
సంస్కృత భాష తెలియకుండా భారత్ గురించి పూర్తిగా తెలుసుకోవడం సాధ్యంకాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. దేశంలోని అన్నీ భాషలలో, గిరిజన భాషలతో సహా, 30శాతం సంస్కృత పదాలు ఉంటాయని ఆయన అన్నారు. నాగపూర్ లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.
ఈ దేశ పంపర గురించి తెలుసుకోవడానికి ఎంతో అవసరమైన సంస్కృతాన్ని తాను నేర్చుకోలేకపోయానని డా. బి ఆర్ అంబేడ్కర్ విచారించేవారని ఆయన అన్నారు.
భారతీయ భాషలల్లో దేనినైనా మూడు నెలల్లో నేర్చుకోవచ్చని, మొదట్లో నెమ్మదిగా మాట్లాడినా మొత్తానికి ఆ పదాల అర్ధం, వాటి వెనుక భావాన్ని గ్రహించగలగడానికి కారణం సంస్కృత భాషేనని ఆయన అన్నారు.
“సంస్కృతం జ్ఞాన భాష అని, ప్రాచీన ఖగోళ విజ్ఞానం, వ్యవసాయ, ఆయుర్వేద విజ్ఞానం సంస్కృతం ద్వారా తెలుసుకోగలం” అని డా. భాగవత్ అన్నారు. అందుకనే సంస్కృతాన్ని అందరూ నేర్చుకోవాలని, అలా అందరూ నేర్చుకోగలిగిన విధంగా ఆ భాషను బోధించాలని ఆయన సూచించారు.
