Home News కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలేశారు, చీకటి బతుకుల్లో వెలుగులు నింపారు!

కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలేశారు, చీకటి బతుకుల్లో వెలుగులు నింపారు!

0
SHARE

‘సామాజిక చైతన్యం ఉంటే చాలు విజయాలు సాధించవచ్చు’ అనే విషయాన్ని ఆ ఇద్దరు యువకులు మరోసారి నిరూపించారు. అంధకారంలో ఉన్న గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

భారతదేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం లభించిందని ఇటీవలి నివేదిక తెలుపుతోంది. కాని అనేక ఇళ్ళకు ఇంకా విద్యుత్‌ సౌకర్యం రావాల్సి ఉంది.

ఈ పరిస్థితులను చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? కొందరు ‘అయ్యో.. పాపం’ అని ఆవేదన చెందుతారు. మరికొందరు ‘దేశంలో ఇప్పటికీ గ్రామాలు ఉన్నాయా?’ అని జాలి పడతారు. కాని ఆ ఇద్దరు యువకులు అలా చేయలేదు. ఎలాగైనా సరే ఆ చీకటి బతుకుల్లో వెలుగులు నింపాలనుకున్నారు. అందుకోసం కార్పోరేట్‌ ఉద్యోగాలను సైతం తృణప్రాయంగా వదిలేశారు. ఆ ఇద్దరి గురించి మనం తెలుసుకుందాం.

నితిన్‌సైనీ, రాహుల్‌ తల్‌రేజా ఇద్దరూ ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. చదవు అయిపోయిన తర్వాత చెరో కార్పొరేట్‌ కంపనీలో ఉద్యోగాల్లో చేరిపోయారు.

అయిదంకెల జీతం, సుఖమైన జీవనం… ఇవేవీ వారిని సంతృప్తిపరచలేదు. తమ చుట్టుపక్కల గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను మరిచిపోలేక పోయారు. విద్యుత్‌ లేక ప్రజలు పడే బాధలను చూసి చలించిపోయారు. ఈ విషయాల గురించి తరచూ చర్చించుకునేవారు కూడా. అలా పుట్టిన ఆలోచనే ‘ఫ్రీ స్పిరిట్స్‌ గ్రీన్‌ల్యాబ్స్‌’.

రాహుల్‌, నితిన్‌లు కలిసి 2016లో ‘ఫ్రీ స్పిరిట్స్‌ గ్రీన్‌ల్యాబ్స్‌’ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రోజుకు కనీసం 8 గంటల పాటు విద్యుత్‌ను అందించడానికి సోలార్‌ మైక్రో గ్రిడ్లను ఏర్పాటు చేశారు.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మహారాజ్‌ గంజ్‌లోని మజూరినాకా గ్రామంలో కూడా వీరు సోలార్‌ గ్రిడ్లను ఏర్పాటుచేసి విద్యుత్తును అందించడం ప్రారంభించారు.

ఆ రోజుల్లో నాసాలో సీనియర్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డా|| కిషన్‌ కుమార్‌ ఢిల్లీ ఇంజనీరింగ్‌ కాలేజీకి విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వస్తుండేవారు. నితిన్‌ ఆలోచనలను కిషన్‌ ప్రోత్సహించి సూచనలు, సలహాలిచ్చేవారు.

ప్రారంభంలో నితిన్‌ తన పరిశోధనలు చిన్న చిన్న వస్తువుల రూపంలో ప్రారంభించాడు. సోలార్‌ శక్తితో పనిచేసే మొబైల్‌ చార్జర్లను తయారుచేసి విద్యుత్‌ సరఫరా లేని గ్రామాల ప్రజలకు అందిం చాడు. దాంతో ఆ గ్రామాల ప్రజలు సంతోషించారు.

గ్రామాలకు సోలార్‌ విద్యుత్‌ను అందించడానికి నితిన్‌, రాహుల్‌ ఎన్నో ఎన్జీఓలను సంప్రదించడమే కాకుండా వారి సహాయాన్ని కూడా తీసుకున్నారు. సోలార్‌ విద్యుత్‌ పరికరాల ఉత్పత్తికి పలు ఇంజనీరింగ్‌ కళాశాలలను సైతం ప్రోత్సహించారు. ఆయా కళాశాలల్లో ఈ విషయంపై వర్క్‌షాప్‌లు నిర్వహించారు.

గ్రామాలలో సోలార్‌ విద్యుత్‌కు సంబంధించిన పరికరాలను సరైన పద్ధతిలో అమర్చాలి. అయితే ప్రజల్లో వాటి గురించి సరైన అవగాహన లేనందు వలన వాటి నిర్వహణలో అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా ఎదురయ్యేవి.

దాంతో వీరు ప్రజలకు సోలార్‌ విద్యుత్‌ పరికరాల గురించి అవగాహన కల్పించాలని, శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రతి గ్రామం నుండి కొంతమంది యువకులను ఎన్నుకొని వారికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన యువకులు ఆయా గ్రామాలలో సోలార్‌ విద్యుత్‌ పరికరాల నిర్వహణ చూస్తారు. గ్రామీణులకు, సంస్థకు మధ్య సమాచార వితరణకు ఓ వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకున్నారు.

మహారాజ్‌గంజ్‌లోని మజూరినాకా గ్రామంలో ఇంతకుముందు విద్యుత్‌ కొరకు డీజిల్‌ జనరేటర్‌లపై ఆధారపడేవారు. దీనివల్ల ఖర్చు ఎక్కువ అయ్యేది. వాతావరణం కూడా కలుషితం అయ్యేది. సోలార్‌ విద్యుత్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ఖర్చు చాలా తగ్గింది. గ్రామంలోని 300 కుటుంబాలు సోలార్‌ విద్యుత్‌ వల్ల లాభం పొందుతున్నాయి. ‘మిలాప్‌ ఫౌండేషన్‌’ ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయ అందజేస్తోంది.

ఎఫ్‌.ఎస్‌. గ్రీన్‌ ల్యాబ్స్‌ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మరికొన్ని గ్రామాలకూ విస్తరించాలని ఆలోచన చేస్తోంది. ఆ తరువాత మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాజెక్టును అమలుచేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సంస్థ సోలార్‌ నీటి పంపులను రూపొందించే ప్రయత్నమూ చేస్తోంది. ఇది ఫలిస్తే రైతులు మరింత లాభపడతారు.

–   హర్ష

(జాగృతి సౌజన్యం తో)