Home News ఐఐటీ కాన్పూర్‌ వెబ్‌సైట్‌లో హిందూ గ్రంథాలు ( టెక్ట్స్‌, ఆడియో)

ఐఐటీ కాన్పూర్‌ వెబ్‌సైట్‌లో హిందూ గ్రంథాలు ( టెక్ట్స్‌, ఆడియో)

0
SHARE

-టెక్ట్స్‌, ఆడియో రూపంలో వేదాలు, ఉపనిషత్తులు

ప్రాచీనతకు ఆధునికతను జోడిస్తే ఎలా ఉంటుంది? సనాతన ధర్మం-సాంకేతికత కలిసి నడిస్తే ఎలా ఉంటుంది? అచ్చం కాన్పూర్‌ ఐఐటీలా ఉంటుంది! టెక్నాలజీ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఈ ఐఐటి..ప్రాచీన గ్రంథాలకు డిజిటల్‌ రూపం ఇచ్చి.. తమ వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచింది. అదే గీతా సూపర్‌సైట్‌!

ఐఐటీ కాన్పూర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.gitasupersite.iitk.ac.in/) వాల్మీకి రామాయణాన్ని చదవొచ్చు. సుందరకాండను వీనులవిందుగా వినవచ్చు. భావంతోసహా భగవద్గీతను అర్థం చేసుకునే భాగ్యాన్నీ పొందవచ్చు. ఇంకా బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల్లోని మూలమంత్రాలు, యోగ విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అంత ఓపిక లేకపోతే చక్కగా వినవచ్చు. ప్రాచీన హిందూ గ్రంథాల్లోని ధర్మసూక్ష్మాలను ‘గీతా సూపర్‌సైట్‌’ పేరుతో..తెలుగుసహా 11 భారతీయ భాషల్లో కాన్పూర్‌ ఐఐటీ అందిస్తోంది. వేద విజ్ఞానాన్ని, వేదాంతాన్ని సులువుగా అందరూ అర్థం చేసుకునే రీతిలో.. హిందూ పవిత్ర గ్రంథాల డిజిటలీకరణ చేపట్టి..ఈ సేవలు అందిస్తున్న తొలి ఇంజనీరింగ్‌ కాలేజ్‌గా నిలిచింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఈ ప్రాజెక్టు కోసం నిధులు అందించింది. కాన్పూర్‌ ఐఐటీలో వాజ్‌పేయ్‌ హయాంలో మొదలైన ఈ బృహత్‌ కార్యక్రమం తాజాగా పూర్తి రూపం దాల్చింది.

అయితే ఐఐటీ మతపరమైన గ్రంథాలకు టెక్ట్స్‌, ఆడియో సేవలు అందించడంపై అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే జ్ఞానాన్ని పంచే ఈ పవిత్రమైన కార్యాన్ని మతం కోణంలో చూడకూడదంటున్నారు ఐఐటీ కాన్పూర్‌ డైరెక్టర్‌ మహేంద్ర అగర్వాల్‌! సంస్కృతంలోని ప్రాచీన గ్రంథాలను అనువదించడానికి స్వామి బ్రహ్మానందతో పాటు బెనారస్‌ హిందూ యూనివర్సిటీ సేవలు తీసుకున్నారు. అన్నట్టు హిందూ గ్రంథాల కోసం ‘గీతా సూపర్‌సైట్‌’ సేవలు ప్రారంభించినప్పటి నుంచీ కాన్పూర్‌ ఐఐటీ వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌ పెరిగింది. గత కొద్ది నెలలుగా ఆన్‌లైన్‌ రీడర్స్‌ విపరీతంగా పెరిగారు. గతంలో సగటున 500 హిట్స్‌ నమోదైతే.. తాజాగా రోజుకు 24 వేల హిట్స్‌ రిజిస్టర్‌ అవుతున్నాయని ఐఐటీ కాన్పూర్‌ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.