Home News ఎస్సీ హోదా దుర్వినియోగంపై కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎల్.ఆర్.పి.ఎఫ్ నివేదిక 

ఎస్సీ హోదా దుర్వినియోగంపై కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఎల్.ఆర్.పి.ఎఫ్ నివేదిక 

0
SHARE

మ‌తం మారి ఎస్సీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న వ్యక్తులపై చర్యలు కఠినతరం చేసేందుకు చట్టాలను సవరించాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరింది. ఈమేరకు మంత్రికి ఒక రిప్రెజెంటేషన్ సమర్పించింది.

క్రైస్తవంలోకి మారి కూడా హిందూ ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన రిజ‌ర్వేష‌న్లను రాజకీయ లబ్ది కోసం దుర్వినియోగం చేస్తున్న ఘటనలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ నివేదికలో పొందుపరిచింది. అటువంటి రాజకీయ నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని లీగ‌ల్ రైట్ ప్రొటెక్ష‌న్ ఫోరం అనే సంస్థ కేంద్ర న్యాయ శాఖను కోరింది. ఈ మేర‌కు న్యాయ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌కు లేఖ‌ రాసింది.

ఇటీవల రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎంపీ జీవీల్ నరసింహారావు వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ ఇస్లాం లేదా క్రైస్తవంలోకి మారిన ఎస్సీలు  రిజర్వ్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అనర్హులు అని, అటువంటి వ్యక్తులపై తగిన సాక్ష్యాధారాలతో రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారని స్పష్టం చేస్తూ, అందుకు సంబంధించిన 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను ఉటంకించారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే ఆ వ్యక్తి ఎస్సీ హోదా కోల్పోయి బీసీ-సీ కేటగిరిలోకి వస్తాడు.

అయితే 2018 తెలంగాణ ఎసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి.. క్రైస్తవంలోకి మారి ఎస్సీ నియోజకవర్గాల నుండి నామినేషన్ దాఖలు చేసిన నలుగురు బీజేపీ అభ్యర్థులతో సహా మొత్తం 17 మందిపై అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. కానీ ఆ ఫిర్యాదుపై ఎన్నికల అధికారులు ఏమాత్రం స్పందించలేదు. ఇటీవల తెలంగాణలోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే ఎస్సీ హోదా దుర్వినియోగం అంశంలో కూడా జిల్లా విచారణ కమిటీ అధ్యక్షడిగా బాధ్యతలు కలిగిన జాయింట్ కలెక్టరుకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ హోదా దుర్వినియోగం అంశంలో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదుపై 2019లో గుంటూరు జాయింట్ కలెక్టర్ విచారణ జరిపినప్పటికీ ఇంతవరకు విచారణ తాలూకు వివరాలు కానీ, చర్యల వివరాలు కానీ తెలియలేదు. ఇకపోతే ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా స్పందన లేదు.  ఈ అంశాలన్నీ  కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో  లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పేర్కొంది.

1971లో 14.87 లక్షలున్న ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ జనాభా 2011లో 6.82 లక్షలకు పడిపోయిందని, అదే సమయంలో ఎస్సీ సామాజిక వర్గ ప్రజల జనాభా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోందని, అంతే కాకుండా క్రైస్తవ జనాభా తగ్గినట్టు రికార్డుల్లో నమోదవుతున్నప్పటికీ క్రైస్తవ విద్యాసంస్థలు, చర్చిలు, ఇతర సదుపాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది ఎలా సాధ్యమో పరిశీలించాలని ఫోరమ్  కోరింది.

ఈ నివేదికతో పాటు ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల్లోని ఈ క్రింది విధంగా సవరణలు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కోరింది :

1. క్రైస్తవుడిగా ఉంటూ కూడా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రంలో పోటీకి దిగే అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించి, ఎస్సీ కులధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసే అధికారం రిటర్నింగ్ అధికారులకు కల్పిస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో సవరణలు చేయాలి.

2. హిందువు ఎవరు, ముస్లిం ఎవరు, క్రైస్తవుడు ఎవరు అనే దానికి కచ్చితమైన నిర్వచనం ఇవ్వాలి. అలాగే ఒక హిందువు క్రైస్తవంలోకి మారాడు లేదా క్రైస్తవుడు హిందుత్వంలోకి మారాడు అని చెప్పేందుకు కావాల్సిన ప్రామాణికతలు గురించి వివరించాలి.

3. పేరుకు మతానికి సంబంధం లేదు అని, బైబిల్ చదివి చర్చికి వెళ్లినంత మాత్రాన క్రైస్తవుడు కాదని, మతం మార్చుకున్నంత మాత్రాన పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని కోర్టులు తరచూ చేస్తున్న ప్రకటనలను సాకుగా తీసుకుని భారీఎత్తున ఎస్సీ రిజర్వేషన్ల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, వీటిని అరికట్టాలి.

పై సూచనలు చేసిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్.. వీటిని పరిగణలోకి తీసుకుని నిజమైన ఎస్సీలకు సామాజిక న్యాయం చేయడం ద్వారా రాజ్యాంగ నిర్మాతల కలలను సాకారం చేయాల్సిందిగా కేంద్ర న్యాయశాఖ మంత్రిని కోరింది.