Home News ఆర్ ఎస్ ఎస్ అభిమానిగా మారిన ముస్లిం కమ్యూనిస్ట్

ఆర్ ఎస్ ఎస్ అభిమానిగా మారిన ముస్లిం కమ్యూనిస్ట్

0
SHARE

“సి పి ఐ (ఎం)కు చెందిన DYFI తో పోలిస్తే సంఘ సంస్థ అయిన సేవాభారతి కేరళ వరద బాధితులను ఆదుకోవడంలో ముందుంది. కానీ కేరళ మీడియా ఈ విషయాన్ని ప్రజలకు ఏమాత్రం చెప్పలేదు.

సేవాభారతి చేసిన నిరంతర సహాయకార్యక్రమాలను మొదటి నుంచి మీడియా పట్టించుకోలేదు. వరద బాధితుల కోసం విరాళాలు సేకరించడం కానీ, నీటిలో మునిగి సహాయం కోసం చూస్తున్నవారిని ప్రాణాలకు తెగించి కాపాడటంగాని మీడియా దృష్టికి రానేలేదు. అయినా సేవాభారతి కార్యకర్తలు మౌనంగా తమ పని చేసుకుపోయారు. వారి సేవా నిరతిని ప్రజలు గుర్తించారు.”

పై మాటలు అన్నది ఎవరోకాదు పలు పురస్కారాలు అందుకున్న ప్రముఖ మలయాళం సినీ దర్శకుడు అలీ అక్బర్. సేవాభారతి నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి నాలుగు మంచి మాటలు చెప్పగానే కొందరు ఆయన పైన కూడా విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. ఒకప్పుడు ప్రబల కమ్యూనిస్టు అయిన అక్బర్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అభిమానిగా మారిపోయారు. ఆయన నిష్టవంతుడైన ముస్లిం కూడా. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తను ఆర్ఎస్ఎస్ అభిమానిగా ఎందుకు మారారో వివరించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏ పని సంకుచిత, స్వార్ధ ప్రయోజనాలు, పేరుప్రతిష్టాల కోసం చేయదు. ఇటీవల కేరళను వరదలు ముంచెత్తినప్పుడు అనేకమంది కార్యకర్తలు తామంత తాముగా సహాయకార్యక్రమాల్లోకి ఉరికారు. ఎలాంటి సంకోచం లేకుండా వరద నీటిలో ఈదారు. బురదలో నడిచారు. కులం, మతం తేడాలు చూడకుండా బాధితులందరిని కాపాడారు.

నేను బిజిపి వాడిని కాబట్టి ఆర్ఎస్ఎస్ ను మెచ్చుకుంటున్నానని కొందరు అనుకోవచ్చును. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను నిష్టవంతుడైన ముస్లింను. అంతేకాదు మూడేళ్ళ క్రితం వరకు నేనొక కమ్యూనిస్ట్ ని కూడా. మూడేళ్ళ క్రితం పంతనూర్ లో జరిగిన హింసాత్మక సంఘటనలు నా కళ్ళు తెరిపించాయి. ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో నాకు అప్పుడు తెలిసింది.

నేను నివసించేది పూర్తిగా ముస్లిం ప్రాంతం. దానికి తోడు ఇక్కడ ఆర్ఎస్ఎస్ ను తీవ్రంగా వ్యతిరేకించే కామ్రేడ్ లు కూడా ఎక్కువే. ఇలాంటి ప్రాంతంలో అల్లర్లు చెలరేగినప్పుడు   ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ లు రంగంలోకి దిగారు. వాళ్ళు మా ఇంటిని చుట్టుముట్టారు. నాకు భయంవేసింది. ఒక కామ్రేడ్, ముస్లిం ఇంటిని వారు చుట్టుముట్టారంటే ఎందుకో నాకు తెలిసిపోయింది. కానీ నా భయాన్ని దూరం చేస్తూ వాళ్ళు సహాయ హస్తాన్ని అందించారు. నన్ను సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్లారు. వారిపట్ల నా ఆలోచనకు ఆ క్షణంలో సిగ్గుపడ్డాను. వారితోపాటు వెళ్ళాను. నన్ను నస్తామంగలకు తీసుకువెళ్లారు. నేను కమ్యూనిస్ట్ నని వారికి తెలియదు. ఆ తరువాత నా గురించి తెలిసిన తరువాత కూడా నాపట్ల వారి ప్రవర్తన ఏమాత్రం మారలేదు. వారిలో ఏ ఒక్కరూ, కనీసం బాల స్వయంసేవక్ కూడా, నా వైపు అనుమానంగా చూడలేదు. వారి ఈ సద్భావం, ప్రేమ అనుభవించిన నేను నిలువెల్లా కరిగిపోయాను. ఒక సంస్థకు చెందిన కార్యకర్తలు ఇతరులతో అంత ప్రేమతో, అభిమానంతో వ్యవహరించడం నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు.

ఆ తరువాత అదృష్టవశాత్తు నేను కొన్ని సంఘ కార్యక్రమాలకు హాజరయ్యాను. అయినా ఎక్కడా నాకు సంఘ గురించి చెడు అభిప్రాయం కలగలేదు. సంఘ గురించి అనేక విషయాలు నాకు తెలిసాయి. సంఘ స్పృశించని రంగం లేదని తెలిసి ఆశ్చర్యం వేసింది.

ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సంఘ నిర్వహించే చాలామటుకు కార్యక్రమాల్లో కనీసం వారి బ్యానర్ కూడా ఉండదు. ఉదాహరణకు `సంఘ్ సక్షమ’ కార్యక్రమాన్నే తీసుకోండి. ఇది కళ్ళు లేని పిల్లల కోసం సంఘ్ నిర్వహిస్తున్న కార్యక్రమం. దేశవ్యాప్తంగా సంఘ అధ్వర్యంలో అనేక అనాధాశ్రమాలు నడుస్తున్నాయి. కానీ చాలామందికి ఆ సంగతే తెలియదు. ఎందుకంటే సంఘ పేరుప్రతిష్టల కోసం పాకులాడదు. మౌనంగా, పద్దతిగా తన పని చేసుకుపోతుంది.

పోస్ట్ కార్డ్ సౌజన్యంతో..

అనువాదం: విశ్వసంవాదకేంద్ర, తెలంగాణ