– సత్యదేవ
మనకున్న ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. దీన్నే గణేశచతుర్థి అని కూడా అంటారు. ఏడాదిలో నాలుగు చవితి (చతుర్థి) తిథులు గణేశపరంగా కనిపిస్తాయి. మొదటిది ప్రతినెల పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా లెక్కించి పూజ చేస్తారు. ఈ రోజు చేసే గణేశపూజ కష్టాలను తొలగిస్తుందని పెద్దల మాట. రెండవది దూర్వా గణేశ వ్రతం. ఇది ఇరవై ఒక్క రోజుల పాటు చేస్తారు. దీన్ని శ్రావణ కార్తీక శుద్ధ చతుర్థినాడు చేస్తారు. మూడవది సిద్ధి వినాయక వ్రతం. భాద్రపద శుద్ధ చతుర్థినాడు చేస్తారు. దీన్నే వినాయకచవితి అంటాం. నాలుగవది కపర్ది వినాయక వ్రతం. శ్రావణ శుద్ధ చతుర్ధి నుంచి భాద్రపద శుద్ధ చతుర్థి వరకు నెలరోజులపాటు ఒంటిపూట భోజనం చేస్తూ కపర్ది వినాయకుణ్ణి పూజిస్తారు.
మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఒకే పండుగను కొద్దిపాటి తేడాలతో చేస్తూ ఉంటారు. ఈ విధమైన సమాన ఆచార వ్యవహారాలు మన దేశ ప్రజలలో ఉన్న సాంస్కృతిక ఐక్యతకు నిదర్శనం. సాంస్కృతిక ఐక్యత దేశ సమైక్యతకు మూలం. మన పండుగలన్నింటికీ ఆధారం వేదం. వేద రహస్యాలను పురాణాలుగా, పురాణ విషయాలను పండుగలు, వ్రతాలు, నోములు, ఉత్సవాలుగా మలచి తరతరాలుగా సామాన్య ప్రజానీకానికి అలవాటు చేసి, వాళ్ళకు విజ్ఞానం, వినోదం, ఆర్థిక పుష్టి, భావ సమైక్యత, పర్యావరణ స్పృహ, నీతినియమాలు, ఆరోగ్య విజ్ఞానం మొదలైన వన్నీ బోధించే ఒక పెద్ద వ్యవస్థే హిందూమతం. దానిలో ఒక ముఖ్య అంశం వినాయకచవితి. నిజానికి మన పండుగలన్నీ వేటికవే చిన్నచిన్న సంస్కృతులని చెప్పవచ్చును. ప్రతిఒక్క పండుగలో జీవితానికి అవసరమైన అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. అలాంటి పండుగలు, ఆచారాలన్నింటిని కలిపి భారతీయ లేదా హిందూ సంస్కృతి అంటాం.
వినాయకచవితి – మత విజ్ఞానం
వేదాలు వర్ణించే బ్రహ్మణస్పతి పురాణాల్లో గణపతిగా కనిపిస్తాడు. ఇందుకు ప్రమాణం ‘గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే…’ మొదలైన వేద మంత్రాలు. గణపతి అంటే గణమునకు పతి. గణము అంటే సమూహం. సత్వ, రజస్, తమో గుణాల గణమునకు అధిపతి.
వినాయకచవితి – ఖగోళ విజ్ఞానం
మన పండుగలన్నీ నక్షత్ర గమనంతో ముడిపడి ఉన్నాయి. అందువల్ల అవి ప్రకృతి నియతికి అనుగుణంగా ఉంటాయి. అంటే మన పండుగలకు వైజ్ఞానికమైన ఆధారం ఉందని అర్థం. ఈ కింది వేద మంత్రాలే అందుకు ఋజువు-
1. ‘ప్రాతర్యావాణో ప్రథమా యజద్వం’ (ఋగ్వేదం హ 77.1) – ఉదయాన్నే చీకటితో ఏ నక్షత్రం ఉదయిస్తుందో ఆ నక్షత్ర దేవతను పూజించాలి. పండుగ జరుపుకోవాలి.
2. ‘నోతన సాయమస్తి దేవాయా అజుష్టం’ (ఋగ్వేదం హ 77.1) – ఒక రోజున ఉదయాన్నే కనిపించిన చుక్క ఆరు నెలల తరువాత సాయం కాలం పొద్దుగూకిన సమయంలో తూర్పున ఉదయిస్తుంది. రెండవపక్షంగా ఆనాడు ఆ నక్షత్ర దేవతకు పూజ, పండుగ చేయవచ్చు.
ఈ రెండు సూత్రాలను అనుసరించి మన దేవత లకు పూజలు, పండుగలు చేయడం ఆనవాయితీ. వినాయకచవితి కూడా ఇలాగే జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ పంచమినాడు సప్త ఋషులు అనే ఏడు నక్షత్రాల సమూహం (గ్రేట్ బేర్ లేదా బృహత్‌ఋషి) సూర్యుడు ఉదయించడానికి ముందు తూర్పున ఉదయిస్తాయి. ఆ రోజున ఋషిపంచమి ప్రతం. దానికి ముందురోజు, అంటే భాద్రపద శుద్ధ చతుర్థి (చవితి) నాడు వినాయకుని ఆకారాన్ని గుర్తుకు తెచ్చే అమరికలో చుక్కలు సప్త ఋషుల సమూహానికి పడమటివైపు తూర్పు దిక్కున ఉదయి స్తాయి. పై సూత్రాన్ని అనుసరించి ఆనాడు వినాయకుడికి పూజ చేయాలి. వినాయక చవితితో మన పండుగల సంవత్సర చక్రం ప్రారంభమవు తుంది. అందుకే ఏ పని చేసినా ముందు వినాయకుడికి పూజ చెయ్యడం మనకు అలవాటుగా మారింది. ఈ విధంగా మన ఆచారాలు, పండుగ లన్నీ నక్షత్ర గమనం మీద, అంటే ప్రకృతి లయ మీద ఆధారపడి ఉన్నాయి. అందుకని ఆ పండుగలు చేయడమంటే ప్రకృతి నియతికి అనుగుణంగా నడుచుకోడమని అర్థం. దీన్నే శాస్త్రీయత (సైంటిఫిక్ టెంపర్) అని అంటారు. అలాంటి శాస్త్రీయత కలిగిన జీవన విధానాన్ని అనుసరించడంవల్ల మనకు కొన్ని ప్రయోజనాలు కలిగాయి. వినాయకచవితినాడు ఏర్పాటు చేసే మంటపానికి పై కప్పుగా వెదురుబద్దల చట్రాన్ని అమర్చి, దానికి దానిమ్మ, వెలగ, ఉమ్మెత్త మొదలైన గుండ్రటి కాయలను వేలాడదీస్తాము. అలా గుండ్రటి కాయలను కట్టిన వెదురుబద్దలచట్రాన్ని ‘పాలవెల్లి’ అంటారు. ఈ పాలవెల్లి నక్షత్ర మండలానికి సంకేతం. పాలవెల్లిని ఖగోళశాస్త్రంలో ‘మిల్కీ వే’ అంటారు. దీనికే ‘పాలపుంత’ అని కూడా పేరు. ఈ విధంగా మన పండుగలు సరళమైన, వినోదకర మైన, అందమైన పద్ధతుల ద్వారా శాస్త్ర విజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అందిస్తున్నాయి.
వినాయకచవితి – వృక్ష, ఔషధ, ఆరోగ్య విజ్ఞానం
వినాయక పూజలో ఏకవింశతి (21) పత్ర పూజ ఒక భాగం. అంటే ఇరవై ఒక్క రకాల మొక్కల ఆకులతో పూజ చేయాలి. ఈ మొక్కలన్నీ అందం, సువాసన, ఔషధ గుణాలు, ఇతర ప్రయోజనాలు కలిగినవి. వీటిని దేవుడి పూజలో వినియోగించడం ద్వారా ఆ మొక్కలపట్ల పవిత్ర భావన ఏర్పడు తుంది. ఆ భావనవల్ల ఆ మొక్కలను నిత్యజీవితంలో ఉపయోగించేప్పుడు తగిన జాగ్రత, భద్రతతో వాడతాం. ఇష్టంవచ్చినట్లు దుర్వినియోగం చేయకుండా ఉంటాం. ఇది మన ఆచారాలు, పండుగలకున్న మరొక ముఖ్యమైన ప్రయోజనం. పండుగల ద్వారా అనేక మొక్కలను పరిచయం చేయడంవల్ల మనకు వాటి ఆకారం, రంగు, వాసన, రుచి మొదలైన భౌతిక, రసాయనిక ధర్మాల పరిచయం కలుగుతుంది. వాటిని ఉపయో గించడం, పెంచడంలో ఆసక్తి కలుగుతుంది. ఇలా సాధారణ ప్రజల ఆలోచనా స్థాయి, వస్తు వినియోగం పెరిగి వారి జీవిత ప్రమాణం, నాణ్యత మెరుగవుతాయి. నిజమైన అభివృద్ధి, సంపద అంటే ఇదే. ఆనందంపొందడం, సుఖపడడం అంటే ఇదే. మన పండుగలు మనకు అటువంటి సంపదను ఇవ్వడమేకాకుండా మన జీవితాల నాణ్యతను పెంచుతున్నాయి. కానీ ఈ లాభాలన్నీ ఆ పండుగలను కుటుంబ సమేతంగా, స్వయంగా చేసినప్పుడే పొందగలం. అంతేగానీ టీవీల్లో చూస్తూ కూచుంటే పొందలేం. మొక్కలను, ఆకులను, పూవుల్ని స్వయంగా చూసి గుర్తించడానికి ప్రయత్నించాలి. ఆ తరువాత వాటిలో కొన్నింటినైనా మన పెరటిలోనో, బాల్కనీలోనో పెంచడానికి ప్రయత్నించాలి. కనీసం పది మొక్కలు పెంచగలిగితే దానికి గణేశవనం అనే పేరు పెట్టడం మంచిది. ఈ విధంగా మనం పర్యావరణాన్ని పరి రక్షించడమేకాదు, దాన్ని వృద్ధిచేసి మన ఔషధ అవసరాలను, ఆహార అవసరాలను కూడా తీర్చే దశలో ముందుకు సాగిన వాళ్ళమవుతాం. దేశప్రగతి అంటే ఇదే.
సమాజాన్ని సమైక్యంగా ఉంచడంలో మన పండుగలకు ప్రముఖ పాత్ర ఉంది. నేడు మన దేశంలో అనేక పట్టణాలు, నగరాల్లో వినాయక ఉత్సవాలు చాలా పెద్దుఎత్తున జరుపుతున్నారు.