( డిసెంబర్ 23 – స్వామి శ్రద్ధానంద జీ బలిదాన్ దివస్)
స్వామి శ్రద్ధానంద పూర్వ నామం మున్షీరామ్ విజ్. గొప్ప విద్యావేత్తగా, ఆర్యసమాజ్ కార్యకర్తగా ప్రసిద్ధులు. స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసా లతో ప్రభావితులై సామాజిక సరస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.
స్వామి శ్రద్ధానంద 1856 ఫిబ్రవరి 22 నాడు తల్వాన్ గ్రామం, జలంధర్ జిల్లా పంజాబులో జన్మించాడు. ఆయన తండ్రి లాలానానక్ చంద్ పోలీసు ఇన్ స్పెక్టర్. ఆయన చిన్ననాటి పేరు బృహస్పతి విజ్. తరువాత ఆయన్ని మున్షీరామ్ విజ్ అని పిలిచారు. కొన్ని పరిస్థితుల ప్రభావంతో ఆయన నాస్తికుడయ్యాడు. మంచి వక్త. లాహోర్ లోని డిఎవి కళాశాలలో వేద విద్యను పాఠ్యాంశంగా ఉంచేందుకు ఆయన ఉద్యమించాడు. ఆర్య సమాజ ప్రభావానికి లోనై, ఆర్యసమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతిని కలిశాడు. స్వామి దయానంద ధైర్యం, నైపుణ్యం బలమైన వ్యక్తిత్వానికి ప్రభావితమయ్యాడు. చదువు పూర్తయ్యాక న్యాయవాదిగా వృత్తి చేయడం ప్రారంభించాడు. 1897లో లాలా లేఖ్ రామ్ హత్యకు గురయిన తరువాత పంజాబ్ ఆర్య ప్రతినిధి సభకు నాయకత్వం వహించాడు. మాస పత్రిక “ఆర్య మాసాధీర్” ను ప్రారంభించాడు. 1902లో హరిద్వార్ సమీపంలో కాలగ్రీలో గురుకులం స్థాపించాడు.
1917లో మున్షీరామ్ విజ్ సన్యాసం స్వీకరించి ‘స్వామి శ్రద్ధానంద సరస్వతి’గా దేశసేవకు అంకితమైనారు. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. జలియన్ వాలా బాగ్‌లో జరిగిన దారుణ హత్యాకాండకు నిరసనగా 1919లో కాంగ్రెస్ సమావేశాలను అన్పుత్‌సర్‌లో జరుపవలసిందిగా నాటి కాంగ్రెస్ పెద్దలను ఆహ్వానించారు. కాని కాంగ్రెస్ కమిటీలో ఏ ఒక్కటి ముందుకు రాకపోవటంతో తానే అధ్యక్షతవహించి ఆ సమావేశాలు జరిపారు. 1923లో పై కార్యక్రమాలన్నింటినీ వదిలి ‘శుద్ధి’ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారతీయ హిందూశుద్ధి సభ అధ్యక్షులైనారు. బలవంతంగా ముస్లింలుగా మార్చబడిన హిందువులను ముఖ్యంగా ‘మల్కానా రాజ్‌పుత్’లను శుద్ధి కార్యక్రమం ద్వారా మాతృ ధర్మంలోకి తిరిగి వచ్చేలా చేశారు. దీనివలన నాటి ముస్లిం నేతలు, ముస్లిం మతోన్మాదులతో ఘర్షణలను ఎదుర్కోవలసి వచ్చింది.
1926 డిసెంబర్ 23న న్యూమోనియా జర్వంతో ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటుండగా ‘అబ్దుల్ రషీద్’ అనే ముస్లిం యువకుడు స్వామి శ్రద్ధానందను హత్యచేశాడు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే 1926 డిసెంబర్ 26న గౌహతి కాంగ్రెస్ సమావేశాలలో సంతాపం ప్రకటిస్తూ గాంధీజీ ఆ హంతకుడిని తన సోదరుడిగా సంబోధిస్తూ అతడు దోషి కాడని పేర్కొన్నారు.
స్వతంత్రం వచ్చిన తరువాత ఢిల్లీ టౌన్‌హాల్ ఎదురుగా ఉన్న బ్రిటిష్ రాణీ విక్టోరియా విగ్రహాన్ని తొలగించి, ఆ స్థానంలో స్వామి శ్రద్ధానంద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.