Home Hyderabad Mukti Sangram ప్రతి చిన్న విషయంపై ముస్లింల హంగామా… (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-6)

ప్రతి చిన్న విషయంపై ముస్లింల హంగామా… (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-6)

0
SHARE

ప్రతి చిన్న విషయంపై ముస్లింలు హంగామా చేసేవారు. ఈ వాతావరణంలో ఆ చిన్న సంఘటన పెద్ద తగాదాగా మారింది. అక్కడే ఉన్న ముదఖేడ్‌కర్ సోదరులు కలుగచేసుకున్నారు. దిగంబరరావు స్థానిక ఆర్యసమాజ శాఖకు కార్యదర్శి. ఆ రోజుల్లో హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఆర్యసమాజ్ అన్ని విధాల ప్రయత్నాలు జరిపేది. అందువల్ల కార్యదర్శి దిగంబర రావు, ఆయన తమ్ముడు దత్తాత్రేయ అక్కడ ముస్లింలకు శత్రువులుగా కనపడేవారు. ఆనాటి సందర్భాన్ని పురస్కరించుకొని దగ్గరలోనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆవరణలో చెట్లవెనకాల నుండి అరబ్బీ వాచ్‌మన్ కాల్పులు జరిపాడు.

ఫలితంగా దత్తాత్రేయ చనిపోయాడు. దిగంబరరావు తీవ్రంగా గాయపడ్డాడు. ముదఖేడ్‌కర్ కుటుంబంలో శోకజ్వాలలు వ్యాపించాయి. దేవీదాస్ రావు ముదఖేడ్‌కర్ ఇద్దరు కుమారులలో చిన్నవాడు దత్తాత్రేయ మరణించాడు. అతను ఎనిమిదినెలల క్రితమే వివాహమాడిన అమ్మాయి విధవ అయినది. గాయపడిన పెద్దవాడు దక్కుతాడో లేడో? ఒకవేళ దక్కినా నిజాం పోలీసులు అతన్ని వదులుతారా? సంస్థానంలో ఎక్కడ చూసినా రజాకార్ల అత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. దిగంబరరావు కోలుకొని ఇంటికిరాగానే నిజాం పోలీసులు అల్లరి, హత్యాప్రయత్నం అనే నేరాలు మోపి అరెస్టు చేశారు. నిజాం పరిపాలనలో విచిత్రమైన న్యాయం కొనసాగేది. హత్య చేయబడినది తమ్ముడు. చేసినది అరబ్బీ వాచ్‌మెన్. హత్యా ప్రయత్నం నేరాన్ని గాయపడిన అన్నపై మోపారు. హత్య చేసిన అరబ్బీవాడు నిర్దోషిగా మిగిలాడు.

ప్రతీకారం

ఈ సంఘటనతో ఉమ్రీ యువకుల్లో గొప్ప సంచలనం చెలరేగింది. ప్రతీకారవాంఛతో యువకులు ఆలోచించ మొదలుపెట్టారు. దేశం స్వతంత్రమైనా నిజాం మాత్రం తాను, తన సంస్థానాన్ని స్వతంత్రంగా నిలుపుకోవాలని రజాకార్లను పెంచాడు. అన్నిచోట్ల ముస్లింలు మతకల్లోలాలను సృష్టిస్తున్నారు. హిందువులు విపరీతమైన అన్యాయాలకు గురి అవుతున్నారు. ఆ సమయంలో హిందువులు భారతదేశంలో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఉమ్రీ నుండి బరార్ నుండి ఉమర్‌ఖేడ్ అనే ప్రాంతానికి అనేక హిందూ కుటుంబాలు శరణార్థులుగా వెళ్ళిపోయాయి. అందులో ముదఖేడ్‌కర్ కుటుంబం కూడా ఒకటి. దిగంబరరావు పూచీకత్తుపై విడుదలై బయటికి వచ్చాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకొని అతడు ఉమర్‌ఖేడ్‌కు పారిపోయాడు.

అక్కడ స్టేట్ కాంగ్రెస్ హిందూ శరణార్థుల సహాయార్థం ప్రత్యేక శిబిరాలను నిర్వహించింది. ఈ శిబిరాలలో సహాయ కార్యకలాపాలతో పాటు హిందూ యువకులకు ఆయుధాల ఉపయోగంలో శిక్షణ ఇచ్చేవారు. బెరార్ సరిహద్దును తాకి ఉన్న ఉమ్రీ నుండి రజాకార్లు దాడి చేస్తుండేవారు. ఆ దాడులను ఎదుర్కొనడానికి ఆ హిందూ యువకులు సంసిద్ధంగా ఉండేవారు. అందులో ఉమ్రీనుండి వచ్చిన యువకులు అవకాశాన్ని చూసి దత్తాత్రేయ మరణానికి ప్రతీకారం చేయాలని పథకాలు వేశారు. అందరికీ ఒక పథకం నచ్చింది. ఉమ్రీ స్టేట్ బ్యాంక్‌పై దాడిచేసి లూటీ చేసిన డబ్బుతో స్టేట్ కాంగ్రెస్‌కు సహాయపడాలని, కాని ఆ దాడికి కావలసిన ఆయుధాల సేకరణ సమస్యగా మారింది.

ఉమ్రీ భామాషా

అంతకు పూర్వమే ఉమ్రీ ప్రాంతపు యువకులు, స్టేట్ కాంగ్రెస్ కార్యకర్తలు నాగపూర్, జబల్‌పూర్‌లలో హోమ్‌గార్డ్స్ దళాలలో శిక్షణ పొంది వచ్చారు. ఆయుధాలతో దాడి చేయడం వగైరా అంశాలలో తర్ఫీదుపొంది సిద్ధంగా ఉన్నారు. ఉమ్రీ బ్యాంక్‌పై దాడి చెయ్యాలంటే మాటలతో అయ్యేపని కాదు. దాదాపు 30 మైళ్ళ వరకు ఆయుధాలను తీసుకుపోవడం, అందులో రజాకార్లతో నిండిన నిజాం సంస్థానంలోకి చొరబడడం కష్టసాధ్యం. అయినా ఆధునిక ఆయుధాలు కావాలి. ఆ సందర్భంలో ధన్‌జీ అనే వ్యక్తి తన ఆస్తినంతా అమ్మి నలభైవేల రూపాయలు విరాళంగా ఇచ్చాడు.

ధన్‌జీ ఆ కష్ట సమయంలో అంత డబ్బు విరాళంగా ఇవ్వడం అపూర్వం. మొగల్ రాజులను ఎదుర్కొనడానికి రాణాప్రతాప్‌కు సర్వస్వం దానం చేసిన “రాజస్థాన్ భామాషా” అనే సంపన్నుడు ఈ సందర్భంలో అందరికీ జ్ఞాపకం వచ్చాడు. ధన్‌జీని “ఉమ్రీ భామాషా” అని పిలిచేవారు. విరాళంగా వచ్చిన డబ్బుతో కావలసిన ఆధునిక ఆయుధాలను కొనడం జరిగింది. యువకులందరూ అమితోత్సాహంతో సన్నాహాలు ప్రారంభించారు. ఉమ్రీ బ్యాంక్‌పై 12 జనవరి, 1948 నాడు దాడిచేయాలని నిర్ణయించారు.

ఉమర్‌ఖేడ్ నుండి సాయుధులైన యువకబృందం 30 మైళ్ళు ప్రయాణం చేసి ఉమ్రీ చేరింది. క్రమేణ ఉత్సాహం చల్లబడి ఆలోచన రేకెత్తింది. రాత్రి దాడిచేస్తే చీకట్లో అనేక మంది అమాయకుల ప్రాణాలు పోవచ్చును. అలజడిలో మిత్రులు పరస్పరం కాల్పులకు గురికావచ్చు. అందువల్ల  అన్ని జాగ్రత్తలతో ఒక పథకాన్ని రూపొందించుకొనటానికి ఉమర్‌ఖేడ్‌కు తిరిగి వచ్చేశారు.

ఆ తర్వాత ఈ రహస్యం వదంతులుగా వ్యాపించింది. ఉమ్రీ బ్యాంక్  మీద దాడిచేయడానికి ఒక జట్టు వచ్చిందనే విషయం ప్రజలు అనుకోసాగారు. నిజాం పోలీసు, రజాకార్ల బృందం 30 మైళ్ళు దాటి రహస్యంగా దాడి చేయాలంటే ఎవరికైనా ఎన్ని దమ్ములుండాలి! నిజాం బలగం ప్రజల వదంతులను ఖండించింది. అయినా తన జాగ్రత్తలో ఉంది. ఉమ్రీలో సాయుధ పోలీసు బలగాన్ని ఇంకా పెంచింది. ఉమ్రీ సరిహద్దు పొడవునా అశ్వికదళాన్ని కాపలా ఉంచింది. ఈ పరిస్థితుల్లో ఉమ్రీ బ్యాంక్‌పై దాడిచేయటం అంత సులభం కాదు. అందువల్ల సాయుధ దళాన్ని మరో చోటికి దృష్టి మళ్ళింప చేసి తమ ప్రయత్నాన్ని సాగించాలని యువకబృందం ఎత్తుగడ వేసింది.

(విజయక్రాంతి సౌజన్యం తో)