Home News భారతమాతను ఆరాధిద్దాం

భారతమాతను ఆరాధిద్దాం

0
SHARE
  • జనవరి 26 గణతంత్ర, భారతమాత పూజా దినోత్సవ ప్రత్యేకం

భారత మాతను అరాధిద్దాం. భారతమాతకు జయం కలగాలని కోరుకుందాం. దానికై పని చేద్దాం. గణతంత్ర దినోత్సవం రోజున అందరం భారతమాత పూజ చేసి, ఆ తల్లి సేవలో మన జీవితాలను అర్పించాలనే సంకల్పం చేద్దాం. అదే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతంది.

సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పుతుంది. స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. – డా|| బి.ఆర్‌.అంబేడ్కర్‌

వందల సంవత్సరాల విదేశీ దురాక్రమణదారుల పాలన నుండి 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం లభించింది. అనంతరం మనం మన దేశాన్ని పాలించుకోడానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవస్థల నిర్మాణం చేసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి అమలు చేసుకొన్నాం. అప్పటి నుండి మన దేశాన్ని గణతంత్ర రాజ్యం (రిపబ్లిక్‌) అని అంటున్నాం. ప్రతి సంవత్సరం ఆ రోజున దేశమంతా గణతంత్ర దినోత్సవ కార్యక్రమం జరుగుతుంది.

1947లో ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చినప్పటికీ దేశంలోని అన్ని స్వదేశీ సంస్థానాలు గణతంత్ర రాజ్యంలో భాగస్వామ్యమై పూర్తి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనది.

జనవరి 26 తేదీయే ఎందుకు ?

రాజ్యాంగాన్ని అమలులోకి తేవడానికి జనవరి 26 తేదీనే ఎందుకు ఎంచుకున్నాం ? 1930 లో జనవరి 26న అప్పటి కాంగ్రెసు సమావేశం భారత్‌ను గణతంత్ర రాజ్యంగా ప్రకటించి దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కోసం తీర్మానం చేసింది. సంపూర్ణ స్వాతంత్య్ర తీర్మానం చేసిన రోజును చారిత్రక దినంగా భావించి మనం 1950లో జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా ప్రకటించుకొన్నాం.

భారతీయులు స్వాతంత్య్ర ప్రియులు; స్వేచ్ఛా వాదులు; స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థల పని తీరు ఎట్లా ఉన్నా దేశంలో ప్రజస్వామ్య వ్యవస్థ బలంగా వెళ్ళూనుకొంది. ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రజాస్వామ్యం బలంగా వేళ్ళూనుకొన్నప్పటికీ రాజకీయ స్థిరత్వం ఇంకా రాని కారణంగా దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన కారణంగా ప్రాంతీయ పార్టీలు ఏర్పడి వాటి ప్రాబల్యం పెంచుకొంటున్నాయి. పార్లమెంటు పాలన సజావుగా నడవక పోవటానికి ప్రాంత భావోద్వేగాలు కొంత కారణమవుతున్నాయి. దేశంలో శక్తివంతమైన జాతీయ పార్టీలు పటిష్టంగా నిలబడే వరకు ఇటువంటి అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొనక తప్పదు.

ఎక్కడ గ్రామ స్వరాజ్యం ?

భారతదేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న సామాజిక, ధార్మిక, న్యాయ, ఆర్థిక, విద్య వంటి వ్యవస్థలను నేటి ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా మార్చలేదు. భారతదేశంలో వేల సంవత్సరాలుగా గ్రామాలు స్వతంత్రగా ఉండేవి. బ్రిటిష్‌ పాలన కాలంలో గ్రామాలు స్వతంత్రం కోల్పోయి క్రమంగా బలహీనం కాసాగాయి. అందుకే స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మహాత్మా గాంధీజి ‘దేశానికి ఇంకా గ్రామస్వరాజ్యం రావలసి ఉంది’ అన్నారు.

రాజ్యాంగం అమలై నేటికి 68 సంవత్సరాలు పూర్తయినా, మన పాలకులకు గాంధీజి చెప్పిన గ్రామస్వరాజ్యం ఇంకా గుర్తుకు రావటం లేదు. పట్టణీకరణ, ప్రారిశ్రామికీకరణ మొదలైన వాటిలో పడి గ్రామాలను, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసారు. దాని కారణంగా పట్టణాలు కిక్కిరిసిపోతున్నాయి. గ్రామాలు ఖాళీ అవతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నామైపోయింది. గ్రామాలు కళా విహీనంగా మారిపోయాయి. గ్రామీణ వ్యవస్థను చక్కదిద్దకపోతే దేశంలో అభివృద్ధి, పేదరికం రెండూ ఒకదానితో మరొకటి పోటీ పడి పెరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు ఇకనైనా సరియైన నిర్ణయాలు తీసుకోవాలి.

ఎన్నికల ప్రక్రియ తీరుతెన్నులు

1951 వ సంవత్సరంలో జరిగిన మొదటి పార్లమెంటు ఎన్నికలలో 2,438 మంది లోక్‌సభకు పోటీ చేశారు. పదిహేడు కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఆ ఎన్నికలలో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ, నెహ్రూ, జయప్రకాశ్‌ లాంటి హేమహేమీలు దేశమంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేసారు. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడింది. ఇక్కడ ఇంకొక విశేషం చెప్పుకోవాలి. సార్వత్రిక ఓటు హక్కును ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశం ప్రారంభంలోనే కల్పించలేదు. భారతదేశంలో మొదటి పార్లమెంటు ఎన్నికలలోనే దానిని విజయవంతంగా అమలు చేసిన ఖ్యాతి మనది. సార్వజనిక ఓటు హక్కు ఇవ్వటం మన రాజ్యాంగం తీసుకొన్న సరైన సాహస నిర్ణయం.

బలమైన నోటా

ఈ రోజున ఎన్నికల సమయంలో ప్రజలు తమ అసంతృప్తిని వెల్లడి చేసేందుకు నోటా ను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులలో ఎవరూ తమకు నచ్చనట్లయితే ఓటర్లు ఈ నోటాకు ఓటు వేస్తారు. 2013లో సుప్రీంకోర్టు ఆదేశానుసారం నోటా ఏర్పాటయింది. ప్రపంచంలో మరో 13 దేశాలలో ఇది అమలులో ఉన్నది. నోటా తీర్పు ఎంత బలంగా ఉంటుందో మొన్నటి గుజరాత్‌ ఎన్నికల తీర్పు తెలియచేసింది. మొన్నటి గుజరాత్‌ ఎన్నికలలో నాలుగు లక్షలకుపైగా నోటాకు ఓట్లు పడ్డాయి. దానితో గెలుపు ఓటములు తారుమారయ్యాయి. ప్రజలు పాలన వ్యవస్థలపై అసంతృప్తిలో ఉన్నారని దాని ద్వారా తెలిసింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పటిష్టం కావటానికి ఓట్ల శాతాన్ని బట్టి అభ్యర్థుల నిర్ణయం జరిగితే బాగుంటుంది. ఒక్కొక్కసారి ఓట్ల శాతం పెరిగినా సభ్యుల సంఖ్య తగ్గటం సమస్యలకు కారణం అవుతున్నది. ఈ పరిస్థితిని సరి చేసుకోవలసిన అవసరం ఉంది.

ఇండియా – భారత్‌

భారత రాజ్యాంగం తయారు చేసినప్పుడు రాజ్యాంగ పీఠికలో వేల సంవత్సరాల మనదేశ చరిత్రను గుర్తు చేస్తూ రాముడి కాలం నుండి స్వాతంత్య్ర పోరాటం వరకు ఈ దేశంలో జన్మించిన మహా పురుషుల వివరాలు పొందు పరిచారు. ఒకపక్క మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదని గుర్తు చేస్తూనే మరోపక్క మనం ఇప్పుడిప్పుడే ఒక జాతిగా నిర్మాణమవుతున్నామనే భావనను వ్యక్తం చేశారు.

రాజ్యాంగంలో మన దేశం పేరును ‘ఇండియా’ గా రాశారు. దానిపైన చాలా విమర్శలు వస్తే దానిని కొద్దిగా మార్చి “India that is Bharat” అని రాశారు. “India that was Bharat” అని వ్రాయకపోవటం మన అదృష్టం. వేల సంవత్సరాలుగా ఈ దేశానికి భారత్‌ అని పేరు. దానిని మార్చటానికి ప్రేరణ ఏమిటి? మనం ఇప్పుడిప్పుడే ఒక జాతిగా రూపొందుతున్నామనే భావన. అంటే మనకు మనమే వేల సంవత్సరాల మన గుర్తింపును ప్రశ్నించుకోవటమే; విస్మరించే ప్రయత్నం చేయటమే. ఇటువంటి విభజిత ఆలోచనలు ఈ రోజున కూడా దేశంలో కనబడుతున్నాయి.

సెక్యులర్‌ అంటే..

ఈ దేశంలో అనేక మతాలు, సాంప్రదాయాలు వికసించాయి. ఇంకా కొత్తవి వికసిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటన్నింటి మధ్య ఒక సమన్వయం ఉన్నది. ‘సృష్టికర్త పరమేశ్వరుడు ఒక్కడే, అతనిని చేరుకొనేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అందుకే సర్వపంథ సమ భావనతో మెలగాలి’ అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. మత సామరస్యం గురించి మన ఆలోచన ఇంత స్పష్టంగా ఉంటే, దేశంలో సామరస్య వాతావరణం నిర్మాణం చేయటానికి ప్రయత్నాలు సహజంగా సాగుతూంటే వాటిని విస్మరించి, 1976లో అప్పటి ప్రభుత్వ పెద్దలు మన రాజ్యాంగంలో ‘సెక్యులర్‌’ అనే పదం చేర్చి ‘ఈ దేశం సెక్యులర్‌ దేశం’ అన్నారు. దానికి ఎవరికి వారు వారి స్వలాభం కోసం వారికి తోచిన వ్యాఖ్యలను చేసుకొంటూ వచ్చారు. డా||సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‘రివ్యూ ఆఫ్‌ ఫెయిత్‌’ అనే ఆంగ్ల పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో అప్పటికే ప్రచారంలో ఉన్న సెక్యులరిజ భావన గురించి చెపుతూ ‘సెక్యులరిజం అంటే ప్రభుత్వ దృష్టిలో అన్ని మతాలు సమానం. ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యం లేదు అని భావం’ అని రాశారు. జాతీయ జీవనంలో ఎవరికీ ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని స్పష్టం చేశారు.

కాని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం సెక్యులర్‌ అంటే హిందూ వ్యతిరేక వాదమనే భావనను పెంచి పోషించారు. మైనారిటీ పేరుతో హిందుత్వం తప్ప మిగతా మతాలకు అధిక ప్రాధాన్యమిచ్చి వారి పబ్బం గడుపుకుంటున్నారు. దానితో జాతీయ సమైక్యతకు అవరోధం కలుగుతోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దాలి.

ఓటు బ్యాంక్‌ రాజకీయాలు

మనకు స్వతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మనదేశంలో బ్రిటిష్‌ రాజనీతి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఆంగ్లేయులు భారతదేశంలో తమ ఆధిపత్యం కొనసాగించటానికి ‘విభజించి పాలించు’ అనే నీతిని పాటించి ఈ దేశ ప్రజలను అనేక వర్గాలుగా చీల్చారు. అదే కుటిల నీతిని కాంగ్రెసు అనుసరిస్తూ ప్రజలను ఓట్‌ బ్యాంకులుగా మలచుకున్నారు. దానికి కొన్ని విషయాలు ఎంపిక చేసుకొన్నారు. 1. రిజర్వేషన్ల పేరుతోనూ, సెక్యులరిజం పేరుతోనూ, ఇంకా అనేక రకాలుగా ఈ సమాజాన్ని చీల్చారు. కాంగ్రెసును చూసి మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా విభజించి పాలించే విధానాన్ని మరింతగా కొనసాగిస్తున్నాయి. కులాల కురుక్షేత్రాలు నడుపుతున్నాయి.

మొన్నటికి మొన్న గుజరాత్‌ ఎన్నికలలో హర్దిక్‌ పటేల్‌, జిగ్నేష్‌ లాంటి నాయకులు కాంగ్రెసు వలలో పడి రాష్ట్రంలో కులాల సంఘర్షణకు ఎట్లా తెరలేపారో మనం చూసాం. ఈ పరిస్థితులు దేశంలో సంఘర్షణ లకు తెర లేపుతున్నాయి. అందుకే డా|| అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలైన 1950 జనవరి 26న మన పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తూ ‘ఈ దేశం రాజకీయ స్వాతంత్య్రం సంపాదించుకొంది. ఇక రావలసింది సామాజిక ప్రజాస్వామ్యం. సామాజిక ప్రజాస్వామ్యమనేది ఒక జీవన విధానం. దానిలో స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అనే మూడు అంశాలుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి మమేకమై ఉంటాయి. వీటిని విడదీయలేము. విడదీస్తే సామాజిక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. ఇందులో ఏ ఒక్కదానిని తొలగించినా ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. సమానత్వం లేని స్వేచ్ఛ వ్యక్తుల ఆధి పత్యాన్ని నెలకొల్పుతుంది. స్వేచ్ఛ లేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుంది. సోదర భావం లేని స్వేచ్ఛ, సమానత్వం సహజంగా ఉండలేవు’ అన్నారు. అలాగే అంబేడ్కర్‌ దేశ ప్రజలందరికి ఒకే సివిల్‌ కోడ్‌ ఉండాలని సూచించారు. ఇప్పుడిప్పుడే ఆ దిశలో అడుగులు పడుతున్నాయి.

బ్రిటిష్‌ వారు సృష్టించిన ‘ఆర్య-ద్రావిడ’ సిద్ధాంతం పేరుతో గడిచిన కొద్ది సంవత్సరాల నుండి కుల ఘర్షణలను (దళితులు-అగ్రవర్ణాల పేరుతో) తెరపైకి తెచ్చి సమాజంలో విద్వేషాలు నిర్మాణం చేయటానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి భీఫ్‌ పెస్టివల్‌, మనువాద స్మృతి మొదలైనవి పాచికలవుతున్నాయి. గుజరాత్‌ ఎన్నికలలో తెరపైకి వచ్చిన జిగ్నేష్‌ మేవాని లాంటి వారు కుల గొడవలకు ఎట్లా ఆజ్యం పోశారనేది దీనికి తాజా ఉదాహరణ. జిగ్నేష్‌ తన మాటలలో ఎంత దూరం వెళ్ళాడో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ‘మన భవిష్యత్తుకు అంబేద్కర్‌ చెప్పిన మాటలే శిలాశాసనం కాదు. అవసరాన్ని బట్టి వ్యవహరించాలి. దళితులు రాజకీయ అధికారం కోసం కమ్యూనిస్టులతో కలవాలి’ అన్నాడు. ఈ దేశాన్ని ముక్కలు చేస్తామని నినదించిన ముఠాలతో జిగ్నేష్‌ ఎలా కలిసి పోయాడో మనం పత్రికలలో చూశాం. ఇటువంటి విద్రోహుల విషయంలో సమాజం అప్రమత్తం కావాలి.

ఇదే కాక బ్రిటిష్‌వారు సృష్టించిన ఈ ‘ఆర్య – ద్రావిడ’ సిద్ధాంతాన్ని పట్టుకు వేళ్ళాడుతూ మరికొంత మంది తమ పబ్బం గడుపుకుంటున్నారు. జెఎన్‌యు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం, ఈ మధ్యనే కరినగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయాలలో చోటు చేసుకొన్న ఘర్షణలు ఇందుకు ఉదాహరణ. ఇలా సమాజంలో విద్వేషాలు నిర్మాణం చేయాలని ప్రయత్నించే వారి ఎత్తుగడలను తిప్పికొట్టాలి. సమాజంలో ‘మనం’ అనే భావనను నిర్మాణం చేయాలి. అప్పుడే స్వయంగా మన రాజ్యాంగ నిర్మాత డా||అంబేద్కర్‌ ఆశించిన సామాజిక ప్రజాస్వామ్యం కల సాకారమవుతుంది.

భారతమాతను ఆరాధిద్దాం

స్వాతంత్య్ర పోరాట కాలంలో పని చేసిన వారికి ‘ఈ భూమి నా తల్లి’ అనేది ప్రేరణ. ఆ ప్రేరణకు ప్రతిరూపం వందేమాతరం. నేడు మన యువతకు అటువంటి భావాత్మక ప్రేరణ అందించి, మన సంస్కృతి వారసత్వాల పట్ల అభిమానం పెంచాలి. అదే ఈ దేశంలోని అనేక సామాజిక సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. తద్వారా ప్రజలలో ఐక్యత నిర్మాణమవుతుంది. అప్పుడు మన దేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా నిలబడగలుగుతుంది.

అందుకే స్వామి వివేకానంద చెప్పినట్లు – భారత మాతను అరాధిద్దాం. భారతమాతకు జయం కలగాలని కోరుకుందాం. దానికై పని చేద్దాం. గణతంత్ర దినోత్సవం రోజున అందరం భారతమాత పూజ చేసి, ఆ తల్లి సేవలో మన జీవితాలను అర్పించాలనే సంకల్పం చేద్దాం.

– రాంపల్లి మల్లికార్జున్‌

(జాగృతి సౌజన్యం తో)