కరోనా బారిన పడినవారు ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దని, ధైర్యంగా ఉంటే ఎంతటి రోగాన్నైనా సులభంగా జయించవచ్చని క్షేత్ర (కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ) సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ చెబుతున్నారు. లాక్‌డౌన్ 1, 2 సమయాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతోమందిని అక్కున చేర్చుకొని వారి ఆకలిని తీర్చింది సేవాభారతి. అంతేకాదు, కొన్ని వందల మంది వలస కూలీలను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చింది. అలాగే కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కరోనా పోరులో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వరుసలో ఉండి విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. సరైన సమయంలో, సరైన వెద్య సలహాలు అందిస్తూ ఎందరో ప్రాణాలను కాపాడుతున్నది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా క్షేత్ర సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్‌తో జాగృతి ముఖాముఖీ నిర్వహించింది. ఆ వివరాలు పాఠకుల కోసం..
కరోనా నివారణలో సేవాభారతి ప్రస్తుతం ఎటువంటి పాత్రను పోషిస్తున్నది?
అన్‌లాక్ పక్రియ ప్రారంభమైన తర్వాత సామాజిక స్థితిగతుల్లో మార్పు వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు క్షేమంగా భావించారు. అన్‌లాక్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటినుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిత్యం 70 నుంచి 80 వేల మంది కరోనా బారిన పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 25 లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా మా ఇంటికి కూడా వస్తుందనే భయం ప్రతిఒక్కరిలో మొదలైంది. ఈ భయం కరోనా కంటే పెద్ద ప్రమాదం. సమాజంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు లేదా ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు ఎన్‌జిఓలు, ఇతర సేవా సంస్థలు ముందుకు వస్తుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. కరోనా బాధితులకు సేవలందించేందుకు వెళ్లేవారు కూడా ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉన్నది. పైగా ఇదంతా వైద్యంతో ముడిపడిన అంశం. కరోనాను ఎదుర్కోవాలంటే వైద్య అవగాహన (మెడికల్ అవేర్‌నెస్) కల్పించడం ముఖ్యం. సేవాభారతి ప్రస్తుతం ఇదే పనిని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా కరోనాతో బాధపడుతున్న వారితో నేరుగా మాట్లాడే విధానాన్ని సేవాభారతి రూపొందించింది.
ఆ విధానం గురించి వివరిస్తారా?
కరోనా లక్షణాలు కనిపించగానే సేవాభారతి టోల్ ఫ్రీ నంబర్- 040-48210101కి ఎవరైనా సరే కాల్ చేయవచ్చు. లక్షణాలను బట్టి మా డాక్టర్లు వారికి వైద్య సలహా అందిస్తారు. టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వారికి వైద్యుని సలహా మేరకు కిట్‌ను కూడా అందజేస్తాం. ఇది కిట్ వ్యవస్థ. వారు నిరంతరం మా వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ప్రస్తుతం కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు, టెస్ట్ అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు దాదాపు 80 శాతం మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. కేవలం 20 శాతమే ఆసుపత్రిలో చేరుతున్నారు. కాబట్టి హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి వైద్య సలహా తప్పనిసరి. మందులు ఎంత ముఖ్యమో వైద్య సలహా కూడా అంతే ముఖ్యం. సేవాభారతి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబపరుస్తోంది.
సేవాభారతి అందించే కిట్‌లో ఎటువంటి పరికరాలు ఉంటాయి?
సేవాభారతి అందించే ఈ కిట్‌లో ఆక్సిమీటర్, థర్మామీటర్, జ్వరం మాత్రలు, విటమిన్ మాత్రలు, మాస్కులు, గొంతునొప్పి నుంచి ఉపశమనం కలిగించే మాత్రలు, ఆవిరి పట్టేందకు వాడే మాత్రలు ఉంటాయి. రూ. 2500/- విలువ చేసే ఈ కిట్‌ను సేవాభారతి ఉచితంగా అందజేస్తోంది. ఈ కిట్ వల్ల ఉపయోగం ఏమంటే పేషెంట్ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చికిత్స పొందవచ్చు. ఆ తర్వాత, ఒకవేళ వైద్య సలహా అవసరం అయితే ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ మేరకు మా డాక్టర్లు వారితో నేరుగా మాట్లాడి సలహాలు అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోనూ మా కిట్ సెంటర్లు ఉన్నాయి. అయితే ఈ కిట్ అందరికీ అందించరు. వైద్యుడి సలహా మేరకే దీనిని అందిస్తారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 1200 మందికి ఈ కిట్లను అందించాం.
కరోనా బారినపడిన వారికి ప్రభుత్వాలు కూడా కిట్‌లను అందిస్తున్నాయి. అయితే సేవాభారతి అందిస్తున్న కిట్‌లకు, ప్రభుత్వం అందించే వాటికి తేడా ఏమిటి?
కరోనా సోకి హోం కేర్‌లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వాలు కూడా కిట్‌లను అందిస్తున్నాయి. కానీ అవి పూర్తిస్థాయిలో అందడం లేదు. పైగా హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగుల విషయంలో ప్రభుత్వ వైద్యుల నిరంతర పర్యవేక్షణ కూడా ఉండటం లేదని తెలుస్తోంది. సేవాభారతి అందిస్తున్న కిట్‌లో ఉండే అతి ముఖ్యమైన పరికరం ఆక్సిమీటర్. దీని ద్వారా కరోనా బారినపడిన వారు శరీరంలోని ఆక్సిజన్, పల్స్ రేటును ఎప్పటికప్పుడు ఎవరికివారే పరిశీలించుకోవచ్చు. ఆక్సిజన్ రేటు తక్కువగా ఉన్న వారు డాక్టర్ సలహా మేరకు ఆసుపత్రిలో చేరి ప్రాణాలు రక్షించుకుంటున్నారు. ఈ పరికరం ప్రభుత్వం అందించే కిట్‌లో లేదు. దానివల్ల చాలా మంది కరోనా రోగులు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినా కూడా గ్రహించకవపోవడం వల్ల ప్రాణాల మీదకు వస్తోంది.
ఆక్సిమీటర్ ఎలా పని చేస్తుంది?
జ్వరం, గొంతునొప్పి, పొడి దగ్గు, నిద్రలేమి వంటివి కరోనా సాధారణ లక్షణాలు. అయితే కషాయం, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం, రోజుకి రెండు సార్లు ఆవిరి పట్టడం, గోరువెచ్చని ఉప్పు నీటితో రోజుకి రెండు, మూడు సార్లు పుక్కిలించడం వంటి వాటి ద్వారా రోగ నిరోధకశక్తి కాస్త ఎక్కువగా ఉన్న వారు ఈ వైరస్ నుండి త్వరగా బయటపడు తున్నారు. కానీ అనుబంధ రోగాలతో బాధపడుతున్న వారికి ఈ వైరస్ ప్రాణాంతకంగా మారింది. డయాబెటిస్, కిడ్నీ సంబంధిత రోగాలు, హృదయ సంబంధ రోగాలతో బాధపడుతున్న వారిలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. వారిలో ఈ వైరస్ కణాలు ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో చాలా మంది శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులతో మరణిస్తున్నారు. ఒకవేళ కాస్త ముందుగానే ఈ పరిస్థితిని గమనించినా సమయానికి ఆసుపత్రుల్లో బెడ్‌లు దొరకక మరణిస్తున్నారు. ఒకవేళ బెడ్ దొరికినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అయ్యే లక్షల రూపాయల బిల్లులను చూసి భయాందోళనలు చెందుతున్నారు. ఈ భయంతోనే కొందరు రోగులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి శరీరంలో ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్‌ని తెలుసుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చని సేవాభారతి భావించింది. అందుకే మేము అందిస్తున్న కిట్‌లో ఆక్సిమీటర్‌ను కూడా చేర్చాము. దీని ద్వారా కరోనాతో బాధపడుతున్న వారు తమ ఆక్సిజన్ రీడింగ్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ పరికరంలో చేతి వేలు పెట్టడం ద్వారా ఆక్సిజన్ స్థాయిని, పల్స్ రేటును తెలుసుకోవచ్చు. మొదట ఆక్సిజన్ శాతం తెలుసుకున్న వెంటనే ఆరు నిమిషాలు పాటు నడిచి మరలా ఆక్సిజన్ శాతం చూడాలి. ఈ పరీక్ష సమయంలో పల్స్ రేటు 95 పైనే ఉండాలి. ఒకవేళ అంతకంటే తక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ఈ విధంగా ఆక్సిమీటర్ పరికరం ద్వారా ముందుగానే శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్‌ని తెలుసుకుని సరైన సమయంలో ఆసుపత్రుల్లో చేరి ప్రాణాలు రక్షించుకున్నామని చాలా మంది మాకు చెబుతున్నారు.
సేవాభారతి టోల్ ఫ్రీ నంబర్‌లో ఏ సమయాల్లో సంప్రదించవచ్చు?
మా టోల్ ఫ్రీ నంబర్‌కి ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు ఎప్పుడైనా కాల్ చేసి వైద్య సలహా పొందవచ్చు. వైద్య సలహా కోసం నిత్యం వేల సంఖ్యలో మా కాల్ సెంటర్‌కు ఫోన్లు వస్తున్నాయి. అంతేకాదు కరోనా రోగులకు సంబంధించి సేవా భారతి డిజిటల్ హెల్త్ రికార్డును కూడా నిర్వహి స్తోంది. దీనిలోని ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా కరోనా రోగులు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు.
ఈ కార్యక్రమంలో ఎంతమంది కార్యకర్తలు భాగస్వాములయ్యారు?
రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవాభారతి ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. 25 మంది పూర్తి స్థాయి ఉద్యోగులుగా మా కాల్ సెంటర్‌లో 24/7 విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 100 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. 60 మంది వైద్యులు సేవాభారతి ఆధ్వర్యంలో విశేష సేవలందిస్తున్నారు. ఇప్పటి వరకు 2503 మంది కరోనాతో బాధపడుతున్న వారు మా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో ఒక్క హైదరాబాద్‌లోనే 753 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదు చేసుకున్న వారి సంఖ్య 1800. వీరి కుటుంబ సభ్యులకు కూడా సేవాభారతి ఆధ్వర్యంలో టెస్టులు నిర్వహించాం. ఆసుపత్రికి వెళ్లకుండా హోం క్వారంటైన్‌లోనే కోలుకున్న వారి సంఖ్య 820. అంతేకాదు, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమున్న వారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న బెడ్‌ల సమాచారాన్ని కూడా అందిస్తున్నాం. దీని ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఆసుపత్రుల్ని ఎంచుకునే వీలు వారికి కలుగుతోంది. అంతేకాదు ఆసుపత్రుల్లో చేరిన వారి సమాచారం కూడా ఎప్పటికప్పుడు తెలుసు కుంటున్నాం. ఆంధప్రదేశ్‌లో కూడా ఈ మధ్యనే మా కాల్ సెంటర్‌ను ప్రారంభించాము.
కరోనా రోగుల్లో ధైర్యాన్ని నింపేందుకు సేవాభారతి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది?
కరోనా బారిన పడిన వాళ్లందరినీ ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసి మానసిక వైద్య నిపుణులతో ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ సైకియాట్రిస్టస్ అసోసియేషన్ వైద్యులు సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు ఐదు వందల మందికి కౌన్సిలింగ్ నిర్వహించాం. సేవాభారతి యూ ట్యూబ్ చానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు యోగా క్లాసులు కూడా నిర్వహిస్తున్నాం. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కొందరు స్వచ్ఛందంగా ప్లాస్మా డొనేషన్‌కి ముందుకు వస్తున్నారు. మరికొందరు కూడా ఆసక్తిగా ఉన్నారు.
కరోనా నేపథ్యంలో ప్రజలకు మీరిచ్చే సందేశం?
కరోనా సోకిన వారు ఎవరైనా సరే అంతగా భయపడాల్సిన అవసరం లేదు. గతంతో పోల్చితే ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే పాజిటివ్‌గా నిర్ధారణ అయి హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు తప్పనిసరిగా వైద్య సలహా పొందాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు వెంటనే ఆసుపత్రిలో చేరాలి. కరోనా రోగులు ఆత్మస్థైర్యం కోల్పోతే రోగ నిరోధకశక్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి చుట్టుపక్కల వారు గానీ, బంధువులు గానీ వారిలో మానసిక ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నం చేయాలి. ఇది పౌరులుగా మనందరి బాధ్యత.
ఇంటర్వ్యూ : కోరుట్ల హరీష్