Home Telugu Articles మన ఆధ్యాత్మిక పీఠాలు ఏం చేస్తున్నాయి? 

మన ఆధ్యాత్మిక పీఠాలు ఏం చేస్తున్నాయి? 

0
SHARE

– సామవేదం షణ్ముఖ శర్మ 

సాధారణంగా మన సనాతన ధర్మంలో ఏ విపరీత సంఘటన జరిగినా – పీఠాధిపతులు ఏం చేస్తున్నారు?’’ అని వెంటనే ప్రశ్నిస్తుంటారు.  కానీ వారేం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం ఎందరు చేస్తున్నారు?  

ముందుగా పీఠాధిపతుల బాధ్యత  పరంపరాగతమైన పీఠమర్యాదలను కాపాడడం, సంప్రదాయ పరిపాలన…వాటి హద్దును అతిక్రమించరు. కారణం అవి శాస్త్రజనితం. వాటిని నేటికీ పాటిస్తున్నారు. అది ప్రధానం.  

తమ భాషణలతో ధర్మాన్నీ, జ్ఞానాన్నీ ప్రబోధించడం వారి మరియొక కర్తవ్యం. దానినీ మెండుగా చేస్తూనే ఉంటారు. ఎందరో వాటి నుండి నేర్చుకుంటారు.  

పీఠంలో చేయవలసిన పూజాదికానుష్ఠానాలు సక్రమంగా నిర్వహించడం ద్వారా దైవీశక్తిని ప్రసరింపజేస్తారు. హిందువులుగా ఉన్నవారు ముందు ఈ హిందూ విధానాలను విశ్వసించాలి. వాటి ప్రభావాలను గ్రహించాలి.  

ధర్మ- జ్ఞానయుక్తమైన శాస్త్రాలలో వేత్తలను సత్కరించి, ప్రోత్సహించి వాటి ద్వారా సమాజంలో ప్రబోధాన్ని కలిగించే విధంగా పీఠాధీశ్వరులు అనుగ్రహిస్తారు.  

త్యాగపూర్వకంగా, నిస్వార్థంగా యతిధర్మాన్ని అనుష్ఠిస్తూ, కేవలం లోకక్షేమం కోసం తమ తపశ్శక్తిని ధారపోస్తారు.  

పీఠ నిర్వహణలో ఎన్నో విద్యా సంస్థలు, వైద్య సంస్థలు విజయవంతంగా నడుస్తూ ఎందరికో విద్యారోగ్యాలను ప్రసాదిస్తున్నాయి. ఈ సేవకి మతాన్ని ముడిపెట్టకుండా, మార్పిడులు చేయకుండా నిర్వహించడం హిందూమత పీఠాల ప్రత్యేకత.  

పరివ్రాజక ధర్మాన్ని అనుసరిస్తూ దిగ్విజయ యాత్రలు చేస్తూ, ఎందరికో స్ఫూర్తినిస్తూ, ధర్మబోధనను చేస్తూ వారందిస్తున్న జ్ఞానం అపారం. అవి గ్రంథాలుగా కూడా వెలువడి దేశవిదేశ మేధావులచేత అధ్యయనం చేయబడుతున్నాయి.  

కొన్ని పీఠాల సంప్రదాయంలో రాజకీయ, సామాజిక జోక్యాలకు అనుమతి ఉంటుంది. దానిననుసరించి ప్రభావితం చేస్తున్న మహాత్ములైన పీఠాధిపతులూ ఎందరో ఉన్నారు. సత్పరిపాలనను, నీతిని, వివక్ష లేకుండా అందరి క్షేమాన్ని అందించే యోగి సంప్రదాయాల వారూ ఉంటారు.  

ఇంకొన్ని సంప్రదాయాల్లో రాజకీయాల, సామాజిక ఉద్యమాల జోలికి పోకుండా  హంగూ, ఆర్భాటాలు, ప్రచారాలూ లేకుండా ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్న పీఠాలు కూడా ఉన్నాయి.  

వందల ఏళ్ళ అవిచ్ఛిన్న పరంపర కలిగిన ఎన్నో సంప్రదాయ పీఠాలు ఎన్నో దాడులను, విధ్వంసాలను ఎదుర్కొని కూడా నిలబడ్డాయి. వాటి ద్వారా ఎందరో మహాత్ములు తమ దివ్య చరిత్రలను, విజయాలను నేటి తరాలకు స్ఫూర్తిగా అందించారు.  

సంప్రదాయాలపై అవగాహన లేనివారు, శాస్త్రాధ్యయనం చేయనివారు అరకొర తెలివితో, సంస్కరణ పేరుతో ధర్మ స్వరూపాన్ని గ్రహించలేక  పీఠాల మహోద్యమాలనూ, వాటి మౌన మహా తపఃఫలాలను చూడలేకపోతున్నారు.  

మరోవైపు  ఇతర మతసంస్థల జోలికి వెళ్ళని ప్రభుత్వనేతలు  హైందవ శ్రద్ధాకేంద్రాల వ్యవస్థలను తారుమారు చేస్తున్నారు. వారికి సంబంధించని, అవగాహనలేని ఆలయశాస్త్ర విషయాలలో పీఠాధిపతులనే సంప్రదించాలనీ, వారు చెప్పినట్లు వ్యవహరించాలనీ ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేని నేతలు  స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. నాస్తిక మేధావులు, నాస్తిక పాలకులు కూడా ఆస్తిక ప్రధానమైన ఆలయాల విషయాలపై మాట్లాడడం తగదు – అన్న ఇంగితజ్ఞానం వారికీ, ప్రజలకీ కూడా లేదు.  

మన పీఠాల ప్రశస్తి మనం తెలుసుకుని, వారి ఆధీనంలోనే సమస్త మతకేంద్రాది వ్యవస్థలు ఉండే విధంగా ఉద్యమించాలి. ఏ ఆలయ సంప్రదాయం ఏ పీఠ సంప్రదాయంలో ఉందో, ఆ పీఠం వారి పర్యవేక్షణలో ఆ ఆలయం ఉండాలి. ప్రాచీనపరంపర కలిగిన పీఠాలకు ప్రాధాన్యమివ్వాలి.  

ఇందులో అన్ని పీఠాల మధ్య పరస్పర సామరస్య, సమన్వయ, గౌరవాలు ఉండాలి. ముందుగా హిందువులందరూ పీఠాల వ్యవస్థలోని చరిత్రనీ, గొప్పతనాన్నీ గ్రహించితేనే ఇది సాధ్యమౌతుంది. ప్రభుత్వాలకు కూడా ధర్మ పరిరక్షణ కేంద్రాలైన పీఠాలను సంప్రదించకుండా హిందూ మతవ్యవస్థలపై నిర్ణయాలు తీసుకోరాదని, ప్రజలే ఓటు బలంతో, ఉద్యమాలతో కట్టడి చేయాలి.  

ఎన్నో ప్రతికూలతల, అవరోధాల నడుమ కూడా తపశ్శక్తితో, ధర్మబలంతో, జ్ఞానదీధితితో ప్రకాశిస్తున్న పీఠాలకుపీఠాధీశ్వరులకు ప్రణామాలు సమర్పించుకుందాం.  

ఋషిపీఠం సౌజన్యంతో….