Home News లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం.. శ్రావణం

లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం.. శ్రావణం

0
SHARE

హిందూ సనాతన సంప్రదాయంలో ప్రతి నెలా ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంది. వాటన్నింటిలోనూ విశేషమైంది శ్రావణ మాసం. ఎక్కడైనా ఒకరోజో లేకపోతే వారమో పండుగలను జరుపుకోవడం చూస్తుంటాం. అయితే శ్రావణమాసంలో ప్రతి రోజూ పండుగే.

ఆ నెలలోని అన్ని తిథుల్లోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో ఇది ఐదవది. పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసమని పేరు.

మహావిష్ణువు జన్మించింది శ్రవణ నక్షత్రంలోనే కనుక దీన్ని విష్ణుమూర్తి జన్మమాసంగా భావిస్తారు. అందుచేతనే శ్రీమహాలక్ష్మికి ఈ మాసమంటే ఎంతో ప్రీతి. శ్రవణం అంటే వినడం అని అర్థం. ఈ నెలలో చేసే పూజలు, నోములను అందుకున్న ఆ జగన్మాత భక్తుల మొరను తప్పక వింటుందని అంటారు. కనుకనే శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

శ్రావణమాసంలో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వ్రతాలు, పూజలు, నోములకు వచ్చే చుట్టాలతో సందడి నెలకొని ఉంటుంది. ముఖ్యంగా మహిళలు పాటించే వ్రతాలన్నీ ఎక్కువగా ఈమాసంలోనే ఉంటాయి. అందుకే ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. దీన్ని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అనీ, వ్రతాల మాసమనీ అంటారు. శ్రావణంలో వచ్చే విశేషమైన పర్వదినాలు శివమూటీల వ్రతం అనగా శ్రావణ సోమవారాలు, మంగళగౌరీ వ్రతం, శనివార వ్రతం, వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీ కృష్ణాష్టమి, కామిక ఏకాదశి, పొలాల అమావాస్య లాంటివన్నీ అందరూ తప్పకుండా జరుపుకుంటారు.

శివమూటీల వ్రతం (శ్రావణ సోమవారాలు)

శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాలలో శివమూటీల వ్రతం ఒకటి. దీన్ని ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంత వాసులు ఆచరిస్తుంటారు. ఈ నెలలో వచ్చే అన్ని సోమవారాలు ఉపవాసం ఉండి శివుడిని, గౌరీదేవిని పూజిస్తారు. కొత్తగా పెళ్లయిన వాళ్లు ఈవ్రతాన్ని తప్పకుండా ఐదేళ్ల పాటూ ఆచరిస్తారు.

శ్రావణ మంగళగౌరీ వ్రతం

శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాలలో మంగళగౌరీ వ్రతం ప్రత్యేకమైంది . ఈ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు మంగళ గౌరీని పూజిస్తారు. పార్వతిదేవికి మరొక పేరు గౌరీ. సమస్త శుభాలను కలిగిస్తుంది కాబట్టి ఆమెను మంగళగౌరీ అని పిలుస్తారు. ఈమాసంలో మంగళగౌరిని ఆరాధించడం పరిపాటి. సాధారణంగా కొత్తగా పెళ్లయిన ముత్తైదువలు మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. పదహారు రకాల పత్ర పుష్పాదులతో, పదహారు రకాల నైవేద్యాలతో, పదహారు రకాల జ్యోతులతో అమ్మవారికి షోడశోపచార పూజని నిర్వహించి కథ చెప్పుకుని అక్షతలు వేసుకుంటారు. ఆ తర్వాత, ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలాదులతో సత్కరిస్తారు. ఇలా ఐదు సంవత్సరాల పాటు వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం చాలా చోట్లా ఉంది.

వరలక్ష్మీ వ్రతం

శ్రావణ మాసంలో మహిళలకు అతి ప్రధానమైంది వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతం కోసం ఒక నెల ముందు నుంచే మహిళలు సన్నాహాలు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. పూర్వం గౌరీ దేవికి శివుడు చెప్పిన వ్రతాన్ని సూతమహర్షి శౌనకాది మహామునులకు వివరించాడు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి దారిద్ర బాధలు పోయి, సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం. సాధారణంగా రాఖీ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కుదరని పక్షాణ ఆ నెలలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా జరుపుకుంటారు. ఆ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీలను పూజించిన ఫలం సిద్ధిస్తుందని నమ్మకం. అందుకే ఈ వ్రతంలో కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా పాల్గొంటారు. వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, విద్య, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.

నాగపంచమి

దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి మాదిరి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో, మహారాష్ట్ర సరిహద్దుల ప్రజలు శ్రావణంలో వచ్చే పంచమిని నాగుల పంచమిగా, పండుగలా జరుపుకుంటారు. మహిళలు రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కూడా ఎంతో విశేషమైందీ రోజు.

శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి

శ్రావణ మాసంలో శుద్ధ పక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి, పవిత్రోపన ఏకాదశి అంటారు. వివాహమై సంతానం లేక బాధపడే జంట ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీహరిని విష్ణు సహస్రనామాలతో అర్చించినట్లయితే తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం. ఏకాదశినాడు ఉపవాసం ఉండి ద్వాదశినాడు పారాయణం చేస్తారు. అందుకే దీనిని పుత్రదా ఏకాదశి అని అంటారు.

కృష్ణపక్ష అమావాస్య – పొలాల అమావాస్య

శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్ష అమావాస్యను పొలాల అమావాస్య అని కూడా అంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాలు దీన్ని ఆచరించాలని చెబుతుంటారు. కాలక్రమేణా పొలాల అమావాస్య పేరు కాస్తా, పోలేరు అమావాస్యగా మారి, పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందిందని పెద్దలు అంటారు. ఇది ఆచరించడంవల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని నమ్మకం.

–  సంతోషి దహగాం

జాగృతి సౌజ‌న్యంతో…