Home News ఆధ్యాత్మికతయే భారతీయ రాజకీయం

ఆధ్యాత్మికతయే భారతీయ రాజకీయం

0
SHARE

–  జె. నందకుమార్

కొంతమంది మేధావులనబడేవాళ్ళు, భారతదేశం, వలసవాదుల నుండి తన స్వాతంత్ర్యం పొందింది అని విశ్వసిస్తారు, కానీ ఇది వాస్తవం కాదు. అందుచేత, మనదేశచరిత్ర తెలుసుకోవటం, ప్రతిఒక్కపౌరుడికీ ముఖ్యం, అవసరం, ప్రత్యేకించి యువతరం బాధ్యత కూడా. 1947 తరవాత జన్మించిన వారందరూ, మన స్వాతంత్ర్య సమరయోధులు పడిన కష్టాలూ, ఇబ్బందులూ ఎప్పుడూ ఎదుర్కోలేదు. అందుకే, మనందరం “స్వతంత్రత” అనే పదానికి ‘వాస్తవమైన అర్థం’ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

మనం స్వతంత్రులముగా ఉన్నప్పుడే, కళలలో ఉత్తమమైనది ప్రదర్శించవచ్చు, లేదా యోగాలో మనం ఏదైనా పందెం కాయవచ్చు. కానీ, స్వతంత్రత అంటే శ్రీ అరవిందులకు ఉన్న అవగాహన చాలా విశాలమైనది, అది రాజకీయమా? లేక ఆర్థికపరమైనదా? అంటే, ఏదీ కాదు.

యోగి అరవిందులు (శ్రీ అరవింద ఘోష్) – “భారత్‌ను మేలు కొలపటం అనేది, నైతికంగా, ఆధ్యాత్మికంగా జరుగుతుంది, అంతేకానీ, యాంత్రికంగా కాదు”, అని విశ్వసించారు. 1905కి ముందు వరకూ, స్వతంత్రత అనేది మన కర్తవ్యంగా ఉన్నప్పటికీ, మనం ప్రభుత్వమార్పు (అధికార మార్పిడి) వరకు మాత్రమే పరిమితం చేసి, చూడకూడదు. అయినా, రాజకీయ ఆధ్యాత్మికత అనేది ఒక భాగం మాత్రమే, ఆదర్శమైన దృష్టికోణం ఏమిటంటే, అన్ని రంగాలలోనూ, అంటే -రాజకీయం, సామాజికం, కళాత్మకం, సాహిత్యం మొదలైనవన్నీ కూడా కలిసిపోయి, ఏకమైనదే  ‘ధర్మం’. మన ‘సనాతన ధర్మం’, జాతీయ ధర్మం మాత్రమే కాదు, అన్ని ధర్మాలూ అంగీకరించిన విశ్వమతం. మనం సనాతనధర్మం కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి.

ఇటీవల మన 75వ స్వాతంత్ర్యదినోత్సవం నాడు, మన ప్రధానమంత్రి శ్రీ మోడీజీ నిర్దేశించిన పంచప్రాణాలలో, రెండవ ప్రాణం, మానసిక బానిస భావ నిర్మూలన, అని చాలా స్పష్టంగా ఉన్నది.

“సర్వం ఆత్మ సుఖం” అనే ఆర్యోక్తి లో ‘స్వ’ అంటే సుఖం. యోగి అరవిందుల ఉపదేశం ప్రకారం, స్వాతంత్ర్యం కోసం మన శోధన, ‘స్వ’ నుండి ప్రారంభించాలి.

1905లో బ్రిటిష్ పాలకులు, బెంగాల్ విభజనను ప్రతిపాదించిన అనంతరం, ‘ఆనంద్ మఠ్” అనే బెంగాలీ గ్రంథంలో, స్వర్గీయ బంకిమ్ చంద్ర చటర్జీ గారు వ్రాసిన “వందే మాతరం” అనే గీతం ఒక మహోత్తుంగ తరంగమై, ఉద్ధృత ఉద్యమమై, ఉవ్వెత్తున లేచిన ప్రవాహగీతమై, ప్రజలందరిలోనూ దేశభక్తిని మేల్కొలిపింది. భారత్ లోని ‘స్వ’ అనేది దేశభక్తుల శంఖారావమై, ఆంగ్లేయులు తమ బెంగాల్ విభజన ప్రతిపాదనను వెనక్కి తీసుకునేటట్లు చేసింది. శ్రీ అవనీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతమాతను ఒక యోగినిగా అభివర్ణించారు.

1905 నుండి 1910/11 వరకూ, శ్రీ అరవిందులు రాజకీయాలలో చాలా చురుకుగా ఉన్నారు. ఆ రోజులలో, ప్రజలను మతం ప్రాతిపదికగా వేరుచేసే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా, ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నది. ఈ విభజన వెనుక ఆంగ్లేయుల కుతంత్రం దాగి ఉంది, వాళ్ళు భారత్‌ను ఒక ప్రయోగశాలగా మార్చివేశారు. కానీ, భారతదేశం యావత్తూ, బెంగాల్ విభజనకు విరుద్ధంగా తన తీవ్ర ప్రతిస్పందనను తెలియజేసింది. ప్రముఖ తమిళకవి సుబ్రహ్మణ్య భారతి, కలకత్తా కాళీమాత పాదపద్మాలను దర్శించి, అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. “భారతమాత వామహస్త ఖండన జరగకూడదు, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయటం మనందరి కర్తవ్యం”, అని వారు ఉద్బోధించారు. చివరికి, ఈ బెంగాల్ విభజన విషయంలో, భారతీయులందరూ ముందుకు రావటం వలన, భారత్ విజయం సాధించింది. ఇక్కడ ‘స్వ’ అనేదే ప్రధానమైన స్ఫూర్తి.

ఇటువంటి భారతదేశ అఖండ విజయాన్ని, మన పిల్లలచేత చదివించాలి. రవీంద్రనాథ ఠాగూర్ గారు భారతమాత చిత్రపటాన్ని గీశారు. ఇది ఇంగ్లండ్/బ్రిటన్‌కు వ్యతిరేకంగా చేసిన ఆధ్యాత్మిక పోరాటం, అందుకే మనం విజయం సాధించాము.

చాలాకాలం యోగి అరవిందుల బోధనలు, ఇతర చారిత్రక ఘటనలు విన్న తర్వాత కూడా, భారతమాతను విభజించేందుకు మనం అంగీకరించాము. మనం, మనలనే ఈ క్రింది విషయాలు అడగాలి:

“వందే మాతరం” నినాదానికి ఏమయ్యింది?

“భరతమాత మందిరం” ఆదర్శం ఏమయ్యింది?

“ప్రతి గ్రామంలో గుడి” వాగ్దానం ఏమయ్యింది?

“నేతాజీ” స్ఫూర్తి ఏమయ్యింది?

దురదృష్టవశాత్తూ, 1912 తర్వాత, మన దేశ స్వాతంత్ర్యోద్యమ సమయంలో మన జాతీయ నేతలు కొందరు సోషలిజం, కమ్యూనిజం వంటి పాశ్చాత్యదేశాల వామపక్ష సిద్ధాంతాల పట్ల మొగ్గు చూపటం వలన, ఈ వందేమాతర జాతీయ ఉద్యమ స్ఫూర్తి, 1920-30ల నడుమ నీరుగారి పోయింది. 1923 కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో, మనదేశ నాయకత్వం, పాశ్చాత్య ధృవీకరణను కోరుకున్నది. ఇంకా వందేమాతరం గీతం పూర్తిగా గానాలాపన చేసేందుకు కూడా అనుమతించలేదు.

వాస్తవానికి, సోవియట్ రష్యా దేశమొక్కటే, తన స్వంతపంథాలో ముందుకు పోయింది తప్ప, పాశ్చాత్యదేశాల ధృవీకరణ అవసరం, వాళ్ళకు రాలేదు. మనదేశం సార్వభౌమత్వాన్ని కలిగి ఉండాలి అనుకుంటే, మనం ‘స్వతంత్రత’ ఆధారిత సూత్రంతో జీవించాలి, కానీ కేవలం “భారత్ మాతా కీ జై” అనే నినాదం ఒక్కటే సరిపోదు.

మనస్సు ఒకవేళ శూన్యం అయితే, అది చెత్తతో నిండింది అని చెప్తూ ఉంటారు. మనం స్వాతంత్ర్యానంతరం కూడా, సంపూర్ణమైన స్వతంత్రం లేకపోవటం వలన, గట్టిగా పోరాటం చేయలేకపోతున్నాము. మనం చరిత్రను సరైన విధానంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే అది ప్రత్యేకంగా ఎంపిక చేయబడింది కాబట్టి. మనం భారతీయ స్వాతంత్ర్యసమరం గురించి సరిగ్గా తెలుసుకోవాలి అనుకుంటే, మనకు ఇప్పటివరకూ ఎరుగని, అజ్ఞాత స్వాతంత్ర్య సమరయోధుల గురించి కూడా తెలుసుకోవటం అవసరం. మనం ఇటీవల స్మరించిన అల్లూరి సీతారామరాజు, రాణి వేలు నాచ్చియార్ వంటి నిజమైన స్వాతంత్ర్యయోధులు, ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం చేయబడి, ప్రక్కన పెట్టబడ్డారు. అటువంటి వారందరి త్యాగాల ఫలాలే, నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యానంతర సుఖమయ జీవితాలు. ప్రస్తుతం నిర్వహించబడుతున్న “75-ఏళ్ల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” ఇటువంటి నిజమైన అజ్ఞాత స్వాతంత్ర్యయోధులకు నివాళులు అర్పించేందుకు ఒక సువర్ణావకాశం. శ్రీ అరవిందుల ఉత్తరపాద ఉపన్యాసం, మన దేశ ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం, జాతీయవాద భావోద్వేగానికి, నిలువుటద్దంలా దర్శనమిస్తుంది. వారు సనాతన ధర్మమే మన జాతీయత అని ప్రకటించారు.

భారతీయుల ప్రజాస్వామ్యం, చాలా విభిన్నమైనది, అది ఆధ్యాత్మికం. ప్రస్తుతం రకరకాల కథనాల పర్వం జరుగుతూ ఉన్నది, అందుచేత జాతీయత మరియు భారతీయత అనే పదాలు ఉపయోగించేటప్పుడు, కొన్ని పరిమితులు ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఒక పదం చివరలో ‘…ఇజమ్’ అని వాడతామో, తర్వాత ఇంకేమీ కలిపేందుకు అవకాశం ఉండదు. కానీ, భారతీయత, ప్రకాశం, జ్ఞానం అనేవి కలపవచ్చు.

యోగి అరవిందులు –‘అంతర్వలనము (involution -అవయవములు ముడుచుకొనుట) లేకుండా, పరిణామం (evolution)సాధ్యం కాదు.’ అని చెప్తూ,‘సూపర్ మైండ్’ (మనిషి ఆలోచనలకు బాధ్యత ఉండే భాగం)ని కూడా నిర్వచించారు.

పూనాలో జరిగిన ఇక సదస్సులో, ఒక మార్గదర్శక గ్రంథం ఉన్నది, చరిత్ర, విజ్ఞానం పట్ల ప్రతివారూ ఒక దృష్టికోణం, విధానం ఏమిటీ, అనేది సూచించమని అడిగారు. కానీ, గ్రీకు చరిత్రయే సరైనది, అని అక్కడ చెప్పబడింది.

దురదృష్టవశాత్తూ, మన వైజ్ఞానిక సంస్థలు, భారతీయుల ‘5-మూలకాల సిద్ధాంతం’ కాకుండా, ‘గ్రీకుల 4-మూలకాల సిద్ధాంతం’ను అనుసరిస్తున్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఎంత నిరక్షరాస్యులైన వారు కూడా, వారి దినచర్య ప్రారంభించే ముందు, కొన్ని శ్లోకాలను తప్పకుండా పఠిస్తారు. ప్రాచీనకాలంలో విశ్వమంతటిలోని ‘వైజ్ఞానిక పురోగతి’ కి , భారతదేశమే కేంద్రంగా ఉండేది. ఇంకా, శ్రీ అరవిందులు ఏమన్నారంటే – భారతీయ సమాజంలో బ్రాహ్మణులు, తెలివితేటలలో, జ్ఞానంలో ఉన్నత వర్గానికి చెందినప్పటికీ, భారత్ ఎప్పుడూ కూడా, పాశ్చాత్యదేశాల మాదిరిగా, మతరాజ్యం వైపు పతనం కాలేదు. బ్రాహ్మణుల కంటే, క్షత్రియు రాజుల కంటే పైభాగాన, సమాజంలో అన్ని వర్గాలకీ చెందిన ఋషులు, మునులు ఉండేవారన్నది విశేషం. రాజులు, తమ సలహామండలుల సహాయంతోనే రాజ్యపాలన గావించేవారు. రాజులకు సంపూర్ణ అధికారాలు ఎప్పుడూ లేవు. రాజులకూ, సమాజంలో అందరికీ సమానమైన న్యాయం, ధర్మమే ఆధారమైన మూలసూత్ర జీవనవిధానం అమలులో ఉండేది. వ్యక్తిగతం కాని, స్వార్థం లేని, సార్వభౌమ, పవిత్ర అధికారమే ఎల్లప్పుడూ ధర్మముగా భాసిల్లేది. భారతీయ సంస్కృతి విమర్శకులు మాత్రం, భారతీయ ప్రాచీనతత్వాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు, కానీ, భారత్ తన సమగ్రమైన విజ్ఞానశాస్త్రాలలో, కళలలో, తత్వశాస్త్రంలో ఎప్పుడూ మహోన్నతంగానే ఉండేది. ఈ రోజున చాలా దేశాలు, ఆధ్యాత్మిక, విద్యా, వైద్య, వైజ్ఞానిక రంగాలలో మార్గదర్శనం కోసం, భారత్ వైపు చూస్తున్నాయి, అనేది వాస్తవం.

ప్రజాస్వామ్యం మరియు ప్రాచీన చరిత్రల నిర్వహణ, పాశ్చాత్య ధృవీకరణ ఆధారంగా చేయాలనే వాదన సరైనది కాదు. ఇంకా చెప్పాలంటే, ఇప్పటి ఆధునిక భారత్‌లో లభించే ప్రతీవిషయం వాళ్ళ చలవే, అని పాశ్చాత్యులను పొగడిన ఒక ప్రముఖ పండితుడు దీనికోసం సత్కరించబడ్డాడు. ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే, శ్రీ అరవిందులు చెప్పినట్లు, మన ప్రాచీన చరిత్ర గురించిన సమగ్రమైన జ్ఞానం లోపించటమే, సరైనఅవగాహన లేకపోవటమే.

భారతీయ రాజకీయానికి, ‘సనాతన ధర్మం’ మూలాధారం. శ్రీ అరవిందుల సూచన ప్రకారం, మనం ఏ కళ, ఏ శైలి పాటించినప్పటికీ, అది సరస్వతీ మాత అభివ్యక్తీకరణమే, అనుగ్రహమే అవుతుంది. ప్రస్తుతం జరిగే వక్రీకరణ వలన మానవసంబంధమైన ఆధ్యాత్మిక పరిణామం, ఆలస్యమౌతున్నది.

1947లో భారతదేశాన్ని ఖండాలుగా విభజించటం, త్రికాలదర్శి మహర్షి అరవిందులు, ముందుగానే పసిగట్టి, హెచ్చరించారు కూడా. అయితే, వారు, భారతదేశ భూభాగాలన్నీ తిరిగి ఐక్యమవుతాయని, ఆశాభావం వ్యక్తం చేశారు.

ఐక్యభారత్ అనే పేరుపెట్టిన స్వప్నంలో, యోగి అరవిందులు వర్ణించినట్లు, భారదేశాన్ని మనం స్వతంత్రం చేయాలంటే, ఇది ఆసియా వైపు, విశ్వం వైపు  దూసుకెళ్లాలంటే, ముందు మనం అంతర్గతంగా ఐక్యంగా ఉండాలి, ఇదీ కావలసిన ప్రాథమిక అర్హత, అవసరం. అఖండ భారత్ అనేది జరిగి తీరుతుంది, కానీ మనం ఐకమత్యంగా లేకపోతే ఇది సాధ్యం కావటం కష్టం. విభజన, భాగాలు చేయటం అనేది ఉండకూడదు. ఆధ్యాత్మిక చైతన్యమే ప్రాధాన్యతాంశం కావాలి. శ్రీ అరవిందుల అనుచరులందరూ, వారి ధ్యేయాన్ని, నిరంతరం స్మరించుకుంటూనే ఉండాలి.

అనువాదం: సత్యనారాయణ మూర్తి