Home News ఇస్లామిక్ సంస్థ బ్యాంక్ ఖాతాల్లో రూ.100కోట్లకు పైగా నిధులు

ఇస్లామిక్ సంస్థ బ్యాంక్ ఖాతాల్లో రూ.100కోట్లకు పైగా నిధులు

0
SHARE

కొన్నేళ్లుగా ఇస్లామిస్ట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పి.ఎఫ్‌.ఐ) కి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ 100 కోట్లకు పైగా జమైన‌ట్టు  ఈ.డి గురువారం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పి.ఎం.ఎల్.‌ఎ) కోర్టుకు తెలిపింది.  ఈ నిధులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి, ఎలా పంపిణీ చేశారన్న కోణంలో ద‌ర్యాప్తులో కొన‌సాగుతోంద‌ని పి.ఎఫ్.‌ఐ పై మనీలాండరింగ్ కేసులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ.డి పెర్కొంది. 2013 నుండి, పిఎఫ్ఐ వివిధ నేరాలకు పాల్పడుతోంద‌ని, డబ్బు బదిలీలు, నగదు డిపాజిట్లు 2014 తర్వాత గ‌ణ‌నీయంగా పెరిగాయ‌ని ఈ.డీ తెలిపింది. డిసెంబ‌ర్ 3న దేశంలోని ప‌లు ఇస్లామిక్ సంస్థ‌ల‌పై మ‌నీ లాండ‌రింగ్ కేసులో భాగంగా  ఈడీ దాడులు చేప‌ట్టింది. ఈ ద‌ర్యాప్తులో బయటపడిన విషయాలను కోర్టు ముందుంచింది.

పి.ఎఫ్‌.ఐ దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత అల్లర్లకు సూత్రధారి అని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చారని ఈ.డి ఆరోపించింది. ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ సంస్థలతో ఉన్న సంబంధం కారణంగా ఈడి తో స‌హా ఇతర భద్రతా సంస్థలు పి.ఎఫ్‌.ఐ ని ప్ర‌మాద‌క‌ర సంస్థ‌లుగా ప‌రిగ‌ణించాయి. పి.ఎఫ్.‌ఐ కార్యకలాపాలను నిషేధించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని గ‌తంలో కోరాయి.

కేసు ద‌ర్యాప్తులో భాగంగా పి.ఎఫ్.‌ఐ అనుబంధ సంస్థ అయిన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (C.F.I) జాతీయ కార్యదర్శి కె.ఎ.రౌఫ్ షెరీఫ్ కస్టడీని పి.ఎం.ఎల్‌.ఎ కోర్టు మూడు రోజుల పాటు పొడిగించింది. హత్రాస్ అత్యాచార ఘటనలో ఉద్రిక్తతలను ప్రేరేపించడానికి ప్రయత్నించినందుకు, పి.ఎఫ్.‌ఐ సభ్యులకు,  సిద్దిక్ కప్పన్‌కు నిధులు సమకూర్చినందుకు రౌఫ్‌ను ఈ.డి అరెస్టు చేసింది. C.F.I కి బ్యాంక్ ఖాతా లేదని, న‌గ‌దు బ‌ద‌ల‌యింపు వ్య‌వ‌హారం రౌఫ్ ద్వారానే జ‌రిగింద‌ని ఈ.డి పేర్కొంది. 2018  నుంచి 2020 వ‌ర‌కు  రూ.1.35 కోట్లు జమ చేసినట్టు ఈ.డి. క‌నుగొంది. రౌఫ్ కి సంబంధించిన మరో ఖాతాలో రూ .67 లక్షలు కూడా దొరికాయ‌ని ఈ.డి వెల్ల‌డించింది.

Source :  Organiser