అజాన్ (నమాజ్ కు రావాలనే పిలుపు) కోసం లౌడ్ స్పీకర్లు, ఇతర శబ్ద పరికరాలు ఉపయోగించడం ఇస్లాంలో తప్పనిసరి, మౌలిక విషయం కాదని, కేవలం గొంతెత్తి పిలవడం మాత్రమే ఉన్నదని, అది మాత్రమే అనుమతిస్తామని అలహాబాద్ హైకోర్ట్ ఒక చరిత్రాత్మక తీర్పులో పేర్కొంది. మసీదుల్లోని మినార్ ల పై నుంచి ముయెజిన్ (వ్యక్తులు) గొంతెత్తి అజాన్ చేయడం మాత్రమే ఉన్నదని, లౌడ్ స్పీకర్ల ద్వారా కాదని కోర్ట్ స్పష్టం చేసింది.
అజాన్ అనేది ఇస్లాంలో ముఖ్యమైన అంశమే అయినా అందుకు లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం మాత్రం ఆ మతపు నిబంధన కానేకాదని కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి లౌడ్ స్పీకర్ల వాడకం 25 అధికరణం క్రింద పేర్కొన్న ప్రాధమిక హక్కు కాదని, రాజ్యాంగంలోని మూడవ భాగం క్రింద ప్రాధమిక హక్కు కూడా ప్రజా వ్యవస్థ, ఆరోగ్యం, ఇతర అంశాలను ప్రభావితం చేయానంత వరకేనని కోర్ట్ స్పష్టం చేసింది. కోర్ట్ ఆదేశాల మేరకు రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు లౌడ్ స్పీకర్లు ఉపయోగించడానికి వీలు లేదు.
అటువంటి లౌడ్ స్పీకర్లు ఉపయోగించుకోవడానికి ఏ మసీదుకు సంబంధించిన కమిటీ ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ లు ఒక్కటి కూడా తమ ముందు ఉంచడంలో పిటిషనర్ లు విఫలమయ్యారని కోర్ట్ పేర్కొంది. ఇలా అనుమతి లేకుండా వాటిని ఉపయోగించడం చట్ట వ్యతిరేకమని కోర్ట్ స్పష్టం చేసింది. అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి దాఖలైన పిటిషన్ లను శబ్ద కాలుష్య నివారణ నిబంధనల ప్రకారం పరిశీలించవచ్చని పేర్కొంది.
ఘాజిపూర్, ఫరూకాబాద్ జిల్లాల్లో మసీదుల నుంచి ముయోజిన్ లు లౌడ్ స్పీకర్ ల ద్వారా అజాన్ చేయడానికి అనుమతులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్ట్ విచారణ జరిపింది. లౌడ్ స్పీకర్ల వాడకంపై పాలనాయంత్రాంగం విధించిన ఆంక్షలు పూర్తిగా ఏకపక్షమైనవని, రాజ్యాంగవిరుద్ధమైనవని, అది ప్రస్తుతం అమలులో ఉన్న కరోనా నిరోధక నిబంధనలకు ఏమాత్రం ఉల్లంఘన కాదని పిటిషనర్లు వాదించారు.
Source: www.organiser.org