
మహారాష్ట్రలోని నాగపూర్ లో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయించాలని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు ఉన్నందున వారిని పర్యవేక్షించడం తో పాటు విస్తృత స్థాయిలో పరీక్షలు చేయడానికి సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ సామాజిక సంస్థల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ పిలుపు మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లోక కళ్యాణ్ సమితి, మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో “మిషన్ విశ్వాస్” చేపట్టింది.
లోకకళ్యాణ సమితి మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ అధికారుల ఆధ్వర్యంలో కరోనా లక్షణాలున్న బాధితుల జాబితాను తయారు చేసి పరీక్షలు చేస్తోంది. ఈ మేరకు గత కొద్ది రోజుల్లో 15వేలకు పైగా కరోనా పాజిటివ్ రోగులను లోకకళ్యాణ స్వయంసేవకులు సంప్రదించారు. అందుకు ‘సేవ్ అంకుర్” అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కొంత మంది వైద్య విద్యార్థులు లోక కళ్యాణ సమితి స్వయంసేవకులకు సహకరించారు.


నాగపూర్ లోని మొత్తం పది జోన్ లలో 500 మందికి పైగా స్వయంసేవకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు మనోధైర్యం కల్పిస్తూ సేవలను అందిస్తున్నారు. స్వయంసేవకులు ఫేస్ మాస్కులు, గ్లౌస్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కరోనా బాధితులతో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో కూడా లోకకళ్యాణం సమితి ఆధ్వర్యంలో సుమారు 60 వేలకు పైగా నిత్యావసర సరుకుల కిట్లను నిరుపేదలకు అందించారు.
Source : VSK BHARATH