తిరువనంతపురం: క్రైస్తవ సన్యాసినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు బిషప్ ఫ్రాంకో ములక్కాల్‌కు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ లభించింది. సన్యాసినిపై అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అరెస్టయిన మూడు వారాల అనంతరం ఫ్రాంకోకు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కింద కోర్టులో బెయిల్ నిరాకరించడంతో ఫ్రాంకో గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు. పాస్‌పోర్ట్‌ను కోర్టులో అందజేయాలని, కేరళలో ప్రవేశించడానికి వీల్లేదని హైకోర్టు షరతులు విధించింది. పోలీసుల తుది నివేదిక పూర్తయ్యే వరకు రెండు వారాల్లో ఒకసారి దర్యాప్తు అధికారి వద్ద రిపోర్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ నెల ఆరంభంలో ఒకసారి కేరళ హైకోర్టు ఫ్రాంకోకు బెయిల్ నిరాకరించింది. ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్ వాదించడంతో కోర్టు అంగీకరించింది. కానీ ఈసారి మాత్రం బెయిల్ ఇచ్చింది. కేరళకు చెందిన ఓ క్రైస్తవ సన్యాసిని ఈ ఏడాది జూన్‌లో ఫ్రాంకో ములక్కాల్‌పై ఫిర్యాదు చేశారు. 2014-2016 కాలంలో ఫ్రాంకో తనపై 13సార్లు అఘాయిత్యాలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. చర్చి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పోలిసులను ఆశ్రయించినట్లు చెప్పారు. బిషప్ ఫ్రాంకో మాత్రం ఈ ఆరోపణలను అవాస్తవమని చెప్తున్నారు.
Source: Eenadu