Home News కరవును జయించిన కామేగౌడ

కరవును జయించిన కామేగౌడ

0
SHARE

మంచి ఆలోచన, నలుగురికి పనికివచ్చే పని చేయాలనే సంకల్పం ఉంటే ఎలాంటి కార్యాన్నైనా చేయవచ్చని నిరూపించాడు కర్ణాటకలోని మాండ్యకి చెందిన కామేగౌడ. 40 ఏళ్లపాటు అతను చేసిన కృషి వల్ల వర్షాలు లేనప్పుడు కూడా ఆ గ్రామంలో పుష్కలంగా నీరు లభిస్తోంది. ఇటీవల కామేగౌడ చనిపోయినా అతను చేసిన పని మాత్రం గుర్తుండిపోతుంది.

మాండ్య ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేక కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. భూగర్భజలాలు కూడా అడుగంటిపోయాయి. బోరుబావులు ఎండిపోయాయి. దీనితో ఉన్న కాస్త నీటిని రక్షించుకోవడం, జాగ్రత్తగా వాడుకోవడం ముఖ్యమైంది. దాసనదొడ్డి గ్రామానికి చెందిన కామేగౌడ ఆ పనికి పూనుకున్నాడు. ఆ ప్రాంతంలో చెట్లను, ప్రకృతి సిద్ధమైన నీటివనరులను పరిరక్షించడానికి నడుంబిగిం చాడు. ఎవరి సహాయం కోసం చూడకుండా స్వయంగా రంగంలోకి దిగాడు. కాలువలు తవ్వాడు, ఆనకట్టలు కట్టాడు. రోడ్లు, చెక్‌ డామ్‌లు నిర్మించాడు. కొండలపై నుంచి వచ్చే నీటిని తమ గ్రామాలవరకు వచ్చేట్లుగా ఏర్పాటు చేశాడు. 40 ఏళ్ల అతని కృషి వల్ల ఇప్పుడు అతని గ్రామంతోపాటు చుట్టుపక్క గ్రామాల్లో కూడా నీటికి లోటు లేదు. చుట్టూ కరవు పరిస్థితులు ఉన్నా ఈ గ్రామాల్లో పుష్కలంగా నీరు లభిస్తోంది.

ఎప్పుడు పాఠశాలకు వెళ్లని కామేగౌడ అద్భుతమైన జల వనరుల నిర్వహణ పద్దతులను అమలుచేసి చూపించాడు. కొండలపై నుంచి తన గ్రామమైన దాసనదొడ్డి వరకు అయిదుకు పైగా ఆనకట్టలు నిర్మించాడు. ఒక చెక్‌ డ్యామ్‌ నిండితే మరొక దానిలోనికి నీరు ప్రవహించే విధంగా ఏర్పాటు చేశాడు. 78 ఏళ్ల వయస్సులో మరో రెండు చెక్‌ డ్యామ్‌లు నిర్మించడానికి పూనుకున్నాడు. దానికి అవసరమైన డబ్బు కూడా స్వయంగా సమీకరించుకున్నాడు. తనకున్న మేకలు, గొర్రెలను అమ్మేయగా వచ్చిన 6 లక్షల రూపాయలు ఆ పనికి ఖర్చుపెట్టాడు. తనకు వచ్చే కొద్దిపాటి పెన్షన్‌ డబ్బు కూడా చాలాసార్లు అతను ఈ పనికే వినియోగించే వాడు. కోడలి పురిటికోసం పొదుపు చేసిన 20 వేల రూపాయలు కూడా ఖర్చుపెట్టి పుట్టిన పిల్లవాడు కృష్ణ పేరుతో ఒక చెక్‌ డ్యామ్‌ నిర్మించాడు. పురుడు సజావుగా జరిగింది కాబట్టి, డబ్బు ఖర్చు కాలేదు కాబట్టి తాను అలా చేశానని చెప్పాడు కామేగౌడ. కొండలపై మొక్కలు నాటడం కూడా అతను చేపట్టిన పనిలో భాగమే. సాధారణ మొక్కలతోపాటు అనేక మందు మొక్కలను కూడా నాటాడు. అంతేకాదు అటవీ శాఖ వారు నాటిన మొక్కలకు కూడా అతనే సంరక్షణ చేసేవాడు.

కామేగౌడ 40 ఏళ్లపాటు చేసిన కృషివల్ల నేడు మాండ్యలో అనేక గ్రామాలు నీటితో కళకళ లాడుతున్నాయి. కరవు బారినుండి శాశ్వతంగా బయటపడ్డాయి.

(లోకహితం సౌజన్యం తో)