Home News గోవులను ఎందుకు చంపరాదు?

గోవులను ఎందుకు చంపరాదు?

0
SHARE

భారతీయులు సగర్వంగా చెప్పుకోదగిన ప్రాచీన భారతీయ నాగరికతలోని అద్భుత విజ్ఞానమే ‘గోవిజ్ఞాన’ సంపద. గోవు విలువ తెలియడం చేత దానికి దేవతాస్థానం ఇవ్వబడింది. గోరక్షణ ఈ దేశానికి అతి ప్రధానమైన అంశం. ఎందుకంటే మన ఈ ప్రత్యేకమైన, ఉత్తమ గోసంపద ప్రపంచంలో ఎక్కడా లేదన్నది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం. మూపురంలోని సూర్యకేతునాడి ద్వారా సూర్యశక్తిలోని దివ్యమైన ప్రాణశక్తిని గ్రహించి, పాలు, మూత్రం, గోమయం, వాటి ఉత్పత్తులను మనకి అందిస్తున్నది. అందుకే భారతీయ సంస్కృతిలో అమ్మ తరువాతి స్థానం గోవుదే.

ఈ అద్భుత గోవిజ్ఞాన సంపదను గుర్తించక, మరచిపోయిన సుప్త దశలోని మన రైతు సోదురులు గోవులను భారంగా ఎంచి, సంతలలో 5వేల నుంచి 15 వేలలోపుకే – కసాయివారికి కోతకు అమ్ముకుంటున్నారు. నిద్రావస్థలో వున్న ప్రభుత్వ యంత్రాంగం చట్టాలను తుంగలో తొక్కి, దక్కే కొద్ది ఆర్థిక లాభాలను ఆశిస్తున్నందువల్ల, వీటి రక్షణపై ఎవరి దృష్టీ ఉండటం లేదు. రక్షించవలసిన ప్రభుత్వం విభాగాలు, వైద్యులు, పోలీసు యంత్రాంగాలు – రాజ్యాంగం ఆవులకిచ్చిన హక్కులను గాలికి వదులుతున్నారు. వధశాలల వారున్నూ వారి అత్యధిక లాభార్జనకు, పై బలహీనతలను సొమ్ము చేసుకొంటూ – యంత్రాంగాన్ని వారి గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఒక్కొక్క మండలంలో 500 నుండి 1000 వెయ్యి ఆవులుపైన ఉన్నవి వేళ్లపై లెక్కపెట్టవచ్చును. దీనివల్ల ఎప్పటికప్పుడు పర్యావరణం, ప్రకృతిలో సమతుల్యత లోపించి మానవుడు ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నాడు.

శాస్తజ్ఞ్రుల విశే్లషణలలోను అనేక విషయాలు వెల్లడవుతున్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. వాటిని కర్కశంగా వధించినపుడు బాధతో కూడిన ఆక్రందనల ప్రకంపనల వల్ల ప్రకృతి విపత్తులు ఏర్పడుతున్నాయన్నది ఒక అంశం. సగం గొంతు కోసి చంపడం (హలాల్) వల్ల అవి శారీరకంగా బాధను అనుభవిస్తాయి. మెదడులోను, శరీర భాగాల్లోను హానికారక రసాయనిక చర్యలు జరుగుతాయి. అలా మరణించిన గోవుల మాంసాన్ని తిన్నవారికి అనారోగ్యం కలుగుతుందన్నది మరో విషయం. పకృతి సహజమైన ఎరువులను వదిలేసి రసాయన విష పదార్థాలను వాడటం వల్ల, మందులేమీ పనిచేయని, లేని కొత్తకొత్త రోగాలను కొనితెచ్చుకుంటున్నామన్నది మరో అంశం. గోమయం, గోమూత్రం వంటివి వాడకుండా రసాయనాలను వాడటం వల్ల భూములు పాడై, వానపాములు, భూగర్భ జలాలు పాతాళానికి చేరిపోతున్నాయి. వర్షపాతం తగ్గి జనజీవనం దుర్భరమవుతోంది.

రైతులు గతంలో గోసంపదతో కలసి ఉండటం వల్ల వారికి పాడిపంటలు పుష్కలంగా దక్కేవి. ఆరోగ్యకరమైన ఆహారం లభించేది. పాడిపశువులతో లక్ష్మీకళతో ఇళ్లన్నీ శుభకరంగా విలసిల్లేవి. ఇప్పటికైనా మించిపోయినది లేదు. గోవుల శక్తివల్ల అనేక సమస్యలను తొలగించుకోవచ్చునన్నది నా విశ్వాసం.. అనుభవం.

ఒక ఆవువేసే పేడ, మూత్రాల వల్ల రైతు 30 ఎకరాలను సులభంగా విష రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయవచ్చు. ఒక్క రోజుకు ఒక ఆవు ఇచ్చే పది కిలోల పేడ, పది లీటర్ల మూత్రం ద్వారా ఒక ఎకరాకు సరిపోను ఎరువు పొందవచ్చు. ఇలా రోజుకు ఒక ఆవు రెండు వేల రూపాయల విలువైన ఎరువును ఇస్తుంది. గోమూత్రం, కొన్ని చెట్ల ఆకులతో కలసి పురుగు మందులను తయారు చేయవచ్చు. మనదేశంలో అనాదిగా.. ఇప్పటికీ ఈ పద్ధతులను కొందరు పాటిస్తూ లబ్ది పొందుతున్నారు. అతితక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయగలగడం, అధిగ దిగుబడి సాధించడం, నాణ్యమైన ఉత్పత్తులు పొందడం గోవుల వల్ల సాధ్యం.

బతికుండగా గోవులను అమ్ముతున్నవారు చాలామంది ఉన్నారు. అది పాపం. సహజంగా గోవు మరణించిన తరువాత దానిని సమాధి చేయడం వల్ల ఆ తరువాతి కాలంలో అది ఎరువుగా మారి చాలాకాలంపాటు ఆ పొలాలకు ఎరువుగా పనిచేస్తుంది. దాదాపు పదినెలల పాటు పది ఎకరాల భూమికి సరిపడే పది లక్షల విలువైన ఎరువులకు ఇది సమానమని చెప్పొచ్చు. నిజానికి ఆవుపేడ, మూత్రం వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి. వంద గ్రాముల పేడను వ్యవసాయానికి వాడితే అది 300 కోట్ల సూక్ష్మ జీవులను ఉత్పత్తి చేసి సాగుకు సహకరిస్తుంది. దేశీయ ఆవులకు మాత్రమే ఈ శక్తి ఉంది.

ఆస్ట్రేలియాలో ‘ఓం హోమాఫార్మ్స్’ అని హోమంతో వచ్చే బూడిదను ఎరువులు, పురుగు మందులుగా వాడుతున్నట్లు చెబుతారు. యజ్ఞం ద్వారా ప్రొపిలీన్ ఆక్సైడు’ వంటివి ఉత్పత్తి అయ్యి వర్షం కురవడానికి దోహదవౌతుంది. హోమధూమానికి రోగకారక కాలుష్యాలను, బాక్టీరియాను పోగొట్టి శుద్ధి చేసే శక్తి ఉన్నదని సైన్స్ ఋజువు చేసింది. జైపూర్ వైద్యశాలల్లో గోమూత్రాన్ని పరిశుభ్రత కోసం వాడుతున్నారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్‌గా గోమూత్రం, గోమయం పనిచేస్తాయని నిరూపితమైంది. అందుకే పూర్వం ఇళ్లముందు కళ్లాపి జల్లి ఇల్లు అలికేవారు. గోమూత్రాన్ని పూర్వీకులు సేవించేవారుకూడా. ఆవుపేడ రేడియేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అందుకే ఆవుపేడతో చేసిన స్టిక్కర్ల ద్వారా సెల్‌ఫోన్ల రేడియేషన్‌ను తగ్గించి ప్రమాదాలను నివారించే ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఇక గోమూత్రం, గోమయంతో బత్తీలు, అట్టలు, ధూప్‌బత్తీలు, ఫినాయిల్, సబ్బులు వంటివి తయారు చేసి ఉపాధి పొందవచ్చు. పూలకుండీలు, దుస్తులు, బొమ్మలుసహా వంద రకాల వస్తువులను వీటితో తయారు చేస్తున్నారు. గోమూత్రము, గోమయము, గోవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వంటి వాటిని అద్భుత ఔషధాలుగా వాడతారు. దీర్ఘకాల, మొండి జబ్బులను ఇవి నయం చేస్తాయి. గోచికిత్సా శాస్త్రంలో వీటి వల్ల కలిగే ప్రయోజానాలు ఏమిటో ఉన్నాయి. అది మన దేశపు విజ్ఞానం. గోవుయొక్క స్పర్శ, దృష్టి, వాసన, సాహచర్యము ఆరోగ్యాన్నిస్తాయి. దీనివల్ల నేరస్వభావం తగ్గుతుంది. ఇక గోబర్‌గ్యాస్‌వంటి ఇంధనశక్తిని సృష్టించడం వీటివల్ల సాధ్యమైంది. కోల్‌కతాలో బస్సులను కూడా బయోపెట్రోల్‌తో నడిపి చూశారు.

ఇక మానవుల అంత్యేష్ఠి కార్యక్రమంలో కలపను వాడుతారు. దానివల్ల ఎన్నో వృక్షాలను నరికివేయవలిసి వస్తోంది. దీనివల్ల వేరే సమస్యలు ఉత్పన్నమవుతాయి. పైగా కట్టెల మండటం వల్ల 1100 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత ఉద్భవిస్తుంది. అదే ఆవుపేడతో చేసిన పిడకలను మండిచడం ద్వారా 2300 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత వెలువడుతుంది. అందువల్ల కట్టెలకు బదులు పిడకలతో అంత్యేష్ఠి జరపడం అవశ్యం. పైగా కాలుష్యరహితం కూడానూ.

విదేశాలవారు మన గోవిజ్ఞాన సారాన్ని గ్రహించారు. అందువల్ల ఒంగోలు, గిరిజాతి వంటి ఉత్తమ జాతి ఆవులను తీసుకువెళ్లి వారి దేశాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. ఆవుపాల ద్వారా క్యాన్సర్‌ను నివారించే ‘కర్కుమెన్’ అనే రసాయనాన్ని తైవాన్ శాస్తవ్రేత్తలు తయారు చేస్తున్నారు. సహజ, పశువుల సహకారంతో వ్యవసాయాన్ని ఆయా దేశాలు అనుసరిస్తున్నాయి. గోవుల సహాయంతో వ్యవసాయం ఇప్పటికీ అనుసరణీయం. పైగా భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రాధాన్యం చాలా ఎక్కువ. అది కామధేనువు. అందుకే ప్రతి ఇంటిలో గోపోషణ జరగాలి. చక్కటి సంతానం, ఆరోగ్యం, ఆదాయం వీటివల్ల సాధ్యం. గోవధ దేశద్రోహం. గోరక్షణ మానవరక్షణ. గోవు సర్వసంపదలకు మూలం.

-తోట రామారావు

(ఆంధ్రభూమి సౌజన్యం తో)