- మన చరిత్ర గురించి తెలుసుకోవాలి
- సోషల్ మీడియా ద్వారా జాతీయ భావజాల వ్యాప్తి జరగాలి
- కరినగర్ విభాగ్ సోషల్ మీడియా సంగమంలో వక్తల పిలుపు
సమాచార భారతి కరినగర్ ఆధర్వర్యంలో సోషల్ మీడియా సంగమం రెండవ ఎడిషన్ కరినగర్‌లోని ఆల్పోర్స్ జూనియర్ కాలేజీలో ఏప్రిల్ 7 శుక్రవారం రోజున జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ ప్రాంత సంఘచాలకులు శ్రీ దక్షిణామూర్తి గారు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ సురేష్ కొచ్చటిల్ గారు, రిథమ్ తెలుగు ఎడిటర్ కుంటి సురేందర్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి గారు మాట్లాడుతూ భారతీయులుగా, హిందువులుగా మన చరిత్ర గురించి తెలుసుకోవాలన్నారు. మన దేశ ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహరాల వల్ల కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తక్కువ నష్టంతో మనం బయటపడగలిగామని తెలిపారు. అపారమైన విజ్ఞానం మన దేశంలో ఉందని, మన సంస్కృతి సైన్సుతో అనుసంధానమైనదని, కానీ కొంత మంది దేశ వ్యతిరేకులు మన స్వాభిమానంపై దెబ్బతీసి మన సంస్కృతి, సాంప్రదాయాలపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని అటువంటి వాటిని మనం తిప్పికొట్టాలని తెలిపారు. అందుకు ముందుగా మన దేశం గురించి, సంస్కృతి గురించి తెలుసుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచంలోని అన్ని రంగాలలో భారత్ ముందుగు సాగుతోందన్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక కథనాల్ని తిప్పికొట్టి.. వాస్తవ కథనాన్నిప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సినిమారంగంలో కూడా సంస్కృతిని, కుటుంబ వ్యవస్థను కించ పరిచే సినిమాలు వస్తున్నాయని వాటిని వ్యతిరేకించాలన్నారు. రాబోయే రోజుల్లో భారత్‌ను ప్రపంచ గురువుగా గుర్తించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఉద్బోదించారు.
అనంతరం కుంటి సురేందర్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా అవశ్యకతను వివరించారు. ప్రస్తుత సమయంలో సమాచార యుద్ధం జరుగుతోందని దాన్ని మనం సరైన పద్ధతిలో ఎదుర్కొవాలన్నారు. నాగరికత, మానవ విలువలు, లింగపరమైన, భాష, ఆచారాలు, ప్రకృతి, పర్యావరణం, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ వంటి వాటి ఆధారంగా అనేక వర్గాలుగా మనల్ని విభజించి దేశంపై, సంస్కృతిపై తప్పుడూ కథనాలను సృష్టిస్తున్నారని, వాటిని మనమందరమూ తిప్పికొట్టాలన్నారు. ఇందుకోసం ముందుగా మనం సోషల్ మీడియాపై సరైన అవగాహన పెంచుకోవాలని సూచించారు. వాస్తవ కథనాల్ని సరైన పద్ధతిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలన్నారు. మన చరిత్రపై జరిగిన దాడులను ఎత్తి చూపాలన్నారు. మన అస్తిత్వాన్ని ప్రశ్నించే వారికి సరైన సమాధానమివ్వాలన్నారు. ఒక అంశాన్ని వీడియో, ఆడియో, పోస్టర్, వార్త రూపంలో ప్రచారం చేసి ఎక్కువ మందికి చేరేలా చేయాలన్నారు. విషయాల్ని పరిజ్ఞానం, సరైన మూలాల నుంచి విషయాల్ని సేకరించి వాటిని ప్రచారం చేయాలన్నారు. అలాగే ప్రతీ విషయాన్ని నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని సూచించారు.
సీనియర్ జర్నలిస్ సురేష్ కొచ్చటిల్ గారు మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ గురించి సవివరంగా చెప్పారు. కరోనా వంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న గొప్ప ఆలోచన ఆత్మనిర్భర్ భారత్ వల్ల నేడు మన దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని తెలిపారు. ముఖ్యంగా రక్షణా, సైనిక రంగాలలో భారత్ పెట్టుబడులు, ఆయుధాల తయారీ అధికంగా పెరిగాయన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసి అత్యధికంగా వ్యాక్సినేషన్ జరిగిన దేశంగా భారత్ నిలిచిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లాంటి పథకాలను ప్రోత్సహించి ప్రపంచంలో భారత్ ను అగ్రస్థానంలో నిలిపేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ కరినగర్ జిల్లా సహా సంఘచాలకులు ఎలగందుల సత్యనారాయణ గారు, నిర్వహకులు తడిగొప్పుల శంకరయ్య, కట్ట వేణుగోపాల్, రాజ్ కుమార్, సాయికిరణ్, విమల్ కుమార్, అనిల్ కుమార్, సుధా వైష్ణవి, సునీత తదితరులు పాల్గొన్నారు.