Home Telugu Articles జ్ఞానం, జన్మరాహిత్యం కలిగించే శ్రీరామనామ స్మరణ

జ్ఞానం, జన్మరాహిత్యం కలిగించే శ్రీరామనామ స్మరణ

0
SHARE

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ద నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీరాముని జన్మతిథిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. శ్రీ సీతారాముల కళ్యాణము కూడా నమినాడే జరిగినదని ప్రజల విశ్వాసము.

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో, శాంతితో విలసిల్లితే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మాగాంధీ కూడా స్వాతంత్య్రానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించారు. శ్రీరామనవమి రోజు ఉదయాన్నే సూర్య భగవానుడుకి ప్రార్థన చేయటంతో కార్యక్రమం ప్రారంభమౌతుంది. శ్రీరాముడు జన్మించిన మధ్యాహ్న సమయానికి విశేష పూజలు మరియు కళ్యాణము నిర్వహిస్తారు. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి దగ్గరగా వస్తాడు. వేసవి తీవ్రతను తట్టుకోవటానికి భక్తులకు పానకం, వడపప్పు ప్రసాదంగా వితరణ చేస్తారు. శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు. ఇదే వంశంలో దిలీపుడు, రఘువు, ఇక్ష్వాకుడు, హరిశ్చంద్రుడు మైదలైన వారు జన్మించారు. భారతదేశంలో ముఖ్యమంగా తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమి రోజు సీతారముల కళ్యాణం భక్తిశ్రద్దతో జరుపుతారు.

భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకొని వస్తారు.

గ్రామాలలో శ్రీరామనవమి రోజున వీధులలో పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. గృహాలలో యదాశక్తిగా శ్రీరాముని పూజించి వడపప్పు, పానకం, వైవేద్యం చేసి అందరికీ పంచుతారు.

రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మ రాహిత్యాన్ని కలిగిస్తుంది.