Home News కదులుతున్న కశ్మీర్‌ తేనెతుట్టె, 35-ఏ అధికరణపై వివాదం

కదులుతున్న కశ్మీర్‌ తేనెతుట్టె, 35-ఏ అధికరణపై వివాదం

0
SHARE

జమ్ము కశ్మీర్‌లో 35-ఏ అధికరణ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వివిధ పార్టీలు, వేర్పాటువాద సంస్థల్లో దీనిపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. దీని చెల్లుబాటుపై దాఖలైన మూడు వ్యాజ్యాలను దీపావళి అనంతరం విచారిస్తామని న్యాయస్థానం పేర్కొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజ్యాంగాన్ని సవరించకుండా, పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఈ అధికరణను రాజ్యాంగంలో చేర్చారని, కాబట్టి దానికి చెల్లుబాటు లేదని 2014లో దిల్లీకి చెందిన ‘ఉయ్‌ ద సిటిజన్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో వాజ్యం వేసింది. 35-ఏ అధికరణ తమ పిల్లలకు ఓటుహక్కు లేకుండా చేస్తోందని పేర్కొంటూ చారువాలి ఖన్నా, డాక్టర్‌ సీమ రజదాన్‌ భార్గవ అనే ఇద్దరు కశ్మీరీ మహిళలు నెల కిందట సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయవాది అయిన డాక్టర్‌ ఖన్నా గతంలో జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా పనిచేశారు. కశ్మీర్‌కు పశ్చిమ పాకిస్థాన్‌నుంచి వలస వచ్చిన శరణార్థులు తాము 35-ఏ వల్ల నష్టపోతున్నామంటూ మరో వ్యాజ్యం వేశారు. ఇది విచక్షణపూరితమైనదని కక్షిదారులు వాదిస్తున్నారు. జమ్ము కశ్మీర్‌లో సుమారు ఏడుశాతం మేర పాక్‌నుంచి వచ్చి స్థిరపడిన శరణార్థులు ఉన్నారని, వారంతా ఆ రాష్ట్రంలో ద్వితీయశ్రేణి పౌరులుగా బతుకులీడ్వాల్సి వస్తోందని, ప్రభుత్వపరంగా వారి పిల్లలూ లబ్ధి పొందేందుకు అనర్హులవుతున్నారన్న ఆవేదన వినిపిస్తోంది. ఈ వ్యాజ్యంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టులో కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ అంశాన్ని అవసరమైతే విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది.

రాజకీయ పక్షాల ఆగ్రహం

జమ్ము కశ్మీర్‌ పేరు చెప్పగానే దానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణ తొలుత గుర్తుకు వస్తుంది. నిజానికి 35-ఏ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. నిన్నమొన్నటి వరకు అసలు ఇది ఉన్నట్లూ చాలామందికి తెలియదు. దీని చెల్లుబాటుపై వ్యాజ్యాలూ దాఖలు కావడం, రాజకీయ వర్గాల్లో వాద ప్రతివాదాలు చెలరేగడంతో ఈ అంశం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. శాశ్వత నివాసులు అన్న పదాన్ని నిర్వచించడానికి- వారికి ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పించేందుకు రాష్ట్ర శాసనసభకు 35-ఏ అధికరణ అధికారం కల్పిస్తోంది. దీనిని 1954 మే 14న రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం జమ్ము కశ్మీర్‌కు చెందిన మహిళ ఆ రాష్ట్రం వెలుపలి వ్యక్తిని వివాహం చేసుకున్నట్లయితే ఆమెకు, ఆమె సంతానానికి ఆ రాష్ట్రంలో ఆస్తి హక్కులు, ఉపాధి అవకాశాలు ఉండవు. శాశ్వత నివాసులుగా గుర్తింపు పొందినవారు మాత్రమే అక్కడి కళాశాలల్లో ప్రవేశాలకు, ఉపకార వేతనాలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు, ఇతరత్రా సర్కారీ సాయాలకు అర్హులు. ఆ రాష్ట్రంలో స్థిరాస్తుల కొనుగోలుకు, స్థిర నివాసానికీ వారే అర్హులు. శాశ్వత నివాసులుగా గుర్తింపు లేనివారికి ఈ హక్కులేమీ ఉండవు. అలాంటి ప్రత్యేక హక్కులు, అధికారాలు రాజ్యాంగ విరుద్ధమా, కాదా; అందులో లింగపరమైన విచక్షణ ఉందా; విధానపరమైన వైఫల్యాలేమిటి వంటి అంశాలను లోతుగా పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

విస్తృత చర్చ జరగాలన్న కేంద్రం వాదనపై కశ్మీర్‌కు చెందిన పార్టీలు మండిపడుతున్నాయి. 35-ఏ పై ఒక్క భాజపా తప్ప ఆ రాష్ట్రానికి చెందిన పార్టీలన్నీ ఒకే గొంతు వినిపిస్తున్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అధికార, విపక్షాలు- పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌తోపాటు వేర్పాటువాద సంస్థలు సైతం గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించాయి. ప్రభుత్వం, విపక్షాలు, వేర్పాటువాద సంస్థలు ఒకే గొంతుతో మాట్లాడటం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. వేర్పాటువాద సంస్థల నాయకులు సయ్యద్‌ అలీ షా గిలానీ, మిర్వాయిజ్‌ ఒమర్‌ ఫరూక్‌, యాసిన్‌ మాలిక్‌ ఇప్పటికే బంద్‌లతో రాష్ట్రాన్ని హోరెత్తించారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్వయంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాను కలిసి చర్చించారు. ఈ అధికరణను తొలగిస్తే కశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని మోసే వారు కూడా ఉండరని కిందటి నెల 29న దిల్లీలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడుతూ ఆమె హెచ్చరిక స్వరం వినిపించారు. రాష్ట్రంలో భాజపాతో కలిసి ఆమె సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న విషయం ఇక్కడ గమనార్హం. 35-ఏను కొనసాగించాలని పీడీపీ కోరుతుండగా, మిత్రపక్షం భాజపా మాత్రం దానిపై విస్తృతచర్చ జరగాలని భావిస్తోంది. 2015లో రాష్ట్రంలో పీడీపీ-భాజపా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ 370 అధికరణపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించాయి. ఇక ఫరూక్‌ మరో అడుగు ముందుకేశారు. కేంద్రం తన విధానాన్ని మార్చుకోకపోతే 2008నాటి అమర్‌నాథ్‌ తరహా ఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. అప్పటి ఘటనలో సుమారు 70మంది హతులయ్యారు. పీసీసీ అధ్యక్షుడు గులాం అహ్మద్‌ మీర్‌తో పాటు ఇతర చిన్నాచితకా పార్టీలు సైతం వీరికి మద్దతుగా నిలిచాయి. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారని మెహబూబా ముఫ్తీ చెబుతున్నా విశ్వసించలేకపోతున్నామని ఆయా పార్టీలు అంటున్నాయి. 35-ఏ రద్దు అంటే కశ్మీర్‌ విలీనాన్ని ప్రశ్నించడమేనని ఆ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. 35-ఏ రద్దుకు పూనుకొంటే దాని ప్రభావం 370 అధికరణపైనా పడుతుందని హెచ్చరిస్తున్నాయి. ఏదో ఒకరోజు దాన్నీ రద్దు చేసేందుకు కేంద్రం పావులు కదుపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సర్కారు తర్జనభర్జనలు

నిజానికి 35-ఏ అధికరణ రాజ్యాంగం ఆమోదించిన జమ్ము కశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి సంబంధించిన 370 అధికరణకు అనుబంధమే తప్ప మరొకటి కాదనీ వాదిస్తున్నాయి. అధికారం కోసమే మెహబూబా కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, కేంద్రంపై గట్టి ఒత్తిడి తీసుకురావడం లేదని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అయితే మెహబూబా కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. రాజకీయంగా ఇది తనకు జీవన్మరణ సమస్య అని భావిస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించలేకపోయినా లేదా కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినా రాజీనామా తప్ప మరో గత్యంతరం లేదని ఆమె భావిస్తున్నారు. అందుకే ప్రజల మద్దతు సమీకరించడంతోపాటు న్యాయపోరాటం చేయాలని భావిస్తున్నారు. ఆ క్రమంలో ఫాలీ నారిమన్‌ వంటి ఉద్ధండులతో సంప్రతింపులు జరిపేందుకూ సిద్ధపడుతున్నారు. భాజపా రహస్య అజెండాలో భాగంగానే ఈ విషయం ఒక్కసారిగా తెరపైకి వచ్చిందని విపక్షాలు వాదిస్తున్నాయి. మొదటినుంచీ 370 అధికరణను వ్యతిరేకిస్తున్న భాజపా సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగా దాని జోలికి పోకుండా, తొలుత 35-ఏ పై దృష్టి పెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 35-ఏని రద్దు చేసినట్లయితే దాని ప్రభావం 370 అధికరణపై పడుతుందని భాజపాయేతర పార్టీలు భావిస్తున్నాయి. 35-ఏపై విస్తృత చర్చ జరగాలన్న అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ అభిప్రాయంలో అంతరార్థమూ ఇదేనని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

35-ఏ అధికరణ వ్యతిరేకుల వాదన మరో రకంగా ఉంది. రాజ్యాంగంలోకి ఒక కొత్త అధికరణాన్ని చేర్చేందుకు అవసరమైన విధి విధానాలను 368 అధికరణ నిర్దేశిస్తోంది. దాన్ని విస్మరించి, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకుండా, రాజ్యాంగ సవరణ లేకుండా, ఆనాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 35-ఏని రాజ్యాంగంలోకి చేర్చాయన్నది మరో వాదన. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 370, 35-ఏ అధికరణలు రూపుదిద్దుకున్నాయని, అంతమాత్రాన వాటిని ఎల్లకాలం కొనసాగించాలనడం అర్థరహితమన్నది వారి అభిప్రాయం. ఇరువైపు వాదనలూ బలంగా వినబడుతున్నా, ఈ అంశం ప్రజల భావోద్వేగాలతోనూ ముడివడి ఉంది. ఇలాంటి విషయాల్లో చర్చలు, సంప్రతింపుల ద్వారా ఇరు పక్షాలూ ఓ సహేతుక నిర్ణయానికి రావాలి. న్యాయస్థానాల పాత్ర పెద్దగా ఉండదు. కీలక సరిహద్దు రాష్ట్రానికి సంబంధించి విషయంలో ఆచితూచి అడుగేయడం అవసరం!

– గోపరాజు మల్లపరాజు

(ఈనాడు సౌజన్యం తో)