మత మార్పిళ్ల వ్యతిరేక బిల్లుకు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత గతంలో ఉన్న మత స్వేచ్ఛ చట్టం – (1968) రద్దవుతుంది. ఈ బిల్లు ప్రకారం బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడితే జరిమానాలతో పాటు, జైలు శిక్ష విధిస్తూ ప్రతిపాదనలు చేశారు.
మోసపూరిత మార్గాల ద్వారా జరిగే మత మార్పిళ్లకు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని తీసుకువస్తున్నటు్ట మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు.
“ఈ బిల్లు ప్రకారం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మైనర్ బాలికలను, మహిళలను బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించినట్టు రుజువైతే రూ .50వేల జరిమానతో పాటు 2 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు.” అని మిశ్రా మీడియా సంస్థకు వెల్లడించారు.
బిల్లు ప్రకారం, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమిష్టిగా మత మార్పిడికి పాల్పడితే 5 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా ఈ మతమార్పిళ్లకు సహాయపడే సంస్థను నడుపుతున్న వారితో పాటు అటువంటి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల కూడా శిక్షార్హులవుతారు.
అయితే, స్వచ్ఛందంగా ఇతర మతాలకు మారాలనుకునే వారు రెండు నెలల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఈ బిల్లులో ప్రతిపాధించారు. సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమైతే 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ .50,000 జరిమానా విధించవచ్చు.
మతమార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చిన ఉత్తర ప్రదేశ్ తరువాత దేశంలో రెండో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. గత నెలలో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ కొత్త మత మార్పిళ్ల వ్యతిరేక చట్టాన్ని యుపి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు.