
ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11గంటలకు ఖమ్మం నగరం లోని శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయం లోనికి చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్ గారి పర్యవేక్షణ లో భద్రాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు శ్రీ కృష్ణ చైతన్య గారు తన భుజాలపై రామచంద్ర బంజార శివాలయ దళిత అర్చకులు శ్రీ రవిని మీద కుర్చొపెట్టుకుని గుడిలోకి ప్రవేశించి ముని వాహన ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
2700 సంవత్సరాల క్రితం తమిళనాడులో జరిగిన ముని వాహన సేవను ఆదర్శంగా తీసుకుని కొనసాగిన ఈ ఉత్సవంలో శ్రీ రంగరాజన్ గారు మాట్లాడుతూ “భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని, చిన్న,పెద్ద అనే తేడా లేకుండా జీవించాలని ఆ రోజుల్లోనే రామానుజాచార్యులు ఉపదేశించారు. అలాగే సంత్ రవిదాస్ తన బోధనలతో అన్ని వర్గాల వారిని భక్తి మార్గాన నడిపారు. చరాచర సృష్టిలో భగవంతుని దర్శించుకునే హిందు సమాజంలో మధ్యలో వచ్చిన అంతరాలను తొలగించవలసిన బాధ్యత మనదేనని శ్రీ రంగరాజన్ అన్నారు.
సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో జరిగే శుభకార్యాలకు అన్ని వర్గాల రాకపోకలు జరగాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి కీసర జయపాల్ రెడ్డి కార్యక్రమం నిర్వహించగా, శిష్యులు పవన్, ఆలయ అధ్యక్షులు సతీశ్, భజన బృందాలు, వివిధ సామాజిక సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



