‘ప్రత్యేకత’ రగిలించిన
విచ్ఛిన్న విషాగ్ని కణం
బీభత్స దవాగ్ని శిఖల
చెలరేపెను దినం దినం
భారత కథలో కలిగిన
వ్యథలకు ఏమిటి మూలం?
దానవ భావాలు రూపు
దిద్దుకున్న మత ద్వేషం…
సర్వమత సమభావ వ్యవస్థకూ అన్యమత విధ్వంసక శక్తులకూ మధ్య కొనసాగిన నిరంతర సంఘర్షణ పనె్నండు వందల ముప్పయి ఐదు సంవత్సరాల అఖండ భారత చరిత్ర! ఈ సతత సంఘర్షణ చరిత్ర కలియుగం మూడువేల ఎనిమిది వందల పదునాలుగవ సంవత్సరంలో మొదలైంది. మహ్మద్ బిన్ కాసిమ్ అనే భయంకర పైశాచిక జిహాదీ బీభత్సకారుడు అఖండ భారతదేశంలోని సింధు ప్రాంతంలో చొరబడడంతో ఈ సంఘర్షణ మొదలైంది. క్రీస్తుశకం ప్రకారం అది ఏడువందల పనె్నండవ సంవత్సరం. మహమ్మదాలీ జిన్నా అనే భయంకర పైశాచిక జిహాదీ బీభత్సకారుడు కలియుగం ఐదువేల నలబయి తొమ్మిదివ ఏట అఖండ భారతదేశాన్ని బద్దలు కొట్టడం సంఘర్షణకు పరాకాష్ఠ. అది క్రీస్తుశకం పంతొమ్మిది వందల నలబయి ఏడవ సంవత్సరం.. సర్వమత సమభావ వ్యవస్థను ఈ సనాతన దేశంలో సజీవంగా ఉంచడానికి ఈ సతత సంఘర్షణ సాగించినవారు అనాదిగా ఈ దేశాన్ని, ఈ మాతృభూమిని ఆరాధిస్తున్న స్వజాతీయులు, సర్వమత సమభావం సహజ స్వభావమైన వారు! ఈ స్వజాతీయులు హిందువులు.. భారతీయులు. ఈ సతత సంఘర్షణలో అన్యమత విధ్వంసక శక్తులు ఇస్లాం జిహాదీలు. ప్రపంచంలోని అన్ని ఇతర మతాలను ధ్వంసం చేసి ఇస్లాంను ఏకైక మతంగా ప్రపంచమంతటా ప్రతిష్ఠించడం జిహాదీల లక్ష్యం! ఈ దేశ ప్రజల అనాది స్వభావమైన సర్వమత సమభావం పరాజయం పాలైన చోట, జిహాదీ శక్తులు జయించిన చోట అఖండ భారత్‌లో పాకిస్తాన్ ఏర్పడింది! సర్వమత సమభావం సజీవమై ఉన్నచోట భారతదేశం భారతదేశంగానే మిగిలింది! అవశేష భారత ప్రజల ఈ సమష్టి సర్వమత సమాన స్వభావానికి అద్దం రాజ్యాంగం.. పాకిస్తాన్ ప్రజల ఇస్లామేతర మత నిర్మూలన సమష్టి చిత్తవృత్తికి సాక్ష్యం కొనసాగుతున్న బీభత్స వ్యవస్థ! ఒకప్పుడు సర్వమత సమభావ వ్యవస్థ ఉండిన పాకిస్తాన్ ప్రాంతంలో 1947 తరువాత సర్వమత సమభావ వ్యవస్థ అంతరించిపోవడానికి ఏకైక కారణం దేశ విభజన! క్రీస్తుశకం 1947 నాటి దేశ విభజనకు దారితీసిన విపరిణామ క్రమంలో ప్రధాన ఘట్టం బ్రిటన్ దురాక్రమణ దారులు ఇస్లాం మతస్థులకు చట్టసభలలో కల్పించిన మతపరమైన ‘ఆరక్షణలు’..
మతపరమైన ఆరక్షణ-కమ్యూనల్ రిజర్వేషన్-ల దుష్పరిణామ క్రమానికి పరాకాష్ఠ అఖండ భారతం బద్దలు కావడం.. ఈ చరిత్ర స్వతంత్ర భారతంలోని, అవశేష భారతంలోని పాలకులకు శాశ్వత గుణపాఠం. తెలంగాణ ప్రభుత్వానికి ఈ గుణపాఠం ధ్యాస లేదన్నది గత ఆదివారం శాసనసభ ఆమోదించిన ‘మత ఆరక్షణల’ చట్టం వల్ల ధ్రువపడింది. మత ప్రాతిపదికపై ఇస్లాం మతస్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యా సంస్థలలోను ఆరక్షణలను కల్పించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశ విభజన చరిత్ర పునరావృత్తికి మరోసారి విషబీజం నాటింది! రాజకీయ, రాజకీయేతర రంగాలలోని జాతీయతావాదులు, మాతృభూమి మరోసారి బద్దలు కారాదన్న సమగ్రత నిష్ఠ గలవారు ఈ ‘మత రిజర్వేషన్లను’ వ్యతిరేకించడం సహజం, ఈ వ్యతిరేకత దేశ ప్రజల మనోభీష్టం! దేశ ప్రజల మనోభీష్టాన్ని ధిక్కరించిన తెలంగాణ ప్రభుత్వపు నిర్వాకం న్యాయ ధిక్కారం, రాజ్యాంగ ధిక్కారం.. గతంలో ఇస్లాం మతం వారికి మత ప్రాతిపదికపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌లు రాజ్యాంగ విరుద్ధమని అందువల్ల చెల్లవని హైకోర్టు ముమ్మారు స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం పరిశీలన పరిధిలో ఈ వివాదంపై శాసనసభ చట్టం చేయడం నిర్లజ్జాపూరితమైన న్యాయధిక్కారం.. సర్వమతాల పట్ల సమభావాన్ని ప్రభుత్వాలు కలిగి ఉండాలని, ఏ ఒక్క మతానికి కాని ‘ప్రత్యేకత’ కల్పించరాదని ఏ మతాన్ని ‘వివక్ష’కు గురి చేయరాదని, రాజ్యాంగంలో పదహైదవ, పదహారవ అధికరణాలు స్పష్టం చేస్తున్నాయి! అందువల్ల ఒక మతానికి ‘రిజర్వేషన్లు’ కల్పించడం ఇతర మతాలను ‘వివక్ష’కు గురి చేయడం మాత్రమే! గతంలో ఈ సంగతిని తెలంగాణ ఫ్రభుత్వం కూడ అంగీకరించింది. భారత రాజ్యాంగాన్ని సవరించకుండా ఇస్లాం మతస్థులకు ఉద్యోగాలలో ‘రిజర్వేషన్లు’ కల్ప్చిండం సాధ్యం కాదని, అందువల్ల ‘ఆరక్షణలు’ మినహా మిగిలిన సంక్షేమ పథకాలను ముస్లింలకు వర్తింపచేస్తామని ప్రకటించింది. ‘కల్యాణలక్ష్మి’ వంటి పథకాలను ముస్లింలకు వర్తింప చేసింది కూడ!
కానీ, గత ఏడాదిగా మాట మార్చింది. రాజ్యాంగ సవరణతో నిమిత్తం లేకుండానే ఇస్లాం మతస్థులకు వెనుకబడిన కులాల ప్రతిపత్తిని కల్పించింది. ఇలా వెనుకబడిన కులాల జాబితాలోని ‘ఈ’ తరగతిలో ఇస్లాం మతాన్ని ఇరికించడం ద్వారా రాజ్యాంగంలోని పదహైదవ, పదహారవ అధికరణల స్ఫూర్తిని వమ్ము చేయగలమని తెలంగాణ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు భావిస్తున్నారు! రాజ్యాంగ సూత్రాల వక్రీకరణకు ఇంతకు మించిన ఉదాహరణ లేదు. ‘ఇస్లాం’ మతం కాదా? కల్పించదలచిన రిజర్వేషన్లకు ‘మతం ప్రాతిపదిక కాద’ని బుకాయించినంత మాత్రాన ‘మతం’ మతం కాకుండా పోదు.
తరతరాలుగా సమాజ నిర్లక్ష్యానికి, ఉపేక్షకు బలైపోయిన అనుసూచిత కులాల-షెడ్యూల్డ్ కాస్ట్స్- వారికి, అనుసూచిత సముదాయాల-షెడ్యూల్డ్ ట్రయిబ్స్-వారికి ఆరక్షణలు కల్పించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు, రాజ్యాంగంలో నిర్దేశించారు. దళితులు ‘సమష్టి సముదాయం’గా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉండడం ఇందుకు ప్రాతిపదిక! ఇలాంటి దళితులకు, వెనుకబడిన కులాల వారికి కల్పించవలసిన ‘భద్రత’లను ఇస్లాం మతస్థులకు కల్పించడం సామాజిక, చారిత్రక వాస్తవాలకు విరుద్ధమైన అంశం! ఈ దేశంలో పుట్టిపెరిగిన మతాలు అనేకం ఉన్నాయి. విదేశాల నుంచి వ్యాపించిన మతాలు కూడ ఉన్నాయి. ఈ మతాలలో ఏ ఒక్కటి కూడ ‘సమష్టి’గా వెనుకబడినతనానికి గురి కాలేదు. ఏ మతం వారు కూడ ‘సమష్టి సముదాయం’గా వెనుకబడినవారు కాదు, ప్రతి మతంలోను ధనవంతులు, మధ్యతరగతి వారు, నిరుపేదలు ఉండడం సహజం! కానీ ఏ ఒక్క మతం కూడ ఒక ‘సమష్టి జన సముదాయం’గా వెనుకబడి ఉండలేదు. విదేశాల నుంచి వ్యాపించిన క్రైస్తవ, ఇస్లాం వంటి మతాలు మరింత చైతన్యానికి, చొరబడే తత్త్వానికి, ఆధిపత్య స్వభావానికి ప్రతీకలు. ఇలా చొచ్చుకొనిపోయే సమష్టి స్వభావం ఉండడం వల్లనే ఇస్లాం మతం, క్రైస్తవ మతం మనదేశం సహా వివిధ దేశాలకు విస్తరించాయి. ఇస్లాం, క్రైస్తవం మన దేశంలో ప్రవేశించడానికి పూర్వం అనేక సహస్రాబ్దులుగా మనదేశంలో వివిధ మతాలు వున్నాయి. కానీ- ఈ పాత, కొత్త మతాలన్నీ ఒకే అద్వితీయ జాతీయతలో భాగం!
విదేశీయుల దండయాత్రల సమయంలోను ఆ తరువాత జిహాదీల బీభత్స పాలన సమయంలోను శతాబ్దులపాటు ఈ దేశంలోని అనాది మతాల వారు మాత్రమే అణగారిపోయారు. ఇస్లాం మతం వారు ఇలాంటి అణచివేతకు గురి కాలేదు. వందల ఏళ్లపాటు ఇస్లాం జిహాదీలు ఈ దేశంలో పుట్టి పెరిగిన వివిధ హైందవ మతాల వారిని అణచివేశారు, స్వజాతీయ హైందవ మతాల వారిని ఇస్లాం జిహాదీలు హత్య చేశారు, మతం మార్చారు. అందువల్ల మతం పేరుతో ఇస్లాం వారికి ‘రిజర్వేషన్లు’ కల్పించినట్టయితే మిగిలిన ‘మతాల‘ వారు కూడ ‘మతం’ పేరుతో రిజర్వేషన్లను కల్పించమని కోరగలరు.
మనదేశం సనాతన దేశం. అందువల్ల మనది సనాతన జాతి. ‘సనాతనం’ అని అంటే శాశ్వతం అని అర్థం. మన జాతీయతకు ఏ ఒక్క మతం కాని, ఏ ఒక్క భాష కాని ప్రాతిపదిక కాలేదు. విభిన్న మతాలు, భాషలు మాత్రమే కాదు, అసంఖ్యాక వైవిధ్యాల సర్వ సమగ్ర సంస్కృతి మాత్రమే మన జాతీయతకు ప్రాతిపదిక! కొత్తగా పుట్టిన మతాలు, భాషలు, వైవిధ్యాలు ఈ అద్వితీయ జాతిలో భాగమయ్యాయి. క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్ది నాటి ఆదిశంకరాచార్యుడు ఆరు ప్రధాన వైదిక మతాలను గుర్తించాడు. శైవం, శాక్తం, వైష్ణవం, సౌరం, గాణాపత్యం, స్కాందం- అన్నవి ఈ షణ్మతాలు! ఈ అన్ని మతాలను ఆమోదించి అసంఖ్యాక దేవతలను ఆరాధించిన అనాది మతం సనాతన మతం. ఈ ఏడు మాత్రమే కాదు.. చార్వాకం, బౌద్ధం, జైనం, సిక్కు మతం, వీరశైవం, శ్రీ వైష్ణవం, మాధ్వం, ఆర్య సమాజం వంటి మతాలు ఈ దేశంలో క్రమంగా పరిణామగతిని పొందాయి. కానీ ఈ అన్ని మతాలవారు ఈ మాతృభూమిని తల్లిగా భావించారు. తమ మతం ఈ అనాది జాతీయతలో భాగమని భావించారు. అందువల్లనే ఏ మతం వారు కూడ ‘తమది ప్రత్యేక జాతి’ అన్న భ్రాంతికి గురి కాలేదు. మతం పేరుతో తమకు ప్రత్యేక దేశం కావాలని కోరలేదు! ఈ అనాది అద్వితీయ జాతీయత పేరు ‘హిందుత్వం’ లేదా ‘భారతీయత!’
విదేశాల నుంచి వచ్చిన మతాలను సైతం సమానంగా ఆదరించి స్వదేశీయ మతాలతో సమాన ప్రతిపత్తిని కల్పించిన చరిత్ర ఈ జాతికున్న విలక్షణమైన స్వభావం! అందువల్లనే విదేశాల నుంచి వచ్చిన యూదు, పారశీక, ఇస్లాం, క్రైస్తవ మతాల వారికి కూడ ఈ స్వజాతీయ జీవన ప్రస్థానంలో సమాన భాగస్వామ్యం లభించింది. కానీ ఇస్లాం మత ప్రతినిధులుగా చెలామణి అయిన జిహాదీ స్వభావులు తమ మతం ఈ ‘స్వజాతీయ సమాజం’లో భాగం కాదని ప్రకటించారు! అనాది అద్వితీయ జాతిలో తాము ఇమడబోమని భావించారు. తమది మరో కొత్త జాతి అని, తమకు ప్రత్యేక దేశం కావాలని క్రీస్తుశకం 1906వ, 1947వ సంవత్సరాల మధ్య ఇస్లాం మత ప్రతినిధులుగా చెలామణి అయిన ‘జిహాదీ’లు ప్రచారం చేశారు! బ్రిటన్ పెత్తందార్లు ఇస్లాం మతస్థులకు కట్టబెట్టిన మత ఆరక్షణలు ఈ విచ్ఛిన్న వహ్నికి ఇంధనంగా మారడం చరిత్ర! 1947 నాటి అఖండ భారత విభజనకు ఇదీ నేపథ్యం. మత ప్రత్యేకత వల్ల జాతికి విద్రోహం జరుగగలదన్నదానికి జమ్మూ కశ్మీర్‌లో కొనసాగుతున్న జిహాదీ బీభత్సం మరో ప్రత్యక్ష సాక్ష్యం…
క్రీస్తుశకం పన్నెండవ, పద్నాలుగువ శతాబ్దుల మధ్య ‘సర్వమత సమభావ వ్యవస్థ’ను కాకతీయ సమ్రాట్టులు నిలబెట్టారు. ఇస్లాంతో అన్నిమతాలకు సమాన ఆదరణ లభించింది. సమాంతరంగా ఖిల్జీలు, తుగ్లక్‌లు వంటి విదేశీయ జిహాదీ వారసులు ఇస్లామేతర మతాల వారిని ఊచకోత కోసిన వ్యవస్థ కూడ కొనసాగింది! క్రీస్తుశకం పద్నాలుగువ శతాబ్ది నుండి విజయనగర సామ్రాజ్యంలో ఇస్లాం సహా అన్ని మతాలవారు సమానంగా జీవించిన హైందవ జాతీయతత్త్వం వెల్లివిరిసింది. సమాంతరంగా ఇస్లామేతర మతాల వారిని అణగదొక్కిన ఐదు ఇస్లాం మత రాజ్యాలు పరిఢవిల్లాయి! ఛత్రపతి శివాజీ క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దిలో సర్వమత సమభావ వ్యవస్థను ఏర్పాటు చేయడం చరిత్ర! అదే సమయంలో ఔరంగజేబు ఇస్లామేతర మతాల నుంచి ‘జుట్టు పన్ను’ వసూలు చేయడం చరిత్ర.. గుణపాఠాలు ఎవరు నేర్చుకుంటున్నారు?
(ఆంధ్రభూమి సౌజన్యం తో)