సమాజంలో ఆర్థిక అంతరాలకు ‘శ్రమదోపిడీ’ కారణమని కారల్ మార్క్స్ సిద్ధాంతీకరించారు. వాస్తవానికి జ్ఞానస్థాయి, నైపుణ్యాలు, చైతన్యంలోని తేడాలే ఈ అంతరాలకు కారణమని స్పష్టంగా తెలుస్తున్నా ఆయన పట్టించుకోలేదు. ఒక కుటుంబంలో నలుగురైదుగురు ఉంటే.. వారిలో ఒకే స్థాయి జ్ఞానం, చైతన్యం, చొరవ కనిపించదు. అందుకే వారి ఆర్థిక స్థితి ఒకే తీరున ఉండదు. ఈ వ్యత్యాసానికి ‘వర్గం’ కారణమవుతుందా? కుటుంబాలే సమాజమని భావిస్తే మార్క్స్ విశ్లేషణ, ప్రతిపాదించిన సూత్రాలు సమంజసమైనవేనా? కానే కాదు. ఆర్థిక అంతరాలను రూపుమాపేందుకు తిరుగుబాటు జెండా ఎగురవేయాలని మార్క్స్ పిలుపునివ్వడం వల్ల నైపుణ్యాలు పెరుగుతాయా? జ్ఞానం వృద్ధిచెందుతుందా?. ఆ జ్ఞానం కూడా పోతపోసినట్టు ఎప్పుడూ కొనసాగదు. తరం మారినప్పుడల్లా కొత్తగా రూపాంతరం చెందుతోంది. ఈ మౌలిక అంశాన్ని విస్మరించి మార్క్స్ ఊహాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేశారు. విద్వేషాలకు ఊపిరిలూదేలా ‘వర్గకసి’ని రెచ్చగొట్టారు.
పాశ్చాత్య దేశాల ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల నేపథ్యంలో మార్క్స్ ఆలోచనలు చేస్తే, అవి ప్రపంచమంతటికీ అన్వయమవుతాయని ఆవేశపడి మార్క్స్ అనుచరులు వీరంగం సృష్టించడం ఎంతటి అవివేకం? వేల సంవత్సరాల వికసిత సమాజంలో, జ్ఞాన సంపన్నమైన దేశంలో మార్క్స్ ఆలోచనల్ని అంతే సాంద్రతతో, మక్కీకి మక్కీగా ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించడం విజ్ఞత అనిపించుకుంటుందా? గుడ్డిగా అనుసరించడానికి ఉద్యుక్తులు కావడం, విచక్షణను విస్మరించడం సబబేనా?
1853లో మార్క్స్ భారత్‌పై రెండు వ్యాసాలను అమెరికాలోని ‘న్యూయార్క్ హెరాల్డ్’లో రాశారు. అందులో చాలా దారుణమైన వ్యాఖ్య చేశారు. భారత సమాజం ‘ప్రిమిటివ్’ స్థితిలో ఉందని, ఆ వెనుకబడిన దేశాన్ని మార్చేందుకు విప్లవం రావలసిన అవసరముందన్నారు. ఈ విశ్లేషణను ‘పెట్టుబడి’ గ్రంథం రాయకముందు ఆయన వ్యక్తం చేశారు. ‘కమ్యూనిస్టు సిద్ధాంతం’ ప్రతిపాదించే సమయానికి ఆయన మానసిక స్థితి, ఆలోచన ధోరణి ఎలా ఉందో ఆ రెండు వ్యాసాల వైఖరి తెలుపుతోంది.
వాస్తవానికి 17వ శతాబ్దం వరకు భారతదేశం వృద్ధిరేటు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. ఎగుమతులే తప్ప దిగుమతులు లేవు. దాంతో భారత్ ‘బంగారు పిచ్చుక’గా మారింది. ఈ దేదీప్యమానమైన ఎదుగుదల, అభివృద్ధి మార్క్స్‌కు ‘ప్రిమిటివ్’గా కనిపించడం ఎంతటి దారుణం? ఎంతటి వంకర భాష్యం? కళ్లముందు కనిపిస్తున్న ఉజ్వల చరిత్ర, గొప్ప నాగరిక సమాజం, అన్ని పార్శ్వాలలో అభివృద్ధి సాధించిన తీరు ఆయన కంటికి ఆనక పోవడమంటే ఆయన దృక్కోణం ఎంత లోపభూయిష్టమైనదో ఇట్టే అర్ధమవుతుంది. దీన్ని భారత్‌లోని ఆయన అభిమానులు, కమ్యూనిస్టులు పట్టించుకోకపోవడం, ప్రశ్నించుకోకపోవడం దారుణాతి దారుణం. ఈ అహేతుక ధోరణిని ఇప్పటికీ అనుసరించడం అంగీకార యోగ్యం కాదు. ఈ నేల పరిమళం ఆస్వాదిస్తూ, నీరు తాగుతూ, పండిన గింజలను తింటూ మార్క్స్ సిద్ధాంతాన్ని ఆరాధిస్తున్నవారు వాస్తవ సమాజ వాతావరణాన్ని చూడ నిరాకరించడమంటే సమాజాన్ని వెనక్కి నడపడమే అవుతుంది. మార్క్స్ వౌలిక సూత్రాలు, విశే్లషణ వాస్తవ దూరమైనవని అనేక దేశాల్లో ఇప్పటికే రుజువైనప్పటికీ పట్టించుకోకపోవడం ఎంతటి దారుణం?
ఈ అమానుషమైన భావధారను మరింత ముందుకు తీసుకెళ్తామని భారత్‌లో మావోలు మర తుపాకులు, మందు పాతరలు పేల్చడం ఎంతటి అవివేకం? సుసంపన్నమైన ఈ దేశం పరాయివాళ్ళ దండయాత్రలు, దోపిడీలు, పీడన కారణంగా పేదరికంలోకి జారుకున్నదన్న చరిత్రను పట్టించుకోకుండా- ‘పరాయి సిద్ధాంతం’ (మార్క్సిజం) అదే పాత్రను నిర్వహించేలా ఎగదోయడం అనైతికం, అన్యాయం. మావోలు అందుకు సిద్ధం కావడం చూస్తే వారు పరాయి సిద్ధాంతానికి ఎంతగా బానిసలయ్యారో అర్థమవుతుంది. యూరప్‌లో పురుడు పోసుకున్న ఆ భావజాలం అక్కడ కనుమరుగై దశాబ్దాలు దాటింది. రష్యా, చైనా తదితర దేశాల్లోనూ అటకెక్కింది. అయినా దండకారణ్యంలో మరోసారి ఆ ‘ప్రయోగం’ చేస్తామని అందుకోసం అమాయకులైన ఆదివాసులను ఎంపిక చేసుకోవడం అమానుషం. వారి శవాలపై తమ రాజ్యాధికారం కోసం మెట్లు నిర్మించుకోవడం అత్యంత విషాదం. ఈ పనికి తమ ‘ప్రవక్త’మార్క్స్ మాదిరి వక్రభాష్యం చెబుతూ, అవాస్తవ అంశాలను, సోదిలోకి సైతం లేని విషయాలను ప్రస్తావిస్తూ ‘సైన్యం’ నిర్మాణానికి వనరులన్నీ ఖర్చుచేయడమంటే 21వ శతాబ్దంలో ఇంతటి దగా మరొకటి ఉండదు. నాల్గవ పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని కొత్త కక్ష్యలోకి ప్రవేశపెట్టినా పట్టించుకోకుండా, కాలం చెల్లిన సిద్ధాంతానికి ఆదివాసులను ఆహుతి ఇవ్వడం అవాంఛనీయం. ఆదివాసులను ఆధునిక సమాజంవైపు నడిపించడం బదులు మార్కెట్ రహిత సమాజం వైపు నడిపిస్తామని జనతన సర్కారు పేరిట మార్క్స్ కాలానికి వారిని తరలించడానికి సిద్ధపడటం ఎంతటి వెనుకబాటుదనమో ఇంకా బోధపడక పోవడం వారి అజ్ఞానానికి పరాకాష్ఠ.
ఇకపై రోబోలదే రాజ్యమని ప్రపంచమంతా కోడై కూస్తున్నా, డిజిటల్ ఎకానమీ బలపడుతుందని, సేవల ద్వారా సంపద సృష్టి పెరుగుతుందని సాధారణ పౌరుడికి సైతం అవగాహనలోకి వస్తున్నా మావోలు పాత సిద్ధాంతాన్ని ఇంకా నమ్ముతున్నారు. మారుతున్న ప్రపంచాన్ని పట్టించుకోకుండా మావోయిస్టులు మూర్ఖంగా ఝార్ఞండ్, ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మర తుపాకులు, మందుపాతరలు పేల్చి ఆదివాసులను, జవాన్లను, కాంట్రాక్టర్లను, కూలీలను కాల్చిపారేస్తూ, అభివృద్ధిని ధ్వంసం చేయడం ఎలాంటి చైతన్యం? ఇవి చరిత్రలో నిలిచిపోయే పనులేనా? ముమ్మాటికి కావు! మార్క్స్ వక్రభాష్యాన్ని గుర్తించి ఇకనైనా మావోయిస్టులు కళ్లు తెరవాలి.
-వుప్పల నరసింహం 99857 81799
(ఆంధ్రభూమి సౌజన్యం తో)