కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించమంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించడంతో భారత విదేశాంగ శాఖ వీటిని తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విటర్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్‌ను కోరలేదని స్పష్టం చేశారు.
అమెరికాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అనంతరం జరిగిన ఉమ్మడి మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. “రెండు వారాల క్రితం మోదీతో సమావేశమైనప్పుడు కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఆయన నన్ను కోరారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కావాలని భారత్, పాక్‌లు కోరుకుంటున్నాయి. ఈ విషయంలో ఇరు దేశాలు కోరితే తన వంతుగా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను” అని పేర్కొన్నారు. అక్కడే ఉన్న ఇమ్రాన్ ఖాన్ ట్రంప్ ప్రతిపాదనను స్వాగతించారు. ట్రంప్ మధ్యవర్తిత్వం తమకు ఇష్టమేనని ఆయన తెలిపారు.
అయితే రవీశ్ కుమార్ స్పందిస్తూ.. ‘కశ్మీర్ సమస్యపై భారత్, పాక్‌లు కోరితే మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ చేసిన వ్యాఖ్యాలను చూశాం. కానీ ప్రధాని మోదీ అలా ఎప్పుడూ ట్రంప్‌ను కోరలేదు. కశ్మీర్ అనేది భారత్‌కు సుస్థిరమైన స్థానం. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలపై కేవలం ద్వైపాక్షికంగానే చర్చలు జరుపుతాం’ అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్లీ జేమ్స్ షెర్మాన్ ఈ వ్యవహారంపై స్పందించారు. కాశ్మీర్ విషయంలో తమ దేశ అధ్యక్షుడు చేసినవి అసత్య, అపరిపక్వ వ్యాఖ్యలుగా పేర్కొన్నారు.
అంతేకాకుండా.. దక్షిణాసియా వ్యవహారాలపై కనీస పరిజ్ఞానం ఉన్నవారెవరికైనా సరే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈవిధమైన వ్యాఖ్యలు చేయరనే విషయం స్పష్టంగా తెలుస్తుందని అమెరికా అధ్యక్షుడికి చురకంటించారు. జరిగిన దానికి తన ట్వీట్ ద్వారా అమెరికా తరపున క్షమాపణ తెలియజేశారు.
రెండు దేశాల మధ్య చర్చలు జరపాలంటే ముందుగా సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలకాలని తేల్చి చెప్పారు. షిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ కూడా ఇరు దేశాల మధ్య సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కారించుకోవాలని సూచిస్తున్నాయని గుర్తుచేశారు. కశ్మీర్ సమస్య రెండు దేశాలకు సంబంధించిందని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్ చాన్నాళ్లుగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.