత్రా నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే దీనిపై జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పోలీసులు హైకోర్టులో అప్పీల్ చేసినట్టుగా తెలుస్తోంది.
Source: India Today.