Home News ‘ఆధార్’తో ఆవులకు మేలు!

‘ఆధార్’తో ఆవులకు మేలు!

0
SHARE

మధ్యప్రదేశ్‌లో గోమాతలకు మరో విశిష్టత లభించనుంది. దేశంలోనే తొలిసారిగా ఈ రాష్ట్రంలో గోవులన్నింటికీ ‘ఆధార్’ కార్డులను రూపొందించేందుకు రంగం సిద్ధమైంది. ‘ఆధార్’ కార్డు ఉన్న ప్రతి ఆవుకు చెవి భాగంపై ఓ ప్రత్యేకమైన ‘టాగ్’ను అతికిస్తారు. ఈ ‘టాగ్’లోని పసుపురంగు ‘చిప్’లో సంబంధిత గోవుకు సంబంధించిన వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. గోవు జన్మించిన తేదీ, పాల ఉత్పత్తి వివరాలు, ఆరోగ్య పరిస్థితి, సంతానోత్పత్తి స్థాయి, యజమాని చిరునామా వంటి సమచారం అంతా ఆ ‘చిప్’లో ఉం టుంది. ఈ సమాచారాన్ని కంప్యూటర్లలోనూ తెలుసుకునే వీలుంది.

గోవులకు ‘ఆధార్’ కార్డులను రూపొందించే ప్రక్రియను వేగవంతంగా, సమర్ధవంతంగా పూర్తి చేయాలని మధ్యప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి ఇప్పటికే సంబంధిత అధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్‌లో 54 లక్షల ఆవులతో పాటు మొత్తం 90 లక్షల పశువులకు ఆధార్ కార్డులు మంజూరు చేస్తారు. రాష్ట్రంలోని మొత్తం 51 జిల్లాల్లో నెలకు ఏడున్నర లక్షల పశువులకు ‘ఆధార్’ నెంబర్లు కేటాయిస్తారు. ఇప్పటికే ఆగ్రా మాల్వా, ధార్, ఖర్గోన్, షాజాపూర్ జిల్లాల్లో 1,083 ఆవులకు వీటిని కేటాయించారు. హిందువులు భక్త్భివంతో పూజించే గోవులకు దేశంలోనే తొలిసారిగా ‘ఆధార్’ నెంబర్లు కేటాయించే కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పనిని పూర్తిచేసేందుకు ఇప్పటికే 3,600 మందికి శిక్షణ ఇచ్చారు. వీరు గ్రామాలకు వెళ్లి ఆవులు, ఇతర పశువులకు చెవి భాగంపై ‘పంచ్’ కొట్టి ఆధార్ నెంబర్ ఉన్న ‘టాగ్’లను అతికిస్తారు. పాడిపశువులకు సంబంధించిన వివరాలన్నింటినీ సేకరించి, సమాచారాన్ని కంప్యూటర్లలోకి ఎక్కిస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు.

పశువులను అక్రమంగా తరలించడాన్ని, వధశాలలకు విక్రయించడాన్ని అరికట్టేందుకు ఈ ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గుజరాత్‌లోని జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో పశువులకు ఆధార్ నెంబర్లు కేటాయిస్తారు. రాబోయే రెండేళ్లలో పూర్తయ్యే ఈ కార్యక్రమానికి సుమారు 13 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహకారాన్ని అందజేస్తుంది. పశువులకు ‘ఆధార్’ కేటాయించే పనులను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే రాష్ట్రాలకు సూచించింది. అయితే, మధ్యప్రదేశ్ ప్ర భుత్వం మాత్రమే దీన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చింది. నాలుగు జిల్లాల్లో దీన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఒక ప్రాంతంలో ‘ఆధార్’ను కేటాయించిన ఆవులను మరో ప్రాంతానికి తరలించినప్పటికీ మళ్లీ నిర్దిష్టమైన నెంబర్‌ను పొందాల్సిన అవసరం ఉండదు. పశుసంపద, పాల ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘ఆధార్’ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)