Home Telugu Articles మానవత్వమే మతం, కశ్మీరులో సామరస్యం

మానవత్వమే మతం, కశ్మీరులో సామరస్యం

0
SHARE

కల్లోల కశ్మీరంలో ఇప్పుడిప్పుడే వెలుగు రేకలు విచ్చుకుంటున్నాయి. దశాబ్దాల క్రితం కకావికలమైన కశ్మీరీ పండితుల కుటుంబాలను అక్కున చేర్చుకోవడంతోపాటు- వారిలో ధైర్యం, భరోసా కలిగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ)- భారతీయ జనతాపార్టీ (భాజపా) సంకీర్ణ ప్రభుత్వంతోపాటు, స్థానిక ముస్లిములు, వేర్పాటువాదులు ఈ దిశగా చొరవ చూపడం సహర్షంగా స్వాగతించదగిన పరిణామం. కశ్మీరీ పండితుల కుటుంబాలకు నివాసం కల్పించేందుకు ప్రత్యేక కాలనీలు నిర్మించాలని రాష్ట్ర శాసనసభ, శాసన మండలి జనవరిలో ఏకగ్రీవంగా తీర్మానించాయి. హిందువుల పర్వదినమైన మహాశివరాత్రి సందర్భంగా వేర్పాటువాదులు ఫిబ్రవరి 24న తలపెట్టిన బంద్‌ పిలుపును ఉపసంహరించుకోవడం విశేషం. బుర్హన్‌వాని ఎన్‌కౌంటర్‌ అనంతరం వేర్పాటువాదులు ప్రతి శుక్రవారం బంద్‌ పాటిస్తున్నారు. మహాశివరాత్రి శుక్రవారం రావడంతో, పర్వదినాన్ని కశ్మీరీ పండితులు స్వేచ్ఛగా జరుపుకొనేందుకు స్థానిక ముస్లిములూ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం దేశ విదేశాల్లో స్థిరపడ్డ వెయ్యిమందికి పైగా కశ్మీరీ పండిత ప్రముఖులు, మేధావులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలకు శుభాకాంక్షల సందేశాలు పంపింది. ఈ పరిణామాలు చిన్నవిగానే కనబడవచ్చు, వీటి ప్రభావం మాత్రం అపరిమితం!

సుహృద్భావపు అడుగులు

కశ్మీరీ పండితులది వ్యధాభరిత గాథ. ఆ గడ్డపై వేల సంవత్సరాల చరిత్ర వారి సొంతం. కానీ, రాజకీయ కల్లోలం కారణంగా స్వస్థలంలోనే పరాయివారిగా, శరణార్థులుగా బతకాల్సిన దుర్భర పరిస్థితి వారికి ఎదురైంది. కశ్మీరీ సంస్కృతిలో వారి ఉనికి ఒక భాగం. సంస్కృతీ సంప్రదాయాలకు, సోదరభావానికి, మత సామరస్యానికి కశ్మీరీ పండితులు పెట్టింది పేరు. వారు లేని కశ్మీర్‌ అసంపూర్ణం. వేర్పాటువాదులు సైతం కాదనలేని వాస్తవమిది. భౌగోళికంగా జమ్ము-కశ్మీర్‌-లడఖ్‌ ప్రాంతాలుగా విస్తరించిన రాష్ట్రంలో హిందూ, ముస్లిం, బౌద్ధ మతాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. జమ్ములో హిందువులు, లడఖ్‌లో బౌద్ధులే అత్యధికులు. ఇందుకు భిన్నంగా లోయలో ముస్లిములు, కశ్మీరీ పండితులు ఉన్నారు. కశ్మీర్‌ లోయలోని అనంతనాగ్‌, బారాముల్లా, శ్రీనగర్‌, పుల్వామా, సోపూర్‌ తదితర ప్రాంతాల్లో ముస్లిములదే పైచేయి అయినప్పటికీ, పండితులూ పెద్దసంఖ్యలోనే విస్తరించి ఉన్నారు. అటు రాజకీయంగానూ వారి ప్రభావాన్ని ఏ పార్టీ విస్మరించలేని పరిస్థితి ఒకప్పుడు ఉండేది. 1990 జనవరిలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పండితుల కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. పొట్ట చేతపట్టుకుని బతుకుజీవుడా అంటూ చెట్టుకొకరు, పుట్టకొకరుగా రాష్ట్రాన్ని వీడి వెళ్లారు. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. ఉగ్రవాదుల దాడులకు వెరవకుండా సుమారు 3,500 కుటుంబాలు లోయలోని వివిధ ప్రాంతాల్లో నేటికీ జీవనం సాగిస్తున్నాయి. తమ జీవితాలు కశ్మీరుతో పెనవేసుకు పోయాయన్నది వారి ప్రగాఢ విశ్వాసం. బెదిరింపులకు భయపడకుండా ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని వారు జరుపుకొంటున్నారు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాదీ పండగకు సిద్ధమయ్యారు. పండితుల కుటుంబాల అభ్యర్థన మేరకు సయ్యద్‌ అలీ గిలానీ, మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌, యాసిన్‌ మాలిక్‌ తదితర వేర్పాటువాద నాయకులు బేషరతుగా బంద్‌ పిలుపును ఉపసంహరించుకున్నారు. స్థానిక ముస్లిములూ పండగను స్వేచ్ఛగా, నిర్భయంగా జరుపుకొనేందుకు తమవంతు సహకారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వమూ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని సుంబల్‌ పట్టణ ముస్లిములు మతసామర్యానికి నిదర్శనగా నిలిచారు. ఉగ్రవాదుల దాడుల్లో దెబ్బతిని జీలం నది ఒడ్డున శిథిలావస్థలో గల నందకిశోర్‌ శివాలయాన్ని వారు పునరుద్ధరించారు. రంగులతో ఆలయాన్ని తీర్చిదిద్దారు. పండగకు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. అంతేకాక ఇతర ప్రాంతాల్లో ఉన్న పండితుల కుటుంబాలు తిరిగి సొంతగడ్డకు రావాలని కోరుతూ నినాదాలు చేశారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఎలాంటి ఇబ్బందీ రానివ్వబోమని భరోసా ఇచ్చారు. సామరస్యంగా ఉంటూ సోదరభావంతో జీవిద్దామని పిలుపిచ్చారు. చాలాకాలం తరవాత దాదాపు కశ్మీర్‌ లోయ అంతటా మహాశివరాత్రి పండగ ప్రశాంతంగా, వైభవంగా జరిగింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ పండితుల కుటుంబాలు సైతం లోయకు విచ్చేశాయి. 1990 దాడుల తరవాత లోయలో ఇంత భారీయెత్తున పండగ జరుపుకోవడం ఇదే ప్రథమం. ప్రధాన పార్టీలైన పీడీపీ, భాజపా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, సీపీఐ(ఎం) ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాయి.

పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పీడీపీ-భాజపా సర్కారు అన్ని ఏర్పాట్లూ చేసింది. భద్రతను కట్టుదిట్టం చేసింది. పండితుల కుటుంబాలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం ఈ ఏడాది ప్రత్యేకత. శివుడి రూపంతో ముద్రించిన శుభాకాంక్షల కార్డులను ప్రభుత్వం పోస్టులో పంపింది. దేశవిదేశాల్లో స్థిరపడ్డ పండితుల కుటుంబాలకు, వివిధ రంగాల ప్రముఖులకు శుభాకాంక్షల సందేశాలు వెళ్లాయి. పండితులను కశ్మీరీ జనజీవన స్రవంతిలో భాగస్వాములను చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి 2016లో కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి బాగా క్షీణించింది. రాష్ట్రవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా లోయలో తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య జరిగిన కాల్పులకు లెక్కేలేదు. ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హన్‌వాని ఎన్‌కౌంటర్‌ ఘటన లోయను కుదిపేసింది. దీనికి వ్యతిరేకంగా ఉగ్రవాదులతోపాటు స్థానిక పౌరులూ ఆందోళన బాట పట్టారు. గత ఏడాది ఉగ్రవాదుల దాడుల్లో 87మంది సైనికులు నేలకొరిగారని దక్షిణాసియా ఉగ్రవాద పోర్టల్‌ (ఎస్‌ఏటీపీ) గణాంకాలతో సహా వెల్లడించింది. 2008 తరవాత రాష్ట్రంలో పెద్దసంఖ్యలో భద్రతాదళాలు మరణించడం ఇదే ప్రథమం. ముంబయి అల్లర్ల నేపథ్యంలో 2008లో వందమంది జవాన్లు హతులయ్యారని ఈ పోర్టల్‌ పేర్కొంది. మళ్ళీ 2016లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని పోర్టల్‌ వివరించింది.

అనూహ్య మార్పు

మహాశివరాత్రి పండగ నిర్వహణకు ముస్లిములు ముందుకొచ్చిన సంబల్‌ పట్టణంలోనూ నిరుడు శాంతిభద్రతల పరిస్థితి సజావుగా లేదు. ఇక్కడ ఆరు ఎన్‌కౌంటర్లు జరిగాయి. బుర్హన్‌వాని ఎన్‌కౌంటర్‌ ఘటనను కశ్మీరీలు నేటికీ మరచిపోలేదు. పలు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల కశ్మీర్‌లో పర్యటించిన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటువంటి వాతావరణంలో మహాశివరాత్రి పర్వదినం ప్రశాంతంగా జరగడం ఎన్నదగింది! కశ్మీరీలంతా ఉగ్రవాదానికి వూతమివ్వడం లేదన్నది వాస్తవం. అందరూ సైనికులను శత్రువులుగా చూడటం లేదు. అయితే వారు తమ స్వేచ్ఛకు అడ్డంకిగా మారారన్నది ప్రజల అభియోగం. గత ఏడాది అక్టోబరులో శ్రీనగర్‌ బైపాస్‌ రహదారిపై లస్జాన్‌ ప్రాంతంలో జరిగిన రోడ్డుప్రమాదంలో వాహనంలో ఇరుక్కుపోయిన సైనికుడిని స్థానిక యువకులు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సామాజిక ప్రసార మాధ్యమాల్లో పెట్టగా విశేష స్పందన లభించింది. యువకులపై ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రదర్శితమైన సద్భావస్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్తే, సంక్షుభిత కశ్మీరులో స్థితిగతులు సత్వరం సాధ్యమైనంతగా మెరుగుపడగలవు!

– గోపరాజు మల్లపరాజు

(ఈనాడు సౌజన్యం తో )