Home Telugu Articles మహా పరివర్తన

మహా పరివర్తన

0
SHARE

మౌలిక జాతీయతత్త్వ నిష్ఠ విస్తరిస్తోంది, మౌలిక సాంస్కృతిక ధ్యాస పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్ తదితర రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ క్రమానుగత విస్తరణను మరోసారి ధ్రువపరిచాయి. ఈ ఎన్నికల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం ఇబ్బడి ముబ్బడిగా ప్రభావంతం, ప్రభావశీలం కావడం నిరాకరింపజాలని నిజం. భారతీయ జనతా పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా, ఏకైక అఖిల భారత ప్రత్యామ్నాయంగా స్థిరపడిందన్నది కూడ భిన్నాభిప్రాయాలకు తావులేని పరిణామం. ఈ ఎన్నికల ఫలితాలు ఇలాంటి వైయక్తిక, రాజకీయ పరిణామాలకు మాత్రమే పరిమితం కాలేదు. జాతీయ జనజీవన వ్యవహారంలో, ఆలోచనా రీతుల్లో స్పష్టంగా ప్రస్ఫుటిస్తున్న పరివర్తనను ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి ధ్రువీకరించాయి. ఈ పరివర్తనకు 2014 నాటి లోక్‌సభ ఎన్నికల ఫలితాల ద్వారా మరోసారి అంకురార్పణ జరిగింది. దేశంలోని వోటర్లలో దాదాపు ఐదవ వంతు మంది పాల్గొన్న ఈ శాసనసభల ఎన్నికల్లో పరివర్తన స్వరూప స్వభావాల ‘దిశ’ మరింత స్పష్టమైంది. అధికాధిక వోటర్లలో రాజకీయాలకు అతీతమైన జాతీయతా నిష్ఠ వెల్లివిరుస్తోంది. ఈ నిష్ఠ కేవలం మతదాన- పోలింగ్- సమయానికి మాత్రమే పరిమితం కావడం లేదు. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల్లో కావచ్చు. ఇప్పటి ఎన్నికల్లో కావచ్చు… ఈ జాతీయతా నిష్ఠ పోలింగ్‌కు ముందు, పోలింగ్ తర్వాత ‘మతదాతల’- వోటర్ల- జీవన వ్యవహారంలో కొనసాగుతోంది. ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడిపోతున్నారు? అన్న మీమాంస ఐదేళ్ల రాజకీయానికి పరిమితం. కానీ, జా తీయతత్త్వ నిష్ఠ పట్ల సాధారణ ప్రజల్లో అవగాహన పెరుగుతుండడం 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి ప్రస్ఫుటిస్తున్న పరివర్తన. ఏ జాతికైనా ఆ జాతి ప్రజల సమష్టి స్వభావం ప్రాతిపదిక. ఈ సమష్టి స్వభావం ‘సం స్కృతి’. ఎవరు గుర్తించినా, గుర్తించకున్నా సంస్కృతి ప్రాతిపదిక మాత్రమే. సంస్కృతి భూమికపై మాత్రమే ‘జాతి’ అనాదిగా వికసించడం చరిత్ర. ప్రపంచంలోని అన్ని జాతులకు అనాదిగా వర్తిస్తున్న వాస్తవం ఇది. సాంస్కృతిక భూమిక లేని ‘జాతులు’ వేళ్లు దిగడానికి ‘నేల’ లేని వృక్షాల వలె ఎదగవు, అంతరించిపోయాయి, పోతున్నాయి. సంస్కృతిలో మతాలు, భాషలు, సంప్రదాయాలు, వ్యవసాయాలు, వాణిజ్యాలు, విద్యలు, వివేచనలు, ధర్మం, ఆధ్యాత్మికం ఇంకా ఎన్నో ఎనె్నన్నో భాగాలు మాత్రమే. మనదేశంలోని సామాన్య మానవులు అనాదిగా ఈ సంస్కృతి నిష్ఠులు. కానీ, పదవులు మాత్రమే పరమావధి అయిన నాయకులు, పక్షాలు మొత్తం సంస్కృతిని, జాతీయతను రాజకీయం పరిధిలో ఇరికించారు. ఈ వైపరీత్యం దశాబ్దులుగా నడిచింది. అందువల్ల కుల రాజకీయం, మత రాజకీయం, వాణిజ్య రాజకీయం, అవినీతి రాజకీయం దేశ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేశాయి. జాతీయ జీవనశ్వాస వీటితో కాలుష్యగ్రస్తమయమైంది. ఈ కాలుష్యాల నుంచి విముక్తి లభిస్తున్న సంకేతాలు 2014 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి లభిస్తున్నాయి. ఈ విముక్తికి భారతీయ జనతాపార్టీ మాధ్యమమని ప్రజలు గుర్తించినట్టు ‘ఉత్తర’ విజయం మరోసారి రుజువుచేసింది. ఇదీ దీర్ఘకాల ప్రభావం.

నరేంద్ర మోదీ తొలిసారి ప్రవేశించడానికి ముందు లోక్‌సభ ప్రధాన ద్వారం వద్ద ఆగి వంగి మాతృభూమికి నమస్కరించడం, భూమాతను స్మరించడం.. ఇలా జాతీయతా నిష్ఠ పెరుగుతోందనడానికి తొలి సంకేతం. ఈ నిష్ఠ ఈ రెండున్నర, మూడేళ్ల కాలవ్యవధిలో మరింతగా ప్రస్ఫుటించడం ‘ఉత్తర’ సమర విజయం.. ఆదివారం సాయంత్రం కొత్త డిల్లీలోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో విజయవేదిక నుంచి ప్రసంగించిన మోదీ ఈ జాతీయతా తత్త్వాన్ని, సాంస్కృతిక నిష్ఠను మరోసారి ఆవిష్కరించాడు. రాజకీయ చట్రంలో ‘జాతీయత’ను కుదించిన దశాబ్దుల వైపరీత్యానికి భిన్నంగా ‘జాతీయత’ పరిధిలో ‘రాజకీయం’ కేవలం ఒక అంశమన్న సాంస్కృతిక ప్రాధాన్యం నరేంద్ర మోదీ ఈ ఫాల్గున పౌర్ణమి రోజున హోలీ పండుగ సందర్భంగా చేసిన ‘విజయ ప్రసంగం’లో ప్రకటితమైంది. ఇదీ దేశప్రజల మనోభీష్టం, మనోభీష్టంలో నిహితమై ఉన్న పరమలక్ష్యం. యోగా దినోత్సవం ఈ దేశపు మౌలిక జాతీయతత్త్వమైన ‘కర్మయోగ’ సంస్కృతికి ప్రతీక మాత్రమే.

ఈ ‘కర్మయోగం’ నరేంద్ర మోదీ ఆదివారం నాటి ప్రసంగంలోని ప్రధాన ఇతివృత్తం. ‘పరిశ్రమకు పరాకాష్ఠ’ను సాధించడం తమ లక్ష్యమని 2014 ఎన్నికల నాటి ‘సంకల్ప పత్రం’లో తాము పేర్కొన్న సంగతిని మోదీ పునరుద్ఘాటించడం ‘జాతీయతా నిష్ఠకు ప్రమాణం’. ‘పరిశ్రమకు, శ్రమజీవన ప్రవృత్తికి పరాకాష్ఠ’కు మరోపేరు- ‘కర్మయోగం’. అట్టడుగు స్థాయి ప్రజల బతుకులలో ప్రగతిని సుగతి వికసింప చేయడానికి శ్రమ జీవన స్వేద జలాలను నిరంతరం సృష్టించే ప్రభుత్వం పనితీరు ‘కర్మయోగం’. ఈ కర్మయోగ ఆధునిక ప్రవక్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కార్యకలాపాలకు కేంద్రం ఉత్తరప్రదేశ్. ‘అంత్యోదయం’- అట్టడుగున ఉన్న నిరుపేదల అభ్యుదయం- ప్రభుత్వ కర్మయోగానికి లక్ష్యమన్నది మోదీ పునరుద్ఘాటించిన మాట. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయంతి సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు సమర్పించిన ‘విజయ హారం’ ఈ కర్మయోగ ఫలితం. పదజాలంలో పరివర్తన, ప్రవర్తనలో పరివర్తన, లక్ష్యాల ఎంపికలో పరివర్తన, కార్యపద్ధతిలో పరివర్తన. పాక్షిక దృష్టి ‘సమగ్ర దార్శనికత’గా రూపొందుతోంది. ఈ సమగ్ర తత్త్వం ఈ దేశపు మౌలిక సంస్కృతి. ఈ ‘సంస్కృతి’ భూమికపై దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవం వైపు, 2022వ సంవత్సరం వైపు వడివడిగా అడుగులు వేయాలన్న సంకల్పం నరేంద్ర మోదీ ఆదివారం పునరావిష్కరించిన కర్మయోగం. అధికుల మద్దతుతో గెలిచినప్పటికీ అందరి మద్దతుతో సర్వజనహిత సమగ్ర పాలనను సమకూర్చనున్నట్టు మోదీ చెప్పడం పరివర్తనకు పరాకాష్ఠ..

రాజకీయ విభేదాలను మరపించే రీతిలో జాతీయ సమైక్య సంకల్పం మోదీ ప్రసంగానికి ఇలా ఇతివృత్తమైంది. సామాజిక మాధ్యమాలలో ‘స్వచ్ఛత’ గురించి చర్చ జరుగుతోంది. దేశ సరిహద్దుల రక్షణ గురించి చర్చ జరుగుతోంది. సేంద్రియ వ్యవసాయం గురించి మీమాంస మొదలైంది. సేంద్రియ వ్యవసాయానికి ఆధారమైన ఆవు గురించి, అడవి గురించి చర్చ జరుగుతోంది. అవినీతికి విరుగుడుగా రద్దయిన పెద్దనోట్ల కథ ‘జనవాణి’గా వినిపిస్తోంది. ఈ దేశపు వౌలిక తత్త్వం గురించి మళ్లీ మథనం మొదలైంది. 2014 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోను పరివర్తన పెరుగుతూనే ఉంది. సరిహద్దులను సంరక్షిస్తున్న సైనికులను నిరసించిన ఐరోమ్ షర్మిల అనే మహిళ మణిపూర్‌లో ఓడిపోవడం జనం మనోభీష్టానికి ఒక ఉదాహరణ మాత్రమే. సైనికులు సరిహద్దులకు మాత్రమే కాదు, ఈ జాతి సంస్కృతికి కూడా రక్షకులు. వోటర్లకు రాజకీయ ధ్యాస కంటే సాంస్కృతిక నిష్ఠ పెరిగింది, పెరుగుతోంది..