Home News భ్రమల్లో బతుకుతున్న మావోలు

భ్రమల్లో బతుకుతున్న మావోలు

0
SHARE

బిహార్‌లోని ముంగేర్ జిల్లా మసుదన్ రైల్వేస్టేషన్‌పై మావోయిస్టులు ఇటీవల దాడి చేసి బీభత్సం సృష్టించారు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌ను, మరో రైల్వే ఉద్యోగిని కిడ్నాప్ చేసి కియుల్ – జమాల్‌పూర్ సెక్షన్లమధ్య రైళ్లు తిరగరాదని హుకుం జారీ చేశారు. దీంతో అనేక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి. రైళ్లు నడిపితే బందీగా ఉన్న రైల్వే ఉద్యోగులను ‘ఖతం’ చేస్తామని మావోయిస్టులు హెచ్చరించడంతో పరిస్థితి విషమంగా మారింది. సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేయడంతో, స్టేషన్‌లోని కీలకమైన సామాగ్రిని దగ్ధం చేయడంతో అపారంగా నష్టం జరిగిందని తెలుస్తోంది.

ఈ బీభత్సాన్ని విశే్లషించుకుంటే ఏం అర్థమవుతోంది?.. అసహనం, అనాలోచితం, అమానుషం, అరాచకం తప్ప మరో అంశం ఏదీ కనిపించదు. గతంలోనూ బిహార్‌లో ఇలా రైల్వేస్టేషన్లపై మావోయిస్టుల దాడి జరిగింది. పట్టాలను తొలగించడంతో రైళ్లు పట్టాలు తప్పాయి. ఎంతోమంది ప్రయాణికులు గాయపడ్డారు, మరణించారు. ఈ సంస్కృతి మావోయిస్టులకు శోభనిస్తుందా? ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించేది పెట్టుబడిదారులు కాదు, సాధారణ ప్రజలు. మరి ఆ ప్రజలను టార్గెట్ చేసుకుని రైళ్లపై, స్టేషన్లపై దాడులు జరిపితే వాటికి మాన్యత ఉంటుందా?

మమతాబెనర్జీ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రయాణికుల జీవితాలతో మావోయిస్టులు చెలగాటమాడారు. అటవీప్రాంతంలో రైలును నిలిపివేసి నానా బీభత్సం సృష్టించారు. అనారోగ్యంపాలైన ప్రయాణికులు నరకం చూశారు. ఇంకా అనేక సందర్భాలలో రైల్వే ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఇది ఏరకమైన విప్లవ కార్యక్రమం?

దేశంలో 125 కోట్ల మంది ప్రజలున్నారు. వీరిలో యువత సంఖ్య అధికమని గణాంకాలు చెబుతున్నాయి. అంటే 35 సంవత్సరాలలోపుగల వారు ఎక్కువ సంఖ్యలో ఉండటం దేశానికో వరం అని నిపుణులు భావిస్తున్నారు. వీరే దేశ ఆర్థిక వ్యవస్థను పరిగెత్తించే శక్తి అని శ్లాఘిస్తున్నారు. ఉత్పత్తిని పెంచి, సేవలు అందించి, ప్రపంచంలో గొప్ప శక్తిగా దేశాన్ని నిలిపే సత్తువ ఆ యువశక్తికే ఉందని నాయకులు, పారిశ్రామిక దిగ్గజాలు, ఆర్థికవేత్తలు ఇలా అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు.

ఈ విషయం అందరి ఎరుకలోకి వచ్చింది, మావోయిస్టులకు తప్ప! ఒకవేళ వారి ఎరుకలోకి ఈ అంశం వచ్చి ఉంటే ఇలా బీభత్సాలకు, విధ్వంసాలకు పాల్పడరు. ఎప్పుడైనా నిర్మాణం, సృజన ముఖ్యం. విధ్వంసం, విశృంఖలత్వం, అరాచకత్వం కాదు. దేశంలోని కోట్లాదిమంది ప్రజలు సంపద సృష్టిస్తూ, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ, సృజనకు పెద్దపీట వేస్తూ సేవలు అందిస్తూ ఉంటే మావోయిస్టులు గత అర్థ శతాబ్దంగా ఏం చేస్తున్నారు?.. ధ్వంస రచనకు, విధ్వంసకాండకు, హత్యాకాండకు పాల్పడుతున్నారు. ఈ చర్యలన్నింటికీ ‘విప్లవం’ అన్న ముసుగు వేస్తున్నారు. కాకతీయ ఎక్స్‌ప్రెస్ బోగీలను దగ్ధం చేసి అనేకమంది అమాయకుల మరణం సైతం విప్లవంలో భాగంగా చిత్రించే నైపుణ్యం మావోయిస్టులది, వారి మాటలన్నీ పల్లేరు గాయాలే!

దేశంలో అధిక సంఖ్యలో ఉన్న యువత, ఏం ఆలోచిస్తున్నది?.. మావోయిస్టులు ఏం ఆలోచిస్తున్నారు? ప్రపంచంతో కలిసి నడవాలని దేశ యువత తహతహలాడుతూ అహర్నిశలు కష్టపడుతోంది. మావోయిస్టులు మాత్రం ఏదో మేర జరిగిన అభివృద్ధిని ధ్వంసం చేయడానికి కష్టపడుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ అంశమేనా?

ఒకవేళ మావోయిస్టుల మార్గం గొప్పది, ఆశాజనకమైనది, అద్భుతమైనది, మానవాళికి తిరుగులేని సాంత్వన చేకూర్చేది అని యువత తలిస్తే, భావిస్తే ఇంతకాలం విప్లవం రాకుండా ఆగేదా?.. ఐదు దశాబ్దాల్లో ఏదో ఒక కల్లోల దశాబ్దంలోనైనా యువత ఉత్తుంగ తరంగమై లేచి మావోయిస్టుల మార్గాన్ని అక్కున చేర్చుకునేది. కలకత్తా, ఢిల్లీ ఇతర మహానగరాల్లో విద్యార్థులు, యువతరం సముద్ర కెరటాల్లో విరుచుకుపడి నూతన శకానికి, నవ యుగానికి పాల్పడేవారు, కొత్త ప్రపంచాన్ని నిర్మించేవారు. కానీ అలా జరగలేదు. జరగడం లేదు. యువత అంతా ఇప్పుడు జ్ఞానానికి, మేధో సంపదకు పెద్దపీట వేసి అది మానవాళికి ఎలా మేలు చేయగలదో తమ శక్తియుక్తులను వెచ్చించి చూపుతున్నారు. అనేక ఆవిష్కరణలకు ఆద్యులవుతున్నారు. అనేక స్టార్టప్‌లకు నట్లు, బోల్టులుగా ఒదిగిపోతున్నారు. తద్వారా తమవంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పకనే చెబుతున్నారు. ఈ ప్రయత్నాన్ని ప్రపంచం స్వాగతిస్తోంది.

ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ఈ ప్రయాణాన్ని మావోలు చూసేందుకు తిరస్కరించి, పట్టించుకునేందుకు సైతం ఇష్టపడక ఇలా విధ్వంసకాండకు పాల్పడితే, ప్రజలకు అసౌకర్యం కలిగే చర్యలకు పాల్పడితే, వారి శ్రమతో, నెత్తుటితో నిర్మితమైన ఆ వస్తువులను వారి కళ్లముందే కాల్చి బూడిద చేస్తుంటే అదెలా ప్రజానుకూల అంశమవుతుంది?

మౌలికంగా మావోయిస్టులు రెండు వర్గాల సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నంతకాలం వారికి కళ్లు కనిపించవు. ఆ సిద్ధాంతం గంతల మాదిరి పని చేస్తూండటంతో వాస్తవాల్ని పరిశీలించే శక్తి వారిలో ఇగిరిపోతుంది.

జ్ఞానమే, కృత్రిమ మేధస్సే, రోబోలే, ఇంటర్నెట్టే రేపటి చోదక శక్తులు. ఇవి అద్వైతాన్ని చెబుతున్నాయి. వర్గాలకు సంబంధం లేని ఈ అపారమైన జ్ఞానాన్ని, మేధను గౌరవించిన వారికే ఈ సమాజంలోని మేలిమి మీగడ అందుతుంది. ఇది అందరి అనుభవంలోకి వచ్చింది, వస్తోంది. యంత్రాలు, వాటి దగ్గర స్వేదం చిందించే శ్రామికులు, సుత్తితో కార్మికులు, కొడవలితో కర్షకులు కనిపిస్తున్నారు. ఈ దృశ్యం మారిపోయింది బాబో… అని రష్యా, చైనా, తూర్పు యూరప్ దేశాలు దశాబ్దాల క్రితం నుంచి మొత్తుకుంటున్నా మావోయిస్టుల చెవికి ఎక్కకపోవడం విషాదం. నేపాల్, కొలంబియా తదితర దేశాల్లోనూ మావోయిజానికి మనుగడ లేదని అనుభవపూర్వకంగా ఆయా దేశాల గెరిల్లాలు చెబుతున్నా పట్టించుకోకపోతే తప్పెరిదవుతుంది?

ప్రజల మేలుకోరే మావోయిస్టులు మరింత లోతైన ఆత్మపరిశీలన చేసుకోవలసిన సమయం ఇది. నేపాల్ నాయకుడు ప్రచండ దశాబ్దం క్రితమే ఈ మేరకు సూచన చేశారు. అలాంటివారు శ్రామికవర్గ విద్రోహులని తూలనాడి కించపరిచి, నిందించి తాము హీరోలమని భావించారు. వాస్తవానికి ప్రజలకు కష్టం నష్టం కలగకుండా, అసలు ఏమాత్రం క్లేశం కలగకుండా గరిష్ఠంగా మేలు చేసేవాడే మొనగాడు. ప్రచండ ఆ దారిలో పయనిస్తున్నాడు. అతను రివిజనిస్టు అని తిట్టి తూర్పారపట్టినంత మాత్రాన భారత ప్రజలకు మావోలు గొప్ప మార్గనిర్దేశనం చేసినట్టు కాదు.

నక్సల్‌బరి నిప్పురవ్వ ఆరిపోకుండా చూసుకుంటామని పంతంపట్టి ప్రజల్ని కాలం చెల్లిన సిద్ధాంతం పేర వెనుకబాటుతనం వైపు నడిపించరాదుకదా?.. అసలు ప్రజలు తమవైపు ఉన్నారని భ్రమపడటంతో వారి ఆలోచనల్లో ‘స్పష్టత’ కొరవడుతోంది. సమాజం చలన గతులపై స్పష్టత లేనంత కాలం ఎన్ని రైల్వేస్టేషన్లపై దాడులు చేసినా, ఇన్ఫార్మర్ల పేర ఎంతమంది అమాయకులను, ఆదివాసీలను అంతమొందించినా మనిషికి ప్రత్యామ్నాయంగా అన్ని రంగాలలోకి రోబోల రాకను, డిజిటల్ విప్లవాన్ని నిరోధించలేరు. టెక్నాలజీ ఆదివాసీలకు అందకుండా నిలుపజాలరు. ఆ మాత్రపు దానికి ఇంతటి రక్తపు హోలీ ఆడటం అవసరమా? అలా ఆహుతి అవుతున్నది ఏ భూస్వాములో, పెట్టుబడిదారులో, సామ్రాజ్యవాద తొత్తులో, యుద్ధోన్మాదులో కాదు.. సాధారణ, అతి సాధారణ పౌరులు. మరి ఈ వైఖరి విప్లవానుకూలమైనదా?.. ప్రజల జ్ఞాన స్థాయిని పెంచేదా?.. మనిషిని ఉన్నతంగా నిలిపేదా?.. మావోయిస్టుల మతిలేనితనాన్ని వెల్లడిస్తున్నదా? అందరూ నిశితంగా ఆలోచించాల్సిన సమయమిది!

వుప్పల నరసింహం 9985781799

(ఆంధ్రభూమి సౌజన్యం తో)