శ్రీ మన్మోహన్ వైద్య పత్రికా సమావేశం
“ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి నిర్మాణం, సమాజ సంఘటన చేస్తుంది. భాష, కులం ఆరాధన పద్ధతి, ప్రాంతం మొదలైనవాటన్నిటికంటే మించి మనమంతా ఒక్కటే అనే భావన అందరిలో కలిగించడమే ప్రధానం. దీనితో పాటు నిస్వార్థంగా సమాజం కోసం పనిచేసే అలవాటు శాఖ ద్వారా కలుగ జేస్తాము. స్వయంసేవక్ తన అభిరుచికి అనుగుణంగా అనేక రంగాలలో పనిచేస్తాడు. 35 సంస్థలలో స్వయంసేవకులు పనిచేస్తున్నారు. సంఘ ప్రేరణతో విద్యార్థి, వ్యవసాయ, కార్మిక, మహిళ, వనవాసీ, సహకార, ధార్మిక రంగాలలో పనిచేస్తున్నారు’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహా సర్ కార్యవాహ శ్రీ మన్మోహన్ వైద్య అన్నారు. మంత్రాలయంలో జరుగుతున్న సమన్వయ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో పర్యటన చేస్తున్నపుడు అనేక మందిని ప్రత్యక్షంగా కలుస్తూ ఉంటామని, ఆ పర్యటన అనుభావాలు, ఆలోచనలను పంచుకోవడానికి సమన్వయ సమావేశాల్లో కలిశామని ఆయన వెల్లడించారు. ఇతర సంస్థలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాయని, ఈ సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు చేయడం జరగదని ఆయన స్పష్టం చేశారు.
సమావేశాల్లో క్రింది విషయాలు చర్చకు వచ్చినట్లు శ్రీ మన్మోహన్ జీ వివరించారు:
1) కేరళ వరదలలో స్వయంసేవకులు ఎలా కష్టపడి పనిచేశారు. సేవాభారతి పేరుతో 1 లక్ష 20 వేల మంది పనిచేశారు. 250 వైద్య శిబిరాలలో 650 మంది వైద్యులు పనిచేశారు. 300 సహాయ శిబిరాలు ఏర్పాటుచేశారు. 75,600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సహాయ కార్యక్రమాలలో పాల్గొంటూ 23 సంవత్సరాల విశాల్ అనే స్వయంసేవక్ ప్రాణాలు కోల్పోయాడు. మత్స్యకార స్వయంసేవక్‌ల ద్వారా 350 పడవలలో వ్యక్తులను, సామాగ్రిని తరలించడానికి ఉపయోగించారు. 2 వేల టన్నుల బియ్యం 1 లక్ష మందికి అందించారు. 200 మందిరాలు, ప్రార్థనా మందిరాలు శుభ్రం చేశారు. 400 ఆసుపత్రులు శుభ్రం చేశారు. సెప్టెంబర్ 1న 2 లక్షల మంది పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. ఎటువంటి సమాచార వ్యవస్థ లేకపోయినా ఏ సూచన అవసరం లేకుండా స్వయంసేవకులందరూ ఒకే రకంగా ఆలోచించి పనిచేశారు. సేవా భారతి కార్యక్రమాలను ప్రశంసిస్తూ ఒక ముస్లిమ్ ట్వీట్ చేశాడు.
2) సమాజాన్ని కులం, ప్రాంతం, మతం, భాష పేరుతో విచ్చిన్నం చేసే ప్రయత్నాలను విఫలం చేయాలి. అన్నిటికి అతీతంగా మనమంతా ఒక్కటే అనే భావన ఉండాలి. సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ద్వారా జరిగి వేర్పాటువాద ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మనకు ఉండే సమస్యలకు పరిష్కారాన్ని వెతకాలి. ద్వేషాన్ని పెంచకూడదు. సమాజంలో ఉండే భిన్నతంలో ఏకత్వం చూడాలి.
3) జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి చెప్పడం పై కూడా చర్చ జరిగింది. 35 లక్షల సీడ్ బాల్స్ ఉపయోగించి, 500 చెరువులను ఒక ప్రాంతంలో మరల ఉపయోగంలోకి తెచ్చారు. మన పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు నీటిని జాగ్రత్తగా వాడడం నేర్పాలి. సమాజిక, భక్తి సంస్థలను కలుపుకుంటు పనిచేయడంపై చర్చ జరిగింది.
4) దేశంలో యువశక్తి ఎక్కువ. ఉత్సహం ఆలోచన ఉన్నా సరియైన దిశ, ఆదర్శవంతమైన వ్యక్తిత్వం అవసరం. యువత తప్పుదారి పట్టకుండా సమాజ క్షేమం ఆలోచించే విధంగా ప్రోత్సహించాలి.
5) నేడు చిన్నకుటుంబాలు ఎక్కువయ్యాయి. కుటుంబంలో అందరూ కలిసి ఉండడం, పిల్లలపై దృష్టిపెట్టడం, మంచి సంస్కారాలను అందించడం కోసం కుటుంబ ప్రబోదిని కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించడం జరిగింది.