గుజరాత్ వడోదరలోని మకర్‌పురా ప్రాంతంలో ఉన్న మదర్ థెరిసా స్థాపించిన “మిషనరీస్ ఆఫ్ ఛారిటీ” మత మార్పిడి కార్యకలపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో స్థానిక మకర్‌పురా పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. జిల్లా సామాజిక సంరక్షణ అధికారి మయాంక్ త్రివేది ఫిర్యాదు మేరకు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
వడోదరా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్, జిల్లా సామాజిక సంరక్షణ అధికారి డిసెంబర్ 9న మకర్‌పురా లోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రాంగణాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న హిందూ బాలికలు క్రైస్తవ మత పుస్తకాలను చదవాల్సిందిగా బలవంతానికి గురవుతున్నారని, అలాగే క్రైస్తవ మత ప్రార్థనలలో పాల్గొనేలా బాలికలను ఒత్తిడి చేస్తున్నట్టు త్రివేది గుర్తించారు.
ఈ విషయంపై ఆయన వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయగా మకరపుర మిషనరీస్ ఆఫ్ ఛారిటీపై IPC సెక్షన్లు 295 A (ఒక వర్గానికి చెందిన వారి మత విశ్వాసాలను అవమానించడం, ఉద్దేశపూర్వకంగా హానికరమైన చర్యలకు పాల్పడటం), సెక్షన్ 298 (ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తి మతపరమైన కించపరిచే విధంగా మాట్లడటం), గుజరాత్ మతస్వేచ్చా చట్టం 2003 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
“ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి డిసెంబర్ 9వరకు మిషనరీస్ ఆఫ్ చారిటీ హిందువుల మతపరమైన మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది. బాలికల వసతి గృహంలో బాలికలను క్రైస్తవ మతంలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బైబిల్ చదవమని వారిని బలవంతం చేయడం, మెడలో సిలువ వేసుకోవాలని ఒత్తిడి చేయడం, బాలికలు ఉపయోగించే టేబుల్‌పై బైబిల్‌ను ఉంచడం వంటి మతమార్పిడి కార్యకలపాలకు పాల్పడుతున్నారు…. బాలికలను బలవంతంగా మత మార్పిడి చేయడానికి ప్రయత్నించడం నేరం” అని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఈ కేసు గురించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్‌బి కుమావత్ మాట్లాడుతూ.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ఈ ఆరోపణలపై విచారణ చేపట్టడంతో ఫిర్యాదు నమోదైంది. ఆరోపణలపై పూర్తి విచారణ జరిపి వాస్తవాలను సేకరించనున్నట్టు ఆయన తెలిపారు.
Source : ORGANISER