Home News ముస్లిం మహిళలు హిజబ్ ధరించడాన్ని నిషేధించిన ఇస్లామిక్ విద్యాసంస్థ

ముస్లిం మహిళలు హిజబ్ ధరించడాన్ని నిషేధించిన ఇస్లామిక్ విద్యాసంస్థ

0
SHARE
కేరళ కోజికోడ్ లోని ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ తమ ఆధ్వర్యంలో నడిచే 100కు పైగా విద్యా సంస్థల్లో ముస్లిం మహిళలు హిజబ్ ధరించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తమ విద్యా సంస్థల పరిపాలనా అధికారులకు నిషేధాన్ని అమలుచేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.
ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో లక్షకు పైగా విద్యార్థులు పలు రకాల కోర్సులు అభ్యసిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి తమ విద్యార్థులెవరూ ముఖాన్ని కప్పివుంచే వస్త్రాలు (హిజబ్) ధరించరాదని సంస్థ యాజమాన్యం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అయితే ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ తీసుకున్న ఈ నిర్ణయంపై పలు ఇస్లామిక్ అతివాద సంస్థలు విమర్శలు ఎక్కుపెట్టాయి. సంస్థ తీసుకున్న నిర్ణయం మతపరమైన హక్కుల విషయంలో అనవసర జోక్యం అని కేరళకు చెందిన సున్నీ ముస్లిం సంస్థ సమస్త కేరళ జెమ్-ఇయ్యతుల్ ఉలేమా అభిప్రాయపడింది. ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ సంస్థ ఉపాధ్యక్షురాలు ఫాతిమా తాహిలియా మాట్లాతుడూ.. ఎవరు ఎలాంటి వస్త్రధారణ పాటించాలి అనేది వారి వ్యక్తిగతం అని, దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు అని అభిప్రాయపడ్డారు.
ఈ విమర్శలను ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు డా. పీ.ఏ. ఫజల్ గఫుర్ కొట్టిపారేశారు. ప్రస్తుత ఉద్యోగాలలో హిజబ్ కారణంగా ఏర్పడే అసౌకర్యంతో  మహిళలు ఉద్యోగావకాశాలు కోల్పోరాదు అన్నదే తమ ఉద్దేమని స్పష్టం చేశారు.
అయితే.. కొందరు ఇస్లామిక్ నాయకులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముజాహిద్ బాలికల ఉద్యమ నాయకురాలు ఖదీజా నర్గీస్ ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖాన్ని దాడుకోవడం అంటే తమ అస్తిత్వాన్ని కనిపించకుండా కప్పిపుచ్చడమే అని, ఇవి పలు నేరపూరిత చర్యలకు దారితీసే అవకాశం ఉందని ఆమె అన్నారు.
ఇస్లాంలో నిర్దిష్టమైన వస్త్రధారణ నియమాలు ఏవీ లేవని, ముస్లిం మహిళలు ప్రార్ధన చేసే సమయాల్లో ముఖాన్ని కప్పుకోమని ఇస్లాం ఎక్కడా చెప్పలేదని, హజ్ యాత్ర సందర్భంలో కూడా ముస్లిం మహిళలు ముఖాన్ని దాచుకోరని, ముఖాన్ని కప్పుకోమని కోరే కొన్ని వర్గాలతీరు ఆక్షేపణీయం అని ఆమె అన్నారు.
కొచ్చి ఇన్ఫో పార్కులో పనిచేస్తున్న ముబీనా అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మాట్లాడుతూ హిజబ్ ధరించడం పనిచేసే ప్రదేశాల్లో అవరోధంగా ఉంటుందని అన్నారు. ఇటువంటి వస్త్రధారణ నియమాలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయినులకు కూడా తగవు ఎందుకంటే ముఖాముఖీ చూడకుండా చదువు చెప్పడం, నేర్చుకోవడం అనే ప్రక్రియ చాలా కష్టతరమైనదని ముబీనా అన్నారు.
Source: First Post