జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసి, దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ. దేశభక్తియుత విప్లవ రాజకీయాల పురిటి గడ్డ బెంగాల్‌లో 1901 జూలై 7వ తేదీన అసుతోష్ ముఖర్జీ, రాణి జోగ్మయాదేవిలకు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మించారు. 1919లో ఇంటర్ పూర్తి, 1921లో బిఏ ఆనర్స్, 1923లో ఎంఏ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు.1924లో హైకోర్టు న్యాయవాదిగా తన వృత్తిని మొదలు పెట్టారు. అయితే తండ్రి మరణం కారణంగా ఖాళీ అయిన కలకత్తా విశ్వవిద్యాలయం సిండికేట్ స్థానంలో ముఖర్జీ నియుక్తులయ్యారు. 1934లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా నియమితులు కావడం మరో పెద్ద మైలురాయి. 1938లో కలకత్తా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. అదే సంవత్సరంలో బెనారస్ విశ్వవిద్యాలయం కూడా ఆయనకు గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించింది. 1937లో జరిగిన ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. బెంగాల్ రాష్ట్రం తీవ్రమైన క్షామం బారిన పడిన సమయంలో బెంగాలసహాయ సమితి అనే సంస్థ ద్వారా పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలను నిర్వహించారు.
1946లో జరిగిన ఎన్నికల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ మరోసారి బెంగాల్ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బెంగాల్‌ను పాకిస్తాన్‌లో పూర్తిగా విలీనం చేస్తే భవిష్యత్తులో దేశ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులు ఉద్యమించి తూర్పు పాకిస్తాన్‌ను తిరిగి భారత దేశంలో కలుపుతారని స్పష్టం చేశారు. బెంగాల్‌లోని హిందూ ఆధిక్య ప్రాంతాలను ఇండియన్ యూనియన్‌లోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ముఖర్జీ చేపట్టిన ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. దీంతో ముస్లిం ఆధిక్య ప్రాంతాలు మాత్రమే పాకిస్తాన్ పరిధిలోకి వెళ్లాయి. అదే విధంగా పంజాబ్‌లోని హిందూ ప్రాంతాలను భారత్‌లోనే కొనసాగించారు. రెండున్నర సంవత్సరాలు పరిశ్రమల మంత్రిగా ఉన్న సమయంలో చిత్తరంజన్ రైలు ఇంజన్ కర్మాగారం, సింద్రీ ఎరువుల కర్మాగారం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే మూడు భారీ పరిశ్రమలను రూపొందించారు.
శ్యాంప్రసాద్ మనసులో రూపుదిద్దుకున్న ఆర్థిక, పారిశ్రామిక విధానమే ఆ తదుపరి దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి మేధావుల చేతుల్లో మెరుగు దిద్దుకుని భారతీయ జన సంఘానికి, ఆ తరువాత భారతీయ జనతాపార్టీ కూడా మూలభూత సైద్ధాంతిక ఆధారం అయింది. దేశ భవిష్యత్తు కోసం ఆయన తీవ్రంగా ఆలోచించే వారు. విభజన కష్టాలను ఎదుర్కొన్న భారతదేశంలో మొదటి ప్రధానమంత్రి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను శ్యాంప్రసాద్ నిశితంగా విమర్శించేవారు. హిందూ శరణార్థుల విషయంలో నెహ్రూ ధోరణిని నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు ముఖర్జీ.
స్వాతంత్య్రం తర్వాత భారత్‌లో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విలీనం సందర్భంగా ప్రధాని నెహ్రూ అనుసరించిన దాగుడు మూతల వైఖరితో సమస్య రాచపుండులా మారింది. తన మిత్రుడు షేక్ అబ్దుల్లాకు అధికారం కట్టబెట్టే ఆలోచనలో భాగంగా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకతలను ఆర్టికల్ 370 రూపంలో నహ్రూ రక్షణ కల్పించారు. అవన్నీ పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉండడమే కాకుండా కశ్మీరీలు మిగతా బారతీయ సమాజంతో కలవకుండా ఆర్టికల్ 370 అడ్డుపడేది. దీనిపై దృష్టి సారించిన ముఖర్జీ.. ఏక్ దేశ్‌మే దో ప్రధాన్, దో నిశాన్, దో విధాన్ నహీ చలేగా.. నహీ చెలాగా.. అంటూ ఆర్టికల్ 370ని రద్దు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్నిజనసంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించారు .1953 మేలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ జమ్మూ యాత్ర తలపెట్టగా అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ముఖర్జీ జమ్మూకశ్మీర్ భూభాగంలోకి ప్రవేశించగానే పోలీసులు అరెస్టు చేసి శ్రీనగర్ జైలుకు తరలించారు. 1953 జూన్ 23న నిర్భందంలో ఉన్న శ్యామ ప్రసాద్ ముఖర్జీ అనారోగ్యంతో మరణించారనే వార్త దేశ ప్రజను దిగ్భ్రాంతికి గురి చేసింది. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ముఖర్జీ మరణంపై అనుమానాలు ఉన్నా సరైన విచారణ జరగలేదు. జమ్మూ కశ్మీర్‌ను భారత దేశంతో సంపూర్ణంగా కలిపే మహా యజ్ఞంలో సమిధగా ఆహుతయ్యారు డాక్టర్ ముఖర్జీ.
(నేడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్)