Home News సరస్వతీ నమస్తుభ్యం.. సంచార జాతులకు వందనం..

సరస్వతీ నమస్తుభ్యం.. సంచార జాతులకు వందనం..

0
SHARE

భాగ్యనగరంలో ఘనంగా కుమారి పూజ కార్యక్రమం

హైదరాబాద్ సూర్యనగర్, చిక్కడపల్లిలో సంచార తెగల వీరభద్రీయ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. సంచార తెగల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అక్టోబర్-20 శుక్రవారం రోజున కుమారీ పూజా కార్యక్రమం నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేకంగా సరస్వతి పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా.. సంచార తెగలైన మొండి బండ, బేడ బుడగ జంగం, నక్కల, గంగిరెద్దుల, వీరభద్రీయ (వీరముష్ఠి), ఎరుకల తదితరుల తెగలకు చెందిన దాదాపు 120 బాలికలకు కుమారి పూజ నిర్వహించారు.

మండపం ఆవరణలో బాలికలను సరస్వతి అమ్మవారిగా భావించి.. మొదట వారి కాళ్లను కడిగారు. ఆ తర్వాత కాళ్లకు పసుపు రాశారు. ముఖానికి గంధం పూసి.. పూలతో పూజించారు. ఆ తర్వాత కొత్తబట్టలు సమర్పించారు. చివరగా బాలికలకు హారతి ఇచ్చి.. అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇలా పూజలు అందుకోవడంతో చిన్నారుల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. ఈ పూర్తి కార్యక్రమం ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.

ఈ సంద‌ర్భంగా ONGC రిటైర్డ్ ఉద్యోగి శ్రీ చిట్టి దేవేందర్ రావు గారు ప్రతి కుమారికి కొంతమేర ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా సామాజిక సమరసత తెలంగాణ కన్వినర్ శ్రీ అప్పాలా ప్రసాద్ జి పాల్గొని ప్ర‌సంగించారు. సంచార తెగల తెలంగాణ కన్వీనర్ శ్రీ సువీర్ జి, సంచార తెగల సంక్షేమ సమితి కన్వినర్ శ్రీ సిద్ధ రాఘవేంద్ర, మెంబెర్స్ మిట్టపల్లి చిరంజీవి, చెవ్వ చిత్తరంజన్, పొన్నాల నరసింహ గార్లు, శ్రీ అభయ ఆంజనేయు దేవస్థానం చైర్మన్ పొన్నాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంచార తెగలు.. వాస్తవానికి వారిని ఎవరూ పట్టించుకోరు. పొట్ట కూటి కోసం వారిలో ఉన్న విద్యను ప్రదర్శించి.. కాసిన్ని కాసులు సంపాదించుకుంటారు. అదే వారి జీవితం. మనిషి జీవితానికి ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ వంటివి కూడా వారికి సరిగ్గా అందవు. అలాంటి వారిని కూడా అక్కున చేర్చుకుని.. సాధారణ జనజీవన స్రవంతిలో కలపడమే లక్ష్యంగా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) లోని పలు విభాగాలు కృషి చేస్తున్నాయి.

వాస్తవానికి సంచార జాతులకు చెందిన ప్రజలు మన దేశాన్ని ధర్మాన్ని , సంస్కృతిని కాపాడటం కోసమై దేశ సంచారం చేస్తూ ఉండేవారు. 1857 స్వాతంత్ర్య సంగ్రామంలో ముఖ్యపాత్ర పోషించారు. దీనిని గమనించిన బ్రిటిష్ పాలకులు జాతీయ జీవన స్రవంతి నుంచి వేరు చేయటానికి అనేక కుట్రలను పన్నారు. 1865 క్రిమినల్ యాక్టును తీసుకువచ్చి మన భారీతీయ సంచార జాతుల సమూహాలపై నిర్బంధం అమలు చేశారు. వారిని జన జీవన స్రవంతి నుంచి దూరం చేసారు. దీంతో.. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది సంచార జాతుల జీవనం దుర్భరంగా మారింది. 1952 ఆగస్టు 31న ఆ క్రిమినల్ యాక్టు ఎత్తివేసినప్పటికీ.. సంచార జాతుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం వారి సంక్షేమానికై అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. సాటి భారతీయులుగా మనం అంతా.. సంచార జాతుల సోదరుల అభ్యున్నతికై అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మన దేశంలో సంచార జాతులు చాలా వరకు సంస్కృతి, సంప్రదాయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాయి. మిగతా సమాజం తమను దూరం పెడుతుందనే భావన వారిలో ఉంటూ వస్తోంది. స్థిరమైన నివాసం లేకపోవడంతో.. సమాజ జీవితానికి దూరమవుతున్నారు. ఇక ఇదే సమయంలో ఇలాంటి వారిని మిగతా మతాలకు చెందిన వారు ఆకర్షించడమూ మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా.. సంఘ్ చాలా కార్యక్రమాలు చేస్తోంది. అందులో భాగంగా.. దేవీ నవరాత్రుల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తూ.. బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు.