-డా. పి. భాస్కరయోగి
ఇందిరా హయంలో భింద్రన్వాలేతో అంతమైపోయిందనుకొన్న ‘ఖలిస్తాన్’ ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో ‘భారత్’ ను ఇబ్బంది పెట్టనుందా? అన్నది ఇప్పటి కొత్త చర్చ. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక పట్టపగ్గాలు లేకుండా పోయిన భారత వ్య తిరేక శక్తులు అక్కడ హల్చల్ చేస్తుంటే మరోవైపు విదేశాల్లో వీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఖలిస్తానీల పేరుతో ఈ వారం పదిరోజుల్లో బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీవ్రవాదశక్తులు ‘భారత వ్యతిరేకత’ను ప్రదర్శిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ముగిసిన రైతు ఉద్యమం తర్వాత తొండముందిరి ఊసరవెల్లిగా మారినట్లు అమృత్ పాల్ అనే సరి కొత్త వేషగాడు జర్నైల్ సింగ్ భింద్రన్వా లాగ ప్రవరిస్తున్నాడు. ఇటీవల పంజాబ్ లోని ఓ పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఘటన తర్వాత ఇతను వార్తల్లోకి ఎక్కాడు. తన బంధువుల సహకారంతో అరబ్ దేశాలకు వెళ్లి భారీ వాహనాల డ్రైవర్ గా పనిచేసిన అమృత్ పాల్ ఇటీవల భారత్లో ఖలిస్తానీ ఉద్య మనేతగా కనిపించడం వెనుక ‘బ్రేకింగ్ ఇండియా’ ఫోర్సెస్ పాత్ర ఎంత అనేది పరిశోధించాలి. ఖలిస్తాన్ 2.0 ను విస్తరించేందుకు పోలీసులపై దాడి, ఏడు క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటు న్న అమృత్ పాల్ తనను తాను భింద్రన్వాలే గా ఊహించుకుంటున్నాడు. ‘వారిస్ పంజాబ్ డే’ అన్న సంస్థను నడిపిస్తున్న ఈ యువకుడు ఒక్క సారిగా ఈ నెలలో దేశంలోని అన్ని ఛానళ్లలో మాట్లాడేటంత ప్రాచుర్యం పొందాడు. ఇందిర గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఖలిస్తానీ ఉద్యమాన్ని అణచేందుకు ప్రభుత్వం 1984లో స్వర్ణ దేవాలయంలో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ చేపట్టింది. ఆ చర్యలో భాగంగా భింద్రన్ వాలే అంతమయ్యాడు. ఆ తర్వాతి కాలంలో ప్రధాని ఇందిరను, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ లను ఖలిస్తానీలు హతమార్చారు. ఇప్పుడు ఈ అమృతపాల్ “ఇందిరకు పట్టిన గతే కేంద్ర హోంమంత్రి అమితాకు పడుతుందని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే అతను దొరికినట్టే దొరికి తప్పించుకోవడం ఆ వెనువెంటనే లండన్లోని భారత్ హైకమిషనర్ కార్యాలయంపై త్రివర్ణపతాకం తొలగించి ఖలిస్తానీ పతాకావిష్కరణ చేయడం కొత్త ఆందోళనకు తెరతీస్తున్నది.
ఖలిస్తానీ వేర్పాటుకు బీజం ఎప్పుడు పడింది ?
చరిత్రలోకి వెళితే 1857లో నాటి బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో యావత్ భారతంలోని అన్ని వర్గాలు ప్రజలు పాల్గొన్నారు. ఆ ఉద్యమ సునామీ బ్రిటీషర్ల వెన్నులో వణుకు పుట్టించింది. అంతకుముందు తమకు సునాయాసంగా లొంగిపోయిన ఇక్కడి స్వదేశీ సంస్థానాధీశులు, ప్రజల్లో ప్రాంతాలు, మతాలకతీతంగా ఏర్పడిన ఐకమత్యం చూసి ఖంగుతిన్నారు. అందుకే మన మోకాళ్లను విరవాలనుకున్నారు. ఈసారి శక్తితో కాకుండా యుక్తికి పదునుపెట్టారు. అనుకున్నదే తడవుగా మాక్స్ ఆర్డర్ మెకాలిస్ అనే ఐర్లాండ్ దేశంలో పుట్టిన బ్రిటీష్ తైనాతీని ఆగమేఘాల మీద భారత్ కు రప్పించారు. గురుగోవింద్ సింగ్, రంజిత్ సింగ్, ఫతేసింగ్, జోరావర్ సింగ్, అర్జున్ దేవ్ వంటి సిక్కు గురువుల స్పూర్తితో దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ‘సిక్కు మతస్తులను హిందువుల నుంచి వేరుచేసే కుట్రకు తెరలేపారు. మెకాలిఫ్ ఐర్లాండ్లో పుట్టినా ఆంగ్లేయ మనస్తత్వం జీర్ణించుకున్న తెల్లతోలు గుంట నక్క. అతడు అమృత్ సర్ అడుగు పెట్టి సిక్కుగా మతం మార్చుకున్నాడు. ఆ కాలంలో ఒక ఆంగ్లేయుడు సిక్కుగా మారడం భారత సిక్కులకు ఆశ్చర్యం కలిగించింది. కానీ, అందులోని కుట్రను వారు గ్రహించలేకపోయా రు. మెకాలిఫ్ తన టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ఉపయోగించి భాయ్ కహ్నసింగ్ నాఖా అనే సిక్కును ప్రభావితం చేశాడు. 1897 నాటికి ఈ సిక్కు సూడో మేధావి కలంతో హమ్ హిందూ నహీ అన్నపుస్తకం రాయించాడు. ఆనాడే ఖలిస్తాన్ కు బీజం పడింది. హిందూ ధర్మానికి బాహువుల్లా ఉన్న సిక్కుల్లో ‘మేం వేరు’ అనే భావన కలిగించారు. 1 మే 1905 నాడు అమృత్ సర్ సరోవరం పై ఉన్న హిందూ దేవీదేవతల విగ్రహాలు తొలగించబడ్డాయి. 1901 జనాభా లెక్కల నాటికి 10 లక్షలు ఉన్న సిక్కు జనాభా 1911 జనాభా లెక్కల నాటికి 300 రెట్లు పెరిగింది. అంతకుముందు సిక్కులు తమను హిందువుల్లో అంతర్భాగంగానే భావించే వారు. దీంతో హిందూ-సిక్కుల మధ్య బ్రిటీష్ వాడి పన్నాగం అమలైంది. ఆర్థర్ మెకాలి అన్నంతపనీ. చేసి తనకు అప్పగించిన ఆపరేషన్ పూర్తి చేశాడు. సిక్కుల గురుగ్రంధ సాహెబ్ లో 8346 సార్లు ”హరి’ పేరు. 2533 సార్లు రాముని పేరు. 17 సార్లు వాహే గురు పేరు స్మరింపబడింది. అలాంటి సిక్కులను హిందూ ధర్మం నుంచి వేరుచేసే కుట్ర. మెకాలిఫ్ రూపంలో జరిగింది. ధర్మరక్షణలో వీరులైన సిక్కులను హిందువులను వేరు చేస్తే స్వాతంత్య్రోద్యమం పలచనవుతుందనుకున్న తెల్లవాడి మెదడులో పుట్టిన ఆలోచన ఆచరణలోకి వచ్చింది.
ఆప్ ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఖలిస్తానీలు రైతు చట్టాలను వ్యతిరేకించే పేరుతో రైతుల ముసుగులో ఎర్రకోటపై ఖలిస్తానీ జెండాను ఎగురవేసే ప్రయత్నం చేశారు. మోడీ పర్యటనను పంజాబ్లో అడ్డుకున్న రైతులను నాటి చన్నీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లే ఖలిస్తానీ వేర్పాటు వాదులకు ప్రస్తుత పంజాబ్ సీఎం ఆప్ పార్టీకి చెందిన భగవంత్ మాన్ అలాగే పరోక్ష మద్దతు ఇస్తున్నారని సర్వత్రా వినిపిస్తున్న మాట. గన్ లైసెన్స్ లపై అందరినీ నిర్బంధిస్తున్న పంజాబ్ ప్రభుత్వం వాహాటంగా ఆయుధాలు ధరించి తిరుగుతున్న ఖలిస్తానీలను ఏమీ అనడం లేదని ఇటీవలి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే పంజాబ్లో మిలిటెంట్ ఉద్యమాలు నడిపి జైలులో ఉన్న బంధీసింగ్ను విడిపించేందుకు రోడ్డెక్కేవారిని కూడా ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తోంది. అమృత్ పాల్ అనుచరుడు లవ్ ప్రీత్ సింగ్ ను పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధిస్తే వందలాదిమంది ఖలిస్తానీలు చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. ఈ గొడవ మోడీ, అమిత్ షా లను నిలువరిస్తుందని ‘టుక్డే టుక్డే గ్యాంగ్’లు ఆనందపడుతూ పరోక్షంగా సహకరిస్తున్నారు. దేశంలో ఇప్పటికే ఉన్న సమస్యలు చాలవన్నట్లు జరుగుతున్న ఈ సరికొత్త వేర్పాటువాద ధోరణి దేశానికి మంచిది కాదు తస్మాత్ జాగ్రత్త.