డా.బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణమూర్తి గారు అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరినగర్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీ దక్షిణమూర్తి గారు మాట్లాడుతూ ప్రంపచానికే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి దేశ సంక్షేమం కోసం, దేశ వైభవం కోసం తన జీవితాన్నే దారపోసిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.
నిమ్న కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ సమాజానంతటిని ఏకతాటిపైకి తీసుకురావడానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశాడని ఆయన అన్నారు. సమాజంలో ఉన్న బేదాలను తొలగించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేశాడని అన్నారు. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం రాజ్యంగంలో రిజర్వేషన్లు కల్పించి వారిని అత్యున్నత స్థాయికి తీసుకురావడానికి అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. సమాజంలో అణచివేతకు గురైన వర్గాలు రిజర్వేషన్ల వల్ల నేడు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నాయని అన్నారు. అంబేద్కర్ అవలంభించిన జాతీయ వాదాన్ని పాటించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అణగారిన వర్గాలు తాము ఉన్నత స్థాయికి చేరుకోవడానికి రిజర్వేషన్లు ఎప్పటి వరకు అవసరమని వారు భావిస్తారో అప్పటి వరకు రిజర్వేషన్లను కొనసాగించాలని అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కోరుకుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ కరినగర్ జిల్లా సంఘచాలక్ డాక్టర్ చక్రవర్తుల రమణాచారి గారు, సుధాకర్ గారు, పుల్లూరి రామారావు గారు, సామాజిక సమరసత జిల్లా ప్రముఖ్ శ్రీ బోయిన పురుషోత్తం గారు, సామాజిక సమరసతా వేదిక జిల్లా కార్యదర్శి శ్రీ జెర్రిపోతుల శంకర్ గారు, సిఏ శ్రీ హరీష్ గారు, కరీంనగర్ నగర కార్యవాహ శ్రీ మురళీధర్ గారు, శ్రీ మునిందర్ గారు, ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకులు, తదితరులు పాల్గొన్నారు.