Home Telugu Articles కులమతాల ప్రాతిపదికగా ఓట్లడగటం చట్ట విరుద్ధం

కులమతాల ప్రాతిపదికగా ఓట్లడగటం చట్ట విరుద్ధం

0
SHARE

 

  • ఇది అవినీతి కిందికే వస్తుంది
  • ఎన్నికల ప్రక్రియలో మతానికి తావులేదు
  • వ్యక్తికి, దేవుడికి మధ్య సంబంధం వ్యక్తిగతం
  • ప్రజాప్రతినిధుల పనితీరు లౌకికంగా ఉండాలి
  • సుప్రీంకోర్టు తీర్పు
  • మెజారిటీ తీర్పుతో విభేదించిన ముగ్గురు జడ్జీలు

మతం, కులం, జాతి, వర్గం, భాష ప్రాతిపదికగా ఓట్లేయాలంటూ అడిగే ఏ విజ్ఞప్తి అయినా ఎన్నికల నిబంధనావళి ప్రకారం అవినీతి కిందికే వస్తుందని కోర్టు కుండబద్ధలు కొట్టింది. ఎన్నికల ప్రక్రియను ఇరకాటంలోకి నెట్టేసే ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని తేల్చిచెప్పింది. వ్యక్తికి, దేవుడికి మధ్య సంబంధం వ్యక్తిగత ఇష్టాఇష్టాలతో కూడుకున్నదే కానీ ప్రభుత్వం లేదా పాలకులతో దీనికి సంబంధం లేదని వ్యాఖ్యానించింది. ఎన్నిక అనేది లౌకికపరమైన ప్రక్రియ అని, ఎన్నికైన ప్రజాప్రతినిధుల పనితీరు కూడా లౌకికంగానే ఉండాలంది. ఎన్నికల ప్రక్రియలో మతానికి తావులేదని తేల్చిచెప్పింది.

కుల మతాల్ని అడ్డుపెట్టుకుని ఓట్లడుగుతున్న వారికి ఇది చెంపపెట్టు. రాజకీయాల నుంచి కుల, మతాల్ని వేరుచేసే చరిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు సోమవారం వెలువరించింది.

మతం, కులం, జాతి, వర్గం, భాష ప్రాతిపదికగా ఓట్లేయాలంటూ అడిగే ఏ విజ్ఞప్తి అయినా ఎన్నికల నిబంధనావళి ప్రకారం అవినీతి కిందికే వస్తుందని కోర్టు కుండబద్ధలు కొట్టింది. ఎన్నికల ప్రక్రియను ఇరకాటంలోకి నెట్టేసే ఇలాంటి చర్యలు చట్ట విరుద్ధమని తేల్చిచెప్పింది. వ్యక్తికి, దేవుడికి మధ్య సంబంధం వ్యక్తిగత ఇష్టాఇష్టాలతో కూడుకున్నదే కానీ ప్రభుత్వం లేదా పాలకులతో దీనికి సంబంధం లేదని వ్యాఖ్యానించింది. ఎన్నిక అనేది లౌకికపరమైన ప్రక్రియ అని, ఎన్నికైన ప్రజాప్రతినిధుల పనితీరు కూడా లౌకికంగానే ఉండాలంది. ఎన్నికల ప్రక్రియలో మతానికి తావులేదని తేల్చిచెప్పింది. రాజ్యాంగ నీతిసూత్రాలు, బాధ్యతల్ని నెరవేర్చడంలో ప్రభుత్వం క్రియాశీలంగా ఉండాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌ నేతృత్వంలోని ధర్మాసనం 4:3 మెజారిటీతో సోమవారం ఈ తీర్పు చెప్పింది. మెజారిటీ న్యాయమూర్తుల్లో జస్టిస్‌ ఠాకుర్‌తో పాటు, జస్టిస్‌ ఎంబీ లోకుర్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డె, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావులున్నారు. తీర్పుతో విభేదించిన ముగ్గురు జడ్జిల్లో జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఏకే గోయెల్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లున్నారు.

123(3) సెక్షన్‌ ఏం చెబుతోంది?
అభ్యర్థి లేదా ఆ వ్యక్తి ఎన్నికల ఏజెంటు లేదంటే అభ్యర్థి సమ్మతితో ఏ వ్యక్తి అయినా.. ‘అతని మతం’, కులం, జాతి, వర్గం, భాష ప్రాతిపదికగా ఓటేయాలని లేదా మిన్నకుండాలని కోరినా.. మతపరమైన చిహ్నాల ఆధారంగా విజ్ఞప్తులు చేసినా.. సదరు అభ్యర్థి లేదా మరే అభ్యర్థి జయాపజయాలపై ఈ ప్రభావం కనిపిస్తే మాత్రం అది అవినీతి కిందికే వస్తుంది.

‘అతని’కి విస్తృతార్థం: అవినీతి వ్యవహారాలను నియంత్రించే ప్రజాప్రాతినిధ్య చట్టం(ఆర్‌పీ)లోని 123(3) నిబంధనలో ఉన్న ‘అతని మతం’ అనే మాటకు విస్తృత భాష్యం చెబుతూ… దీనర్థం ఓటర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహా అందరి మతం, కులం కూడా అని మెజారిటీ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాల్ని పరిష్కరించేటపుడు లౌకికవాదాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు.

విభేదించిన ముగ్గురు: అయితే ‘అతని మతం’ అంటే అభ్యర్థి మతం మాత్రమేనంటూ మిగతా ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు. ప్రజల న్యాయబద్ధమైన ఆందోళనలపై మాట్లాడకుండా వ్యక్తుల్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతమని వ్యాఖ్యానించారు. ఓటర్ల సమస్యలపై మాట్లాడటాన్ని, చర్చించడాన్ని ఏ చట్టమూ అడ్డుకోజాలదని.. దీనిని ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లుగా అర్థంచేసుకోకూడదని జస్టిస్‌ చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు గత అక్టోబరు 27వ తేదీన తీర్పును వాయిదావేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 123(3)లో వాడిన ‘అతని’ అనే మాటకు అర్థం అభ్యర్థి మత విశ్వాసం మాత్రమేనని 1995లో తీర్పు చెప్పిన కోర్టు – ఇప్పుడు అందుకు భిన్నంగా స్పందించింది. అభ్యర్థితో పాటు, అతని ఏజెంట్లు, ఓటర్లు… వీరంతా ఈ విస్తృతార్థం కిందికే వస్తారని, వీరిలో ఎవరి మతం పేరుతో ఓట్లడిగినా అది అవినీతేనని కోర్టు తేల్చిచెప్పింది. ‘‘సెక్షన్‌123(3)లోని ‘అతను’ అనే మాట ఓటరు మతం, జాతి, కులం, వర్గం, భాష గురించే చెప్పదు. అభ్యర్థి మతం, కులం, భాష, వర్గం గురించిన ప్రస్తావన ఉంది. ఆ పేరుతో అభ్యర్థి ఓట్లడగటం, మరో అభ్యర్థికి ఓటెయ్యొద్దని చెప్పటమనే భావం ఇందులో ఉంది’’ అని వ్యాఖ్యానించింది. ‘‘సెక్షన్‌ 123లోని ఉప సెక్షన్‌ 3కు విస్తృత భాష్యం చెప్పాల్సిందే. ఏ వ్యక్తి కులం, మతం, వర్గం పేరుతో ఓట్లడిగినా దానిని అవినీతి కిందే పరిగణించాలి’’ అని కోర్టు ఉద్ఘాటించింది. మతాన్ని ఆచరించే, కట్టుబడే స్వేచ్ఛ ప్రతిఒక్కరికీ ఉంటుందని, కానీ దానిని ఎన్నికల ప్రయోజనాలకు వాడుకోవచ్చా? అనేదే ఇక్కడ సమస్య అని మెజారిటీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో మతం, కులాన్ని వినియోగించడాన్ని నిరోధించడానికి ఇప్పటికే చట్టాలు పక్కాగా ఉన్న విషయాన్ని జస్టిస్‌ లోకుర్‌ గుర్తుచేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనకు ప్రయోజనాత్మక భాష్యం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నేడున్న సామాజిక, సాంకేతికాంశాల పరంగా చూస్తే… కేవలం అభ్యర్థి లేదా అతని ప్రత్యర్థి మతం అన్న దానికే పరిమితం కాకుండా విస్తృతార్థంలో దీనికి భాష్యం చెప్పాల్సిన అవసరం ఉందని కోర్టు అంది. లౌకికవాదం అన్నది రాజ్యాంగ మౌలిక స్వరూపం కాబట్టి మతం అన్నది వ్యక్తిగత విషయంగానే చూడాల్సి ఉంటుందని, మతాన్ని ప్రభుత్వ అధికారంతో మిళితం చేయడం కుదరదని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ‘‘ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు, పాటించవచ్చు. రాజ్యం ఎప్పుడూ లౌకికమే కాబట్టి.. ఏ మతం లేదా మతకోణాల్లో అది గుర్తింపుపొందకూడదు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా లౌకికంగానే ఉండాలి’’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

చట్టాన్ని న్యాయవ్యవస్థ తిరగరాయరాదు: ఏ రూపంలోని ప్రభుత్వమూ పక్కాగా ఉండదని, అయినంత మాత్రాన ఈ లోపాలని పరిష్కరించడానికి చట్టాన్ని న్యాయవ్యవస్థ తిరగరాయలేదని న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. న్యాయమూర్తులు, జస్టిస్‌ ఎ.కె.గోయెల్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌తో పాటు తన తరఫున మైనార్టీ తీర్పును ఆయన రాశారు. ‘‘ఏ ప్రభుత్వమూ పక్కాగా ఉండదు. ప్రజాస్వామ్య లోతులు, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య పనితీరు పక్కాగా ఉండకపోవచ్చు. అయినా ఈ లోపాలను.. చట్ట నిబంధనను న్యాయవ్యవస్థ తిరగరాయడం ద్వారా పరిష్కరించలేదు. ఈ కేసుకు సంబంధించి చర్చలో ఉన్న నిబంధనపై పార్లమెంట్‌కు అవగాహన ఉంది. ఇతర పలు నిబంధనల్లో మార్పులు జరిగినా ఈ నిబంధనను ఇప్పటివరకు మార్చలేదు. ఈలోగా ఎన్నికలు విజయవంతంగా జరిగాయి. న్యాయవ్యవస్థ నెలకొల్పిన సంప్రదాయాన్ని కొనసాగించేలా చూడాలి. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123(3)కు గతంలో ఇచ్చిన భాష్యం సరైనదే.’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. అణగారిన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు సామాజిక సమీకరణమనేది శక్తిమంతమైన సాధనమన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి.. మతం, జాతి, కులం, వర్గం లేదా భాష ప్రాతిపదికన అన్యాయానికి గురవుతున్న పౌరుల న్యాయబద్ధమైన ఆందోళనల గురించి మాట్లాడకుండా నిషేధించలేరన్నారు. అలా నిషేధిస్తే ప్రజాస్వామ్యం వూహస్థాయికి పడిపోతుందన్నారు. అభిరామ్‌సింగ్‌ సహా మరికొందరు వ్యక్తులు దాఖలుచేసిన పిటిషన్లపై బెంచ్‌ విచారించింది. ముంబయిలోని శాంతాక్రజ్‌ అసెంబ్లీ సీటు నుంచి 1990లో భాజపా టిక్కెట్టుపై అభిరామ్‌సింగ్‌ గెలుపొందడాన్ని బాంబే హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెక్షన్‌ 123(3)కు భాష్యం చెప్పాల్సిన వ్యవహారం 2014 జనవరి 30న ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్‌ ముందుకు వచ్చినపుడు.. వారు దానిని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించారు.

‘కులం, మతం, జాతిపై ఆధారపడిన రాజకీయాలు దేశానికి హాని చేశాయి. సుప్రీం తీర్పుతో ఓటుబ్యాంకు రాజకీయాలకు అడ్డుకట్ట పడుతుంది. తీర్పును ఉల్లంఘించిన పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేయాలి.’

-వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌.

‘సుప్రీంకోర్టు తీర్పు అద్భుతమైనది. అందరూ దీనిని ఆహ్వానించాలి. దేశ పునాదులు నిర్మితమైన ప్రాథమిక విలువల్ని ఈ తీర్పు బలపరుస్తోంది.’

-మనీష్‌ తివారీ, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి.

‘సుప్రీంకోర్టు తాజా తీర్పు, గతంలో హిందుత్వను ఓ జీవన విధానంగా పేర్కొన్న జస్టిస్‌ జేఎస్‌ వర్మ తీర్పు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. మత ప్రాతిపదికన తాము ఓట్లు అడగడం లేదని కాషాయ పార్టీలు వాదించే ప్రమాదం ఉంది.

-అసదుద్దీన్‌ ఒవైసీ, ఎం.ఐ.ఎం. అధినేత.

‘ఓట్లను-మతాన్ని విడదీయడం సానుకూల పరిణామం. ఎన్నికల్లో లబ్ధికోసం మతాన్నివాడుకోరాదు.’

-డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి.

‘సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల విజయం. మత, వర్గపరమైన అంశాలు రాజకీయాలకు అతీతంగానే ఉండాలి.’

-సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

(ఈనాడు సౌజన్యం తో)