Home News మూడు నూత‌న క్రిమిన‌ల్ బిల్లులకు లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ ఆమోదం

మూడు నూత‌న క్రిమిన‌ల్ బిల్లులకు లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ ఆమోదం

0
SHARE

బ్రిటిష్ వలస పాలన నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (IPC), నేర శిక్షాస్మృతి (CRPC), సాక్ష్యాధార చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో  కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం  రూపొందించిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు పార్ల‌మెంట్ ఆమోదం పొందింది. ఈ బిల్లులను లోక్‌స‌భ బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదం పొంద‌గా, గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌స‌భలో ప్రవేశ పెట్టారు.

ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్-1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. “ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి” అని అమిత్ షా వివరించారు.

దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు.

ఈ మూడు చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య (బీఎస్).. పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తొలిసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే, వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో తాజా శీతాకాల సమావేశాల్లో వీటిని కేంద్రం వెనక్కు తీసుకుంది.

ఆ తర్వాత వీటిలో మార్పులు చేసి.. ‘భారతీయ న్యాయ (రెండో) సంహిత’, ‘భారతీయ నాగరిక్ సురక్షా (రెండో) సంహిత’, ‘భారతీయ సాక్ష్య (రెండో)’ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టారు. ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు చట్టంగా మారనున్నాయి.

ప్ర‌ధాని మోదీ హ‌ర్షం

పార్లమెంటులో 3 క్రిమినల్ శిక్షా స్మృతి బిల్లులు ఆమోదం పొందడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ఇది ఒక పెద్ద మార్పు అని, కొత్త పరిణామాల ప్రారంభానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ముఖ్యమైన సంఘటనగా ప్రధాని మోదీ దీనిని అభివర్ణించారు.  దీనితో మన దేశంలో వలస పాలన చట్టాలకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. భారత చరిత్రలో ఈ కొత్త చట్టాలు అమలుతో ప్రజా సేవా, సంక్షేమం విషయంలో నవయుగం ప్రారంభమవుతుందని చెప్పారు. ట్విట్టర్ లో చేసిన పోస్టులో ప్రధాని మోదీ “భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023, భారతీయ న్యాయ సంహిత, 2023 మరియు భారతీయ సాక్ష్యా అధినియం, 2023 ఆమోదించడం మన చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం” అని తెలిపారు.

ఈ బిల్లులు మన సమాజంలోని పేద అట్టడుగు బలహీన వర్గాలకు మెరుగైన రక్షణను అందిస్తాయని, దేశపు శాంతియుత ప్రయాణం వైపు పురోగమనానికి ఉపయోగపడతాయని తెలిపారు. దేశద్రోహం పై రాజ్యాంగంలోని కాలం చెల్లిన సెక్షన్లకు భారతదేశం వీడ్కోలు పలుకుతుందని ప్రధాని మోదీ చెప్పారు.